Friday, April 26, 2024
Friday, April 26, 2024

నేడు ఉపరాష్ట్రపతి ఎన్నిక

విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్‌ ఆల్వా
మద్దతు ప్రకటించిన టీఆర్‌ఎస్‌
ఎన్‌డీఏ అభ్యర్థి ధన్కర్‌కే అనుకూలంగా సంఖ్యలు

న్యూదిల్లీ: భారత తదుపరి ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు పార్లమెంటు సభ్యులు శనివారం ఓటు వేయనున్నారు. ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థిగా జగదీప్‌ ధన్కర్‌, ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్‌ ఆల్వా పోటీ చేస్తున్నారు. ఎన్‌డీఏకి అనుకూలంగా సంఖ్యాబలం ఉండడంతో పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్‌ ధన్కర్‌ సులభంగా విజయం సాధించేందుకు సిద్ధమయ్యారు. ఆల్వా పేరును నిర్ణయించేటప్పుడు సంప్రదింపులు లేవని ఆరోపిస్తూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో ప్రతిపక్ష ఐక్యతలో బీటలు కనిపించాయి. 80 ఏళ్ల ఆల్వా రాజస్థాన్‌ గవర్నర్‌గా పని చేశారు. 71 ఏళ్ల ధన్కర్‌ సోషలిస్టు నేపథ్యం కలిగిన రాజస్థాన్‌కు చెందిన జాట్‌ నాయకుడు. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుండగా, ఆ తర్వాత వెంటనే ఓట్ల లెక్కింపు ఉంటుంది. సాయంత్రంలోగా రిటర్నింగ్‌ అధికారి తదుపరి ఉపరాష్ట్రపతి పేరును ప్రకటిస్తారు. కాగా నామినేటెడ్‌ సభ్యులతో సహా లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగుస్తుంది. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్‌పర్సన్‌గా కూడా ఉంటారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలలో ఎలక్టోరల్‌ కాలేజీలో పార్లమెంటు ఉభయ సభలలో మొత్తం 788 మంది సభ్యులు ఉంటారు. ప్రతి ఎంపీ ఓటు విలువ ఒకే విధంగా ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఒకే బదిలీ ఓటు ద్వారా దామాషా ప్రాతినిధ్య వ్యవస్థకు అనుగుణంగా ఎన్నికలను నిర్వహిస్తారు. ఓటింగ్‌ రహస్య బ్యాలెట్‌ ద్వారా జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ఓపెన్‌ ఓటింగ్‌ అనే విధానం లేదని, ఎట్టి పరిస్థితుల్లో బ్యాలెట్‌ను ఎవరికీ చూపించడం పూర్తిగా నిషిద్ధమని, ఈ విషయంలో పార్టీలు తమ ఎంపీలకు విప్‌ జారీ చేయలేవని ఈసీ హెచ్చరించింది.
ఆల్వాకు టీఆర్‌ఎస్‌ మద్దతు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్‌ ఆల్వాకి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) మద్దతు ప్రకటించింది. ఆగస్టు 6న జరగనున్న పోలింగ్‌లో పార్టీకి చెందిన 16 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఆల్వాకు ఓటు వేయాలని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. గత నెలలో రాష్ట్రపతి ఎన్నికల్లోనూ విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు కూడా టీఆర్‌ఎస్‌ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కేశవ రావు శుక్రవారం పార్లమెంటు వెలుపల మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆల్వాకు మద్దతివ్వాలని, పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు నిర్ణయించారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు తదనుగుణంగా ఓటు వేయాలని కేసీఆర్‌ సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img