Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

బీహార్‌ అసెంబ్లీ భవన శతాబ్ది ఉత్సవాలు…

ఆహ్వాన పత్రంలో కనిపించని గవర్నర్‌, సీఎం పేర్లు

మృతి చెందిన ఎమ్మెల్యేకు ఆహ్వానం

పాట్నా : రాష్ట్ర విధానసభ భవనం శతాబ్ది సంవత్సర ముగింపు కార్యక్రమ ఆహ్వాన పత్రికలో బీహార్‌ గవర్నర్‌, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత పేర్లు లేక పోవడం అధికార జేడీ(యూ), ఆర్‌జేడీలలో అసంతృప్తికి కారణమయింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ భవనం ముందు ఏర్పాటు చేసిన శతాబ్ది స్మారక స్థూపాన్ని ఆవిష్కరిస్తారు. బీహార్‌ గవర్నర్‌ ఫాగు చౌహాన్‌, సీఎం నితీశ్‌ కుమార్‌, ప్రతిపక్ష నాయకుడు తేజస్వి ప్రసాద్‌ యాదవ్‌ ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రితో వేదిక పంచుకుంటారు. రెండు పేజీల ఆహ్వాన పత్రం (హిందీలో) భారతదేశం 75వ స్వాతంత్య్ర ‘అమృత్‌ మహోత్సవ’, అసెంబ్లీ భవనం పునాది శతాబ్ది సంవత్సరం ముగింపు కార్యక్రమం సందర్భంగా ప్రజలకు అసెంబ్లీ స్పీకర్‌ విజయ్‌ కుమార్‌ సిన్హా ఆహ్వానంతో ప్రారంభమవుతుంది. అయితే ఈ కార్డులో బీహార్‌ గవర్నర్‌, సీఎం, ప్రతిపక్ష నేత పేర్లను పేర్కొనలేదు. రెండవ పేజీలో కార్యక్రమం, ఫంక్షన్‌, భద్రతా ప్రోటోకాల్‌, కార్యక్రమం అనంతరం విందుకు ఆహ్వానం గురించి ప్రస్తావన ఉంది. అయితే, శతాబ్ధి ఉత్సవాలకు హాజరుకావాలని మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం అందడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనియాంశమైంది. జేడీ(యూ) ఎమ్మెల్సీ, అధికార ప్రతినిధి నీరజ్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘ఆహ్వాన కార్డులోని విషయం, దానిలో ఎవరి పేర్లు ఉండాలో నిర్ణయించడం అసెంబ్లీ స్పీకర్‌ విచక్షణ’ అని అన్నారు. మరో జేడీ(యూ) నాయకుడు మాట్లాడుతూ ‘గవర్నర్‌, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడి పేర్లను ప్రస్తావిస్తే సముచితంగా ఉండేది’ అని పేర్కొన్నారు. 2005`2015 మధ్య పదవిలో ఉన్న అసెంబ్లీ మాజీ స్పీకర్‌ ఉదయ్‌ నారాయణ్‌ చౌదరి మాట్లాడుతూ ‘మొదట, అసెంబ్లీ కార్యదర్శి ఆహ్వానం పంపాలి. మరి గవర్నర్‌, సీఎం కాకుండా ప్రతిపక్ష నేత లేకుండా అసెంబ్లీ ఎలా పూర్తవుతుంది. కార్డులో ఈ ముగ్గురు ప్రముఖుల పేర్లు పెడితే సరిగ్గా ఉండేది’ అని అన్నారు. అయితే బీహార్‌ బీజేపీ అధికార ప్రతినిధి సంతోష్‌ పాఠక్‌ మాట్లాడుతూ ‘స్పీకర్‌ అసెంబ్లీకి సంరక్షకుడు అయినందున ఆయన ఆ హోదాలో ఆహ్వానం పంపారు. ఏది ఏమైనప్పటికీ, ఇది అసెంబ్లీ కార్యక్రమం’ అని తెలిపారు. కాగా, 1980వ దశకంలో లౌకాహా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ హై పయామిని ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానం పంపటం అందరిని ఆశ్చర్యపరిచింది. ఆయన నాలుగేళ్ల కిందట మృతి చెందిన విషయాన్ని కూడా గుర్తించకుండా కార్యక్రమానికి ఆహ్వానించడంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img