Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

2న విజయవాడలో మహాధర్నా

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో- అమరావతి: జగనన్న కాలనీలలో నిర్మించే ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున నిధులు ఇవ్వాలని, టిడ్కో గృహ సముదాయాలకు మౌలిక వసతులు కల్పించి, తక్షణమే లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ అధ్వర్యంలో మార్చి 2వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న మహాధర్నాను జయప్రదం చేయాల్సిందిగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ…రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల ఇళ్లు ఇచ్చామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం…వాటి నిర్మాణ స్థితిగతుల్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏమాత్రం నివాసయోగ్యంకాని విధంగా కేవలం సెంటు స్థలం కేటాయించి చేతులు దులుపుకుందని తెలిపారు. పట్టణాలకు, పని ప్రాంతాలకు సుదూరంగా కొండలు, గుట్టలు, చెరువులు, ముంపు ప్రాంతాలలో పేదలకు ఇళ్లస్థలాలు కేటాయించడంతో ఆయా ప్రాంతాలలో ఇళ్లు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సెంటు స్థలం ఒక కుటుంబ నివాసానికి ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్ల చొప్పున ఇళ్లస్థలాలు కేటాయించాలని సీపీఐ డిమాండ్‌ చేసినప్పటికీ జగన్‌ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని, జగనన్న కాలనీలలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్‌, తాగునీటి సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలు ఇప్పటివరకూ కల్పించలేదని విమర్శించారు. ఒక్కో ఇంటికి ప్రభుత్వం ఇచ్చే లక్షా 80 వేల రూపాయలు ఏ మాత్రం సరిపోక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇళ్లను లబ్ధిదారులే నిర్మించుకోవాలని, లేకుంటే ఆయా ఇళ్లను రద్దు చేస్తామని బెదిరింపులకు దిగడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇస్తున్న రూ.లక్షా 80 వేలు పునాదులకు కూడా సరిపోవని, ట్రాక్టర్‌ ఇసుక రూ.8 వేలు, లారీ ఇసుక రూ.40 వేల ధర పలుకుతుంటే పేదలు ఇళ్లను ఎలా నిర్మించుకుంటారని ప్రశ్నించారు. ఇసుక, సిమెంట్‌, ఇటుక, స్టీల్‌ తదితర భవన నిర్మాణ సామాగ్రి ధరలు విపరీతంగా పెరిగిన తరుణంలో ఇళ్ల నిర్మాణం చేపట్టిన పేదలు అప్పుల పాలవుతున్నారని వివరించారు. జగనన్న ఇళ్ల కోసం ఇసుక, సిమెంటు ఉచితంగా సరఫరా చేయాలని, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. నిర్మాణం పూర్తిచేసుకున్న లక్షలాది టిడ్కో గృహాలను ఇంతవరకు లబ్ధిదారులకు అప్పగించకుండా జగన్‌ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. సొంతగూడు సమకూరుతుందన్న ఆశతో అప్పులు తెచ్చి డిపాజిట్లు కట్టిన లబ్ధిదారులు మూడేళ్లుగా టిడ్కో ఇళ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని వివరించారు. తక్షణమే టిడ్కో గృహ సముదాయాలకు మౌలిక సదుపాయాలు కల్పించి, లబ్ధిదారులకు స్వాధీనపరచాలని డిమాండ్‌ చేశారు. జగనన్న ఇళ్లు, టిడ్కో ఇళ్లపై ఇప్పటికే లబ్ధిదారులతో అధికారులకు అర్జీలు ఇప్పించడం, కలెక్టర్ల కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించినట్లు గుర్తుచేశారు. మార్చి 2న విజయవాడలో మహాధర్నా జరగనుందని, లబ్ధిదారులతోపాటు ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని రామకృష్ణ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img