Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

గుజరాత్‌లో ఉద్యోగుల పోరుబాట

ధర్నాలు, రాస్తారోకోలతో బీజేపీ సర్కార్‌ ఉక్కిరిబిక్కిరి

భూపేంద్ర పటేల్‌ ప్రభుత్వంపై ఆగ్రహం
డిమాండ్ల పరిశీలనకు మంత్రుల కమిటీ

అహ్మదాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, రైతులు, మాజీ సైనికోద్యోగులు, వ్యాపారులు తిరుగుబాటు బావుటా ఎగురవేయడంతో రెండు దశాబ్దాలకు పైగా గుజరాత్‌లో పాలన సాగిస్తున్న బీజేపీకి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. నిత్యం ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు నిర్వహిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పోలీసులే ప్రభుత్వంపై తిరగబడటం అక్కడి దారుణ పరిస్థితికి అద్దంపడుతోంది. అన్నివర్గాల్లో భూపేంద్ర పటేల్‌ ప్రభుత్వంపై ఆగ్రహం పెల్లుబుకుతోంది. 22 ఏళ్లుగా ప్రతిపక్షమే లేదన్నట్టు పాలన సాగిస్తూ ఎవ్వరినీ నోరెత్తకుండా చేసిన బీజేపీ నేతలు ఇప్పుడు అన్ని వర్గాల్లో రగులుతున్న ఆగ్రహ జ్వాలలను తట్టుకోలేకపోతున్నారు. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో విధిలేని పరిస్థితుల్లో వివిధ వర్గాల డిమాండ్ల పరిశీలనకు ప్రభుత్వం నలుగురు మంత్రులతో కమిటీ వేయాల్సి వచ్చింది.
పోలీసులే మొదటగా తిరుగుబాటు చేశారు. ఎంతోకాలంగా పెండిరగ్‌లో ఉన్న తమ సమస్యలను బీజేపీ డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఏమాత్రం పట్టించుకోవటంలేదని ఆగ్రహించి నెల క్రితం మెరుపు సమ్మెకు దిగారు. దీంతో దిగ్భ్రాంతికి గురైన ప్రభుత్వం పోలీసుల సంక్షేమానికి రూ.500 కోట్లు విడుదల చేసింది. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంఘం భారతీయ కిసాన్‌ సంఫ్‌ు (బీకేఎస్‌)సైతం ఆందోళన బాటపట్టింది.అధిక విద్యుత్‌ చార్జీలకు వ్యతిరేకంగా కఛ్‌, బన్స్‌కాంత జిల్లాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టింది. అలాగే ఒక్కో జిల్లాలో వ్యవసాయ మోటార్ల విద్యుత్‌ చార్జీలు ఒక్కో రకంగా ఉన్నాయి. రాష్ట్రంలో సగం విద్యుత్‌ అదానీ పవర్‌ నుంచే కొనుగోలు చేస్తుండటంతో చార్జీలపై ప్రభుత్వానికి ఏమాత్రం నియంత్రణలేకుండా పోయింది. దీంతో రాష్ట్రమంతా ఒకేరకం చార్జీలు వసూలు చేయాలని రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. పంచాయతీరాజ్‌ శాఖలో పనిచేస్తున్న 9 వేలమంది తమ డిమాండ్ల సాధనకు ఆందోళన ప్రారంభించారు. వీరి ఆందోళన ఉధృతికి ఏకంగా రెవెన్యూశాఖ మంత్రి జితేంద్ర ద్వివేదీ పదవి పోగొట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. మాజీ సైనికోద్యోగులు సైతం రాష్ట్ర ప్రభుత్వంపై పోరుకు దిగారు. అమర జవాన్ల కుటుంబాలకు కేవలం రూ. లక్ష మాత్రమే ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం అన్యాయమని, ఆ మొత్తాన్ని పెంచాలని ఆరు మాసాలుగా వారు ఆందోళన చేపడుతున్నారు. అయినా పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడటంతో ఉద్యమానికి భయపడి ఎక్స్‌గ్రేషియా రూ.కోటికి పెంచింది. రాష్ట్రంలో 26 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు ఆందోళన చేపడుతున్నారు. ఆరోగ్య ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో గత నెల 8 నుంచి సమ్మె చేస్తున్నారు. పీఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాట పట్టారు. వెంటనే పీఆర్సీ ప్రకటించాలని, కాంట్రాక్టు వ్యవస్థను ఎత్తేయాలని డిమాండ్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img