Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ప్రపంచంలోనే ఐదో ఆర్థిక శక్తిగా భారత్‌

ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధి నమోదుచేస్తోంది. కరోనా మహమ్మారి సృష్టించిన సవాళ్లను అధిగమించి క్రమంగా కోలుకోవడమే గాక, వేగంగా అడుగులు వేస్తూ సత్తా చాటుతోంది. తాజాగా బ్రిటన్‌ను దాటేసి ప్రపంచంలోనే ఐదో ఆర్థిక శక్తిగా అవతరించిందని ‘బ్లూమ్‌బర్గ్‌’ వెల్లడిరచింది. 2021 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత్‌… బ్రిటన్‌ను దాటేసి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ‘బ్లూమ్‌బర్గ్‌’ కథనం. అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి సేకరించిన జీడీపీ గణాంకాల ప్రకారం… ఆ త్రైమాసికం చివరి నాటికి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 854.7 బిలియన్‌ డాలర్లు ఉండగా… యూకే ఆర్థిక వ్యవస్థ 816 బిలియన్‌ డాలర్లు మాత్రమే. కొంతకాలంగా బ్రిటన్‌ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది… ఆ దేశంలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరుకుంటోంది… ఈ క్రమంలోనే ఆర్థిక వ్యవస్థ కుదేలైందని ఆ కథనం పేర్కొంది. రాబోయే రోజుల్లో బ్రిటన్‌ జీడీపీ మరింత పతనమయ్యే ప్రమాదముందని తెలిపింది. ఈ ఏడాది భారత కరెన్సీ రూపాయి విలువతో పోలిస్తే బ్రిటన్‌ కరెన్సీ పౌండ్‌ విలువ 8 శాతం మేర క్షీణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 నుంచి 7.5 శాతంగా వృద్ధి నమోదవ్వొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. 2021-22లో మన దేశం 8.7 శాతం వృద్ధి నమోదు చేసింది. సరిగ్గా దశాబ్దం క్రితం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్‌ 11వ స్థానంలో ఉండగా… బ్రిటన్‌ ఐదో స్థానంలో నిలిచింది. తాజాగా యూకేను దాటేసి భారత్‌ ఐదో స్థానానికి ఎగబాకడం విశేషం. భారత్‌ కంటే ముందు అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీ తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. భారత్‌ ఐదో ఆర్థిక శక్తిగా అవతరించడంపై కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ హర్షం వ్యక్తం చేశారు. భారత నౌకాదళానికి కొత్త చిహ్నాన్ని ఆవిష్కరించిన రోజే… భారత్‌ బ్రిటన్‌ను దాటేసి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. రాబోయే దశాబ్దంలో భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారడమే గాక, అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img