Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

కట్టెల పొయ్యి దిశగా పేదలు

పొగచూరిన ‘ఉజ్వల’

తిరోగమనంలో పథకం
భారీ ధరలతో రీఫిల్స్‌ కొనుగోలు చేయలేని లబ్ధిదారులు
పట్టించుకోని కేంద్రం

న్యూదిల్లీ: పెట్రో ధరల పెరుగుదల అనేక రంగాలు, వ్యవస్థలు, సంస్థలు, ప్రభుత్వ పథకాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉజ్వల పథకం నీరుగారిపోతోంది. పేద మహిళలను కట్టెల పొయ్యి అవస్థల నుంచి కాపాడడానికని చెబుతూ కేంద్రం ప్రవేశపెట్టిన ఉజ్వల వెలుగులు మసకబారుతున్నాయి. మళ్లీ పేదల ఇళ్ల్లకు కట్టెల పొయ్యిలే దిక్కవుతున్నాయి. రెండేళ్లుగా ఏటా కనీసం ఆరుసార్లు గ్యాస్‌ సిలిండర్ల ధరలు పెరగడం ఉజ్వల వినియోగదారులను బెంబేలెత్తించింది. ప్రభుత్వం ఉచితంగా ఇస్తామన్న గ్యాస్‌బండ…వారి పాలిట గుదిబండగా మారింది. వాస్తవానికి కరోన వ్యాప్తి, ఆ తర్వాత కొన్ని నెలల పాటు కూలీల వంటి చిరుజీవులకు ఉపాధి లభించకపోవడంతో ఆదాయాలు లేవు. మరోవైపు సిలిండర్‌ ధర రూ.1000 దాటి పోయింది. దీంతో వచ్చే ఆదాయంలో అత్యధికం సిలిండర్లకే వెచ్చిస్తే మిగిలేదేమిటని పేదలు భావిస్తున్నారు. ఫలితంగా ప్రతినెల కొన్ని లక్షల ఉజ్వల సిలిండర్లు రీఫిల్లింగ్‌కు నోచుకోవడం లేదు. 2016 మేలో ఈ పథకం ప్రారంభ సమయంలో ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్‌, పొయ్యి ఉచితంగా ఇచ్చింది. దేశంలో 8 కోట్ల మంది లబ్ధిదారులకు వీటిని అందివ్వాలని లక్ష్యంగా పెట్టుకొంది. పథకం ప్రారంభంలో సిలిండర్‌ ధర రూ.419.15గా ఉంది. ప్రస్తుతం అది రూ.1062కు చేరింది. ప్రభుత్వం ఉజ్వల లబ్ధిదారులకు రూ.200 రాయితీ ఇస్తామని ప్రకటించింది. అయినా లబ్ధిదారులు సిలిండర్‌ కొనుగోలుకు జంకుతు న్నారు. హైదారాబాద్‌లో ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు గ్యాస్‌ బండ ధర రూ.170కి పైగా పెరిగింది. 2021లో ఈ పథకం రెండో విడతలో మరో కోటి కనెక్షన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఉజ్వల పథకం కింద కనెక్షన్లు పొందిన వారిలో 90 లక్షల మంది గత ఆర్థిక సంవత్సరం ఒక్కసారి కూడా సిలిండర్‌ను రీఫిల్‌ చేయించలేదు. కోటి మంది లబ్ధిదారులు ఏడాది మొత్తంలో కేవలం ఒక్కసారి మాత్రమే రీఫిల్‌ చేయించినట్లు ఇంధన సంస్థలు చెబుతున్నాయి. ఆర్టీఐ ఉద్యమకారుడు చంద్రశేఖర్‌ గౌర్‌ ద్వారా ఈ వాస్తవాలు బహిర్గతమయ్యాయి. ఆయన ఐవోసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌ సంస్థలకు దరఖాస్తు చేశారు. ఉజ్వల వినియోగదారులు మొత్తం సగటున ఏటా కేవలం 3.66 సార్లు మాత్రమే రీఫిల్‌ చేయించుకొంటున్నట్లు సాక్షాత్తు ప్రభుత్వమే లోక్‌సభకు వెల్లడిరచిన విషయం విదితమే. మరో వైపు, కట్టెల పొయ్యిల వినియోగం నానాటికీ పెరు గుతోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం చాలా రాష్ట్రాల్లో 98శాతం కుటుంబాలకు ఎల్‌పీజీ, ఇతర శుద్ధ ఇంధన కనెక్షన్లు ఉన్నాయి. వాటి వినియోగం 80శాతం కుటుంబాల్లోనే జరుగుతోంది. 2019-20 లెక్కల ప్రకారం పశ్చిమబెంగాల్‌లో 40.2 శాతం మాత్రమే శుద్ధ ఇంధనాన్ని వినియోగిస్తున్నారు. రాజస్థాన్‌ (41.4), అసోం (42.1),యూపీ (49.5), హిమాచల్‌ ప్రదేశ్‌ (51.7), ఉత్తరాఖండ్‌ (59.2), హరియాణా (59.5), మణిపూర్‌ (70.4), కేరళ (72.1), పంజాబ్‌ (76.7), సిక్కిం (78.4), కర్ణాటక (79.7), మహారాష్ట్ర (79.7) శాతం వినియోగం ఉంది.
ఉజ్వల పథకం ప్రారంభించిన రెండేళ్ల తర్వాత 2018లో ది రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపాసినేట్‌ ఎకనామిక్స్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, మధ్య ప్రదేశ్‌లో ఉజ్వల వినియోగ దారుల్లో 85శాతం మంది కట్టెల పొయ్యిలను ఇంకా వినియోగిస్తున్నట్లు తేలింది. ఆ మరుసటి ఏడాది కాగ్‌ ఇచ్చిన నివేదికలోనూ ఉజ్వల కింద 3.21 సగటు రీఫిల్స్‌ అవుతున్నట్లు వెల్లడైంది. 2020లో ‘ది ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్‌’ లెక్కల ప్రకారం 22శాతం మంది రీఫిల్స్‌కు ముందుకు రావడంలేదు. 5 నుంచి 7 శాతం మందికి తొలి రీఫిల్‌ సబ్సిడీ అందలేదని తేలింది. సిలిండర్‌ కొనుగోలు సమయంలో మొత్తం చెల్లిస్తే తర్వాత రాయితీ మొత్తం ఖాతాలో పడుతుంది. దీంతో ఉజ్వల వినియోగదారులు తొలుత కనీసం రూ.1000కి పైగా వెచ్చించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాయితీ ఖాతాలో పడుతుంది. ఇక గ్యాస్‌ సిలిండర్ల డెలివరీ సమయంలో వసూళ్లు వీరికి భారంగా మారాయి. ఒక్కో సిలిండర్‌కు అనధికారికంగా రూ.30 నుంచి 50 వరకు వసూలు చేయడం ఇబ్బందికరంగా మారింది. భారత్‌లో కట్టెల పొయ్యి వినియోగం కారణంగా ఏటా కనీసం 5 లక్షల మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా బెర్కెలీలోని గ్లోబల్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రొఫెసర్‌ కిర్క్‌ స్మిత్‌ బృందం పరిశోధనలో తేలింది. దీంతో ఎల్‌పీజీ వినియోగం పెంచడం చాలా అవసరం. అదే సమయంలో కట్టెల కోసం అడవుల నరికివేత తగ్గుతుంది. ఉజ్వల పథకం వచ్చాక 2019లో కనీసం 1.5లక్షల మంది ప్రాణాలు కాపాడినట్లు ప్రభుత్వం అంచనా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img