Friday, April 26, 2024
Friday, April 26, 2024

సీబీఐ కస్టడీకి సిసోడియా

ఐదు రోజులకు కోర్టు అనుమతి
ఆప్‌ ఆందోళనలు… అరెస్టులు

న్యూదిల్లీ: మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయిన ఆప్‌ నేత, దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాకు రిమాండ్‌ విధిస్తూ సీబీఐ రౌస్‌ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది. సిసోడియాను మార్చి 4 వరకు ఐదు రోజుల రిమాండ్‌కు ఇస్తున్నట్టు పేర్కొంది. అంతకుముందు కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు సిసోడియాను ఐదు రోజులపాటు రిమాండ్‌కు ఇవ్వాలని సీబీఐ తరపు న్యాయవాది కోరారు. సిసోడియా రిమాండ్‌ ఎందుకు అడుగుతున్నారని న్యాయమూర్తి ప్రశ్నించగా…ఆయనను ఇంకా విచారించాల్సి ఉందని, వివరాలు రాబట్టాల్సి ఉందని చెప్పారు. తాము అడిగిన కీలక అంశాలపై వివరణ ఇవ్వకుండా సిసోడియా దాటవేశారని, సిసోడియా ఒకేసారి అనేక మొబైల్‌ ఫోన్లు మార్చి నిందితులతో మాట్లాడిన సాక్ష్యాలు లేకుండా చేశారని సీబీఐ తరపు న్యాయవాది వివరించారు. మద్యం విధానంలో చివరి నిమిషంలో మార్పులతో లైసెన్సులు పొందిన వారికి లబ్ధి చేకూర్చారని, కమీషన్‌ను 5 నుంచి 12 శాతానికి పెంచారని న్యాయవాది ఆరోపణలు చేశారు. కేసులో ఇప్పటికే అరెస్టైన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను ప్రత్యేక కోర్టు జడ్జి ముందు ప్రస్తావించారు. మరోవైపు విచారణకు సిసోడియా పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని ఆయన

తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తప్పుడు ఆరోపణలతో రిమాండ్‌ అడుగుతున్నారని పేర్కొన్నారు. రెండువైపుల వాదనలు ముగిశాక ఆర్డర్‌ను రిజర్వ్‌లో ఉంచిన కోర్టు…సాయంత్రానికి సిసోడియాకు ఐదు రోజుల రిమాండ్‌ విధించింది. కాగా, మద్యం పాలసీ కుంభకోణం కేసులో సిసోడియాను సీబీఐ నిన్న అరెస్టు చేసింది. 8 గంటల పాటు ప్రశ్నించినా ఆయన నుంచి సంతృప్తికరమైన సమాధానాలు రాలేదని సీబీఐ అధికారులు తెలిపారు. ఐపీసీ 120 బీ, 477 ఏ సెక్షన్లు, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 7 కింద సిసోడియాను అరెస్టు చేశారు.
సీబీఐ అధికారులే వ్యతిరేకిస్తున్నారు: కేజ్రీవాల్‌
సిసోడియా అరెస్టును సీబీఐ అధికారుల్లో ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చెప్పారు. అయితే, రాజకీయ ఒత్తిడి కారణంగా ఎవరూ నోరువిప్పలేని పరిస్థితిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ‘సిసోడియా అరెస్టును వ్యతిరేకిస్తున్నట్లు ఎక్కువమంది సీబీఐ అధికారులు నాకు చెప్పారు. నా పట్ల వారందరికీ మంచి గౌరవం ఉంది. సిసోడియాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవు. అయితే, సిసోడియా అరెస్టు కోసం రాజకీయ ఒత్తిడి తీవ్రంగా ఉంది. రాజకీయ బాసుల మాటలు వారు వినాల్సిందేగా’ అని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. మరోవైపు ఇవాళ కూడా సీబీఐ కార్యాలయం వద్ద పెద్దఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అక్కడ, బీజేపీ కార్యాలయం వద్ద ఆందోళ నకు దిగిన ఆప్‌ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీడీయూ మార్గ్‌ మీదుగా బీజేపీ కార్యాలయా నికి వెళ్లేందుకు ఆప్‌ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆప్‌ నాయకులు, కార్యకర్తలను బస్సుల్లోకి తోసేసిన దృశ్యాలు కనిపించాయి. దాదాపు 10, 15 బస్సుల్లో కార్యకర్తలను తరలించారు. తమ నాయకులపై ప్రతిరోజు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆప్‌ నాయకులు ఆరోపించారు. ఆప్‌ ఎమ్మెల్యేలు భరద్వాజ్‌, అతిషి ఆందోళనకు నాయకత్వం వహించారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. జిందాబాద్‌ సిసోడియా అంటూ నినదించారు. దిల్లీలోని అనేక ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. వాస్తవానికి సీబీఐ సిసోడియాకు గత ఆదివారం సమన్లు జారీ చేసింది. దిల్లీ బడ్జెట్‌పై కసరత్తు చేస్తున్నందున తనకు కొంత గడువు ఇవ్వాలని ఆయన కోరారు. దీంతో విచారణ ఈ ఆదివారానికి వాయిదా వేసింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ఏ1గా ఉన్న సిసోడియాను గతేడాది అక్టోబరు 17న మొదటిసారి 9 గంటల పాటు ప్రశ్నించింది. నవంబరు 25న చార్జిషీట్‌ దాఖలు చేసినా… దాంట్లో సిసోడియా పేరు చేర్చలేదు. దినేశ్‌ అరోరా ఇచ్చిన వాంగ్మూలం, ‘సౌత్‌ లాబీ’గా వ్యవహరిస్తున్న కోటరీలోని రాజకీయ నాయకులు, మద్యం వ్యాపారులను ప్రశ్నించినప్పుడు లభించిన సమాచారం ఆధారంగా సిసోడియా కోసం సీబీఐ విస్తృత ప్రశ్నావళి తయారు చేసిందని తెలిసింది. ఇదే కేసులో డిసెంబరులో సీబీఐ తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించింది. ఇటీవల కవిత మాజీ చార్టెర్డ్‌ అకౌంటెంట్‌ గోరంట్ల బుచ్చిబాబును అరెస్టు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img