Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించండి

సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించి, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ అమలు చేసేందుకు, అనారోగ్య బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా దిగువ ప్రాంతాలన్నీ పదేపదే ముంపునకు గురవుతున్నాయనీ, ఏళ్లు గడుస్తున్నా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. పోలవరం ముంపు ప్రాంత గ్రామాల నిర్వాసితులకు ప్రభుత్వం ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వకుండా, పునరావాసంగా ఇళ్లు నిర్మించి ఇవ్వకపోవడంతో నిర్వాసితులు ఏటా ఇబ్బందు లెదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్నడూ లేనంతగా వరద ముంచెత్తడంతో ఈ ఏడు నిర్వాసితుల బాధలు వర్ణనా తీతమన్నారు. నేటికీ అనేక ముంపు ప్రాంతాల్లో వరద ఇబ్బందులు తగ్గలేదనీ, వరద బాధితులకు పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం రూ.10 వేలు పరిహారంగా ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.2 వేలు ఇచ్చి చేతులు దులుపుకోవడం విచారకరమన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై రాష్ట్ర ప్రభుత్వ జాప్యాన్ని పోలవరం ప్రాజెక్టు అధారిటీ (పీపీఏ) ఎత్తిచూపింది. పీపీఏకి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన లక్ష్యాల ప్రకారం మార్చి నుంచి ఆగస్టులోపు 12,984 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 3,594 కుటుంబాలను మాత్రమే తరలించింది. అందులోనూ పక్షపాత వైఖరి అవలంభించడం, తమకు ఇష్టం వచ్చిన రీతిలో నచ్చినవారికి ముందుగా పునరావాసం కల్పించినట్లు ఆరోపణలొస్తున్నాయని ఆ లేఖలో రామకృష్ణ పేర్కొన్నారు.
వరద తగ్గాక పారిశుద్ధ్య పనులు కూడా నామమాత్రంగా చేయడంతో సీజనల్‌ వ్యాధులైన డెంగీ, మలేరియా, వైరల్‌ జ్వరాలు విలీన మండలాల్లో ఊరూరా వ్యాపించాయనీ, విలీన మండలాల్లో వైద్యులు, మందుల కొరత కారణంగా బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్నా రని తెలిపారు. కుయుగూరు గ్రామంలో కారం సంధ్య (10) అనే బాలిక జ్వరం బారినపడి మరణించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం, పొలిపాక గ్రామంలో 17 మంది డెంగీ బారినపడడం, సకినాల వీరబాబు మృతిచెందడం విచాకరమన్నారు. నిర్వాసితులకు తగు న్యాయం చేయడంలో, వైద్య సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వెలుగుచూస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తమ సర్వస్వం ధారపోసి, భూములు, ఇళ్లు ఇచ్చిన నిర్వాసితులకు శాశ్వత పరిష్కారం చూపకుండా తాత్సారం చేయడం దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన నమ్మకద్రోహం వల్ల పోలవరం నిర్మాణం మరింత జాప్యమవ్వడంతోపాటు, అంచనాలు కూడా భారీగా పెరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా పూర్తి బాధ్యత వహించి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించి, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని ఆ లేఖలో రామకృష్ణ డిమాండ్‌ చేశారు. పోలవరం ముంపు ప్రాంతాలకు వైద్య బృందాలను పంపి, అనారోగ్య బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని కోరారు. ప్రాజెక్టు నిర్మాణ పరిపూర్తికి సమగ్ర కేంద్ర నిధులు సాధించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలనీ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఇప్పటికైనా స్పందించి పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని ఆ లేఖలో రామకృష్ణ కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img