Friday, April 26, 2024
Friday, April 26, 2024

16 ఏళ్లుగా పెరగని పింఛన్‌

. కేంద్రాన్ని నిలదీస్తున్న ఆర్థికవేత్తలు
. ఆహార భద్రత చట్ట ఉల్లంఘనే
. మోదీ సర్కార్‌కు లేఖ

న్యూదిల్లీ: సామాజిక భద్రత కింద కేంద్రం తన వంతుగా నిరుపేదలకు ఇచ్చే పింఛన్లలో గత 16 ఏళ్లుగా పురోగతిలేదు. ఆహార భద్రతా చట్టం ప్రకారం ప్రసూతి ప్రయోజనాల కింద ఇచ్చే నిధులను బడ్జెట్‌లో పెంచాలని కోరినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇది అన్యాయమంటూ ప్రముఖ ఆర్థికవేత్తలు కేంద్రం వైఖరిని దుయ్యబడుతున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లోనైనా పెంచాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు. సామాజిక భద్రత కింద నిరుపేదల పింఛన్లకు కేంద్రం తన వాటా పెంచకుండా చట్టాలను ఉల్లంఘించడాన్ని ఆర్థిక వేత్తలు తప్పుపట్టారు. 2006 నుంచి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్లలో కేంద్రం తన వాటా పెంచలేదని పెదవి విరిచారు. ప్రముఖ ఆర్థిక వేత్తలు జీస్‌ డ్రేజ్‌, అభిజీత్‌ సింగ్‌, దేశ్‌ పాండే తదితర 51 మంది ఆర్థకవేత్తలు ఈ మేరకు మోదీ సర్కారుకు లేఖ రాశారు. ఇదే విషయాన్ని తాము 2015, 2017లో అప్పటి ఆర్థిక మంత్రి జైట్లీ దృష్టికి తీసుకొచ్చినా పెడచెవిన పెట్టారని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ సారి బడ్జెట్‌లోనైనా పింఛన్లు, ఆహార భద్రతా చట్టం-2013 కింద ప్రసూతి ప్రయోజనాల కింద ఇచ్చే నిధులను పెంచాలని కోరారు. ఈ చట్టం కింద ఇచ్చే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 60:40 నిష్పత్తిలో ఉండాలని కోరినా కేంద్రం నిధులు కేటాయించటం లేదని, ఇది అన్యాయమంటూ కేంద్రం వైఖరిని దుయ్యబట్టారు. సామాజిక భద్రత కింద కేంద్రం తన వంతుగా కేవలం వృద్ధులకు రూ.200, వితంతువులకు రూ.300 చెల్లిస్తుందని, దీన్ని రూ.500లకు పైగా పెంచాలని కోరారు. అందుకయ్యే నిధులను బడ్జెట్లో కేటాయించాలని విన్నవించారు.
ప్రతి కాన్పునకు రూ.6000 చెల్లించాలి
చట్టబద్ధంగా ప్రతి కాన్పునకు ఒక్కో బిడ్డకు రూ.6000 ప్రసూతి ప్రయోజనం కల్పించాలని ఆర్థిక నిపుణులు గుర్తుచేశారు. కేంద్రం తాను చేసిన చట్టాన్ని తానే ఉల్లంఘిస్తుందని విమర్శించారు. దీని అమలుకు 2017లో ప్రధానమంత్రి మాతృవందన యోజనను తీసుకొచ్చినా, బడ్జెట్‌లో రూ.2,500 కోట్లకు మించి నిధులు కేటాయించలేదని తెలిపారు. రూ.5,000… అదీ ఒకే బిడ్డకు పరిమితం చేయటం చట్ట ఉల్లంఘన కిందకే వస్తుందని తప్పుపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img