Friday, April 26, 2024
Friday, April 26, 2024

పేదల ఇళ్ల స్థలాలకు రాజధాని భూములు

. మళ్లీ సీఆర్‌డీఏ వివాదాస్పద నిర్ణయం
. హైకోర్టును ఆశ్రయించిన రైతులు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాజధాని నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన భూములను రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల పేదలకు కేటాయించాలని నిర్ణయించింది. గతంలో ఇదే నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టినప్పటికీ మళ్లీ సీఆర్‌డీఏ అదే నిర్ణయాన్ని తీసుకుంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇళ్లు లేనివారికి అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన 33వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయించారు. లబ్ధిదారుల జాబితాతో డీపీఆర్‌లు తయారు చేయాలని గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రతిపాదనలు సీఆర్డీఏకు అప్పగించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించేలా తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని సీఎం సూచించారు. మే నెల మొదటివారం నాటికి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇళ్లులేని పేదల చిరకాల వాంఛ నెరవేర్చే ఈ కార్యక్రమాన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈమేరకు అమరావతిలో పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కోసం ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ జీవో 45 కూడా జారీ అయింది. రాజధాని ప్రాంతంలో మొత్తం 1134.58 ఎకరాల భూమి పేదల ఇళ్లకోసం కేటాయించారు. మొత్తం 20 లే అవుట్లలో స్థలాలు కేటాయింపు జరగనుంది. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 48, 218 మంది పేదలకు ఇళ్ల పట్టాలు కేటాయించనున్నారు. ఐనవోలు, మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, కూరగల్లు, నిడమనూరు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కేటాయిస్తారు.
జీవో నంబర్‌ 45పై రాజధాని ఐకాస లంచ్‌ మోషన్‌ పిటిషన్‌
రాజధాని అమరావతి పరిధిలో ఇతర జిల్లాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపునకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌ 45పై రాజధాని రైతు ఐక్య కార్యాచరణ సమితి నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. రైతుల తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ఇదే విషయంపై గతంలో పిటిషన్‌ పెండిరగ్‌లో ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. ప్రధాన పిటిషన్‌ పెండిరగ్‌లో ఉండగా, ప్రభుత్వం జీవో విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమని కోర్టుకు తెలిపారు. గతంలో ఆర్‌`5 జోన్‌పై జీవోను హైకోర్టు సస్పెండ్‌ చేసిందని గుర్తు చేశారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రధాన పిటిషన్‌ ఎవరి వద్ద ఉందని ప్రశ్నించింది. త్రిసభ్య ధర్మాసనం వద్ద ఉందని పిటిషనర్‌ సమాధానమిచ్చారు. దీంతో తాజా పిటిషన్‌ను పెండిరగ్‌ పిటిషన్‌తో జత చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img