Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

హైకోర్టులో ప్రభుత్వానికి షాక్‌

. అమరావతి పాదయాత్ర యథాతథం
. రైతులకు ఐడీ కార్డులు జారీచేయాలని ఆదేశం

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: అమరావతి రైతుల పాదయాత్రను నిలుపుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. దీంతో ప్రభుత్వానికి మరోసారి హైకోర్టు నుంచి ఎదురు దెబ్బ తగిలింది. అమరావతి పాదయాత్రను యథాతథంగా కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. పాదయాత్రలో 600 మంది రైతులు పాల్గొనవచ్చని ఆదేశాలిచ్చింది. ఐడీ కార్డులు ఉన్నవారు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఐడీ కార్డులు రైతులకు వెంటనే ఇవ్వాలని పోలీసు అధికారులను హైకోర్టు ఆదేశించింది. సంఫీుభావం తెలిపే వారు రోడ్డుకు రెండు వైపులా ఉండాల్సిందేనని గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. పాదయాత్ర ప్రారంభించుకోవచ్చని, సంఫీుభావాన్ని ఏ రూపంలోనైనా తెలపవచ్చని న్యాయస్థానం సూచించింది. గతంలో కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండాలని తాజాగా హైకోర్టు మరోసారి ఉత్తర్వులిచ్చింది.
త్వరలో మహాపాదయాత్ర: శివారెడ్డి
త్వరలో అమరావతి మహా పాదయాత్రను పున:ప్రారంభిస్తామని అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌ శివారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహా పాదయాత్రను నిలుపుదల చేసిన రామచంద్రాపురం నుంచే త్వరలోనే యాత్ర కొనసాగుతుందన్నారు. రైతులతో, సమన్వయ కమిటీలతో సమావేశం నిర్వహించి ప్రారంభ తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వానికి కోర్టు తీర్పు ద్వారా ఇప్పటికైనా బుద్ధి రావాలని, పాదయాత్రకు అడ్డంకులు సృష్టించకూడదని హితవు పలికారు. పాదయాత్ర దివ్యరథానికి అమర్చిన సీసీ కెమేరాలను పోలీసులు తీసుకెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కోర్టు నిబంధనలకు విరుద్ధంగా సీసీ కెమేరాలు తీసుకెళ్లిన పోలీసుల పై ప్రైవేట్‌ కేసులు వేస్తామన్నారు. రాష్ట్రానికి ఒకే రాజధాని విశాఖ అంటూ మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యల పై రాయలసీమ వైసీపీ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img