Friday, April 26, 2024
Friday, April 26, 2024

2017లోనే పెగాసస్‌ను భారత్‌ కొనుగోలు చేసింది

న్యూయార్క్‌ టైమ్స్‌ సంచలన కథనం
గతేడాది దేశాన్ని కుదిపేసిన పెగాసస్‌ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.2017లోనే ఇజ్రాయెల్‌ తో దానిపై డీల్‌ జరిగిందని న్యూయార్క్‌ టైమ్స్‌ సంచలన కథనం ప్రచురించింది. క్షిపణి వ్యవస్థతో పాటు స్పైవేర్‌ పెగాసస్‌ నూ 200 కోట్ల డాలర్లతో భారత్‌ కొనుగోలు చేసిందని ఆరోపించింది. కొందరు జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, రాజకీయనాయకులపై కొన్ని దేశాల ప్రభుత్వాలు పెగాసస్‌ తో నిఘా పెట్టాయన్న కథనాలు గత ఏడాది సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజా ఆరోపణలతో మరోసారి దానిపై వేడి రాజుకుంది.
‘ద బ్యాటిల్‌ ఫర్‌ ద వరల్డ్స్‌ మోస్ట్‌ పవర్‌ ఫుల్‌ సైబర్‌ వెపన్‌’ పేరిట న్యూయార్క్‌ టైమ్స్‌ కథనాన్ని ప్రచురించింది. పెగాసస్‌ వ్యవహారంపై దాదాపు ఏడాదిపాటు దర్యాప్తు జరిపి ఈ కథనం రూపొందించినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడిరచింది. ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ ప్రచురించిన కథనం ప్రకారం, ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ దాదాపు ఓ దశాబ్దం నుంచి నిఘా సాఫ్ట్‌వేర్‌ను సబ్‌స్క్రిప్షన్‌ ప్రాతిపదికపై ప్రపంచవ్యాప్తంగా దర్యాప్తు సంస్థలకు, నిఘా సంస్థలకు అమ్ముతోంది. ఇతర ప్రైవేటు కంపెనీలు, ప్రభుత్వ నిఘా సంస్థలకు సాధ్యం కానంతటి సమర్థవంతంగా తమ స్పైవేర్‌ పని చేస్తుందనే హామీతో ఈ సాఫ్ట్‌వేర్‌ను అమ్ముతోంది ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌ ఫోన్లలోని ఎన్‌ క్రిప్ట్‌ చేసిన సమాచారాన్నీ చోరీ చేసేలా దానిని రూపొందించింది’’ అని పేర్కొంది. 2017లో ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్లారని, ఆ దేశ పర్యటనకు వెళ్లిన ప్రధానిగా చరిత్ర సృష్టించారని గుర్తు చేసింది. ఆ పర్యటనలోనే నాటి ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో 200 కోట్ల డాలర్లతో అత్యాధునిక ఆయుధ వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం కుదిరిందని చెప్పింది. ఆ ఒప్పందంలో ఓ క్షిపణి వ్యవస్థ, పెగాసస్‌లే కీలకమని వ్యాఖ్యానించింది. కొన్ని నెలల తర్వాత నెతన్యాహు భారత పర్యటనకు వెళ్లారని చెప్పింది.పర్యవసానంగా 2019 జూన్‌లో ఇజ్రాయెల్‌కు అనుకూలంగా భారత దేశం ఐక్య రాజ్య సమితి ఆర్థిక, సాంఘిక మండలిలో ఓటు వేసినట్లు తెలిపింది. ఓ పాలస్తీనా మానవ హక్కుల సంస్థకు అబ్జర్వర్‌ హోదాను నిరాకరిస్తూ ఈ ఓటు వేసినట్లు తెలిపింది. భారత్‌ ఇజ్రాయెల్‌ విషయంలో ఈ విధంగా చేయడం ఇదే మొదటిసారి అని తెలిపింది. అమెరికాలోని ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) కూడా పెగాసస్‌ స్పైవేర్‌ను కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా భారత్‌లో రాహుల్‌ గాంధీ సహా పలువురు రాజకీయ నాయకులు, మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులపై పెగాసస్‌ తో నిఘా పెట్టారంటూ గత ఏడాది ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయితే, ప్రభుత్వం మాత్రం తాము ఎవరిపైనా నిఘా పెట్టలేదని, దానికి ఎలాంటి ఆధారాలూ లేవని స్పష్టం చేసింది.దీనిపై విచారణకు గత ఏడాది అక్టోబర్‌ లో సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. దేశ భద్రతంటూ ప్రతీసారి కేంద్ర ప్రభుత్వం తప్పించుకోజాలదని, ఇలాంటి వాటితో నిఘా పెడుతుంటే సుప్రీంకోర్టు చూస్తూ ఊరుకోదని స్పష్టం చేసింది. ఆ తర్వాత రాజకీయంగా అది ఎంత పెద్ద దుమారం రేపిందో తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img