Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

సేవలు, విధులను విస్మరించవద్దు

ట్రైనీ ఐఏఎస్‌లకు మోదీ ఉద్బోధ
డెహ్రాడూన్‌: భారత్‌ను అత్యాధునిక, స్వయం సమృద్ధి దేశంగా రూపొందించాలన్న లక్ష్యాన్ని ఎన్నటికీ విడనాడవద్దని ప్రధాని నరేంద్రమోదీ గురువారం ట్రైనీ ఐఏఎస్‌ అధికారులకు ఉద్బోధించారు. ముస్సోరిలోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌లో ట్రైనీ ఐఏఎస్‌ అధికారులతో మోదీ మాట్లాడారు. కోవిడ్‌ మహమ్మారి తర్వాత భారత్‌ తనకు తాను అభివృద్ధి చెందడమే కాకుండా నవ ప్రపంచంలో అతిపెద్ద పాత్ర పోషిస్తోందని ప్రధాని చెప్పారు. ‘సివిల్‌ సర్వీసు ట్రైనీలకు సంబంధించిన అనేక బ్యాచ్‌లతో నేను మాట్లాడాను. కానీ ఈ ఏడాది భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్నాయి. అందుకు మీరు ప్రత్యేకం. భారత్‌ వందేళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలు జరుపుకునే సమయానికి మీరు సర్వీసులో ఉంటారు’ అని మోదీ చెప్పారు. ‘మీ విధులు, సేవల నుంచి ఏనాడు వెనకడుగు వేయవద్దు. మీ సర్వీసు మొత్తంఈ రెండు లక్షణాలను వదులుకోవద్దు. అధికారం అనేది వ్యక్తిగతంగానూ, సంస్థాగతంగానూ హాని చేస్తుంది. అందువల్ల అధికారాన్ని తలకెక్కించుకోవద్దు’ అని హితబోధ చేశారు. భారత్‌ను సంస్కరణపరంగా, పనితీరుపరంగా, పరివర్తనపరంగా ముందుకు తీసుకెళ్లాలన్న భావనను ఎన్నటికీ వదులుకోవద్దని సూచించారు. ‘మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలకు మేలు చేసే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా వెనుకాడవద్దు. సమాజంలో అంతిమంగా ప్రజలకే మనం సేవలందించాలి. దీనిని విస్మరించవద్దు’ అని ప్రధాని తెలిపారు. సామాజిక మార్పులో మీరు భాగస్వాములు కావాలి. అందుకు నాణ్యమైన నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి. సమిష్టి స్ఫూర్తి చాలా ముఖ్యం. సమాజంలో కీలక మార్పులు తీసుకురావడం అత్యవసరం’ అని మోదీ ఉద్బోధించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img