Friday, April 26, 2024
Friday, April 26, 2024

భూమి కోసం ప్రాణాలొదిలిన రైతు

ఉద్దేశపూర్వకంగానే హత్య చేశారంటూ కుటుంబసభ్యుల ఆందోళన
అధికారులపై చర్యలు తీసుకోవాలి అఖిలపక్షం డిమాండ్‌

విశాలాంధ్ర-వెదురుకుప్పం/పెనుమూరు: చిత్తూరు జిల్లా పెనుమూరు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద శనివారం భూమి కోసం ఓ రైతు ప్రాణాలొదిలిన ఘటన చోటుచేసుకుంది. మండలంలోని రామకృష్ణాపురం పంచాయతీ రాజాఇండ్లు గ్రామానికి చెందిన రత్నం బోయుడు (55) అనే రైతుకు సర్వే నెంబర్‌ 918/4లోని భూమికి 1974లో లీజు పట్టా ఇచ్చారు. రైతుకు భూమి చెందకూడదనే ఉద్దేశంతో తిమ్మరాజు కండ్రిగ గ్రామస్తులు తరచూ అభ్యంతరం చెబుతుండడంతో రత్నం… 2009లో చిత్తూరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఆ భూమి అతడిదేనని న్యాయస్థానం పర్మినెంట్‌ ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చింది. ఆ తర్వాత తిమ్మరాజు కండ్రిగ గ్రామస్తులు కొన్ని అభ్యంతరాలు చెబుతూ ఇటీవల రత్నంకు చెందిన భూమిలో పక్కా ఇళ్లు నిర్మించుకున్నారు.
ఈ విషయంలోనూ రత్నం కోర్టుకు వెళ్లారు. నాలుగు రోజుల క్రితం మిగిలిన భూమిని చదును చేసేందుకు ప్రయత్నించారు. వీఆర్వో వెళ్లి పనులు చేయకూడదని అభ్యంతరం చెప్పారు. ఇదే విషయంపై అదేరోజు తహసీల్దార్‌ రమణిని కలిసి సమస్య వివరించాడు. అక్కడే ఉన్న స్థానిక ప్రజాప్రతినిధి, రత్నానికి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన రైతు అనారోగ్యం పాలయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొంది ఆరోగ్యం కుదుట పడిన తర్వాత శుక్రవారం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టాడు. ఈక్రమంలో శనివారం మధ్యాహ్నం అధికారులతో మాట్లాడుతూనే ఒక్కసారిగా కుప్పకూలాడు. సిబ్బంది అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న మృతుడి కుమారులు, కుమార్తె తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. ఉద్దేశపూర్వకంగానే రాజకీయ నాయకుల అండతో తమ తండ్రిని హత్య చేసి ఆసుపత్రికి తరలించారని ఆరోపించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రైతు మృతికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ, జనసేన నాయకులు డిమాండ్‌ చేశారు.
రత్నం కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వండి: జనార్ధన్‌
తిరుపతి`విశాలాంధ్ర: పెనుమూరు మండలం రాజాఇండ్లు గ్రామానికి చెందిన రత్నం అనే రైతు మృతి చెందడానికి రెవెన్యూ అధికారుల వైఫల్యమే కారణమని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టి.జనార్ధన్‌ ఆరోపించారు. ప్రభుత్వం రత్నం కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని, కారకులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. తన భూమిపై కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినా, రెవెన్యూ అధికారులు కాలయాపన చేసి అమలు చేయకపోవడం వలనే రైతు మృతి చెందాడన్నారు. రత్నం కుటుంబానికి న్యాయం జరగకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img