Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఉద్యమం ఉధృతం

మూడో రోజూ కొనసాగిన సమ్మె

వేలాదిమంది కార్మికులతో దద్దరిల్లిన ధర్నాలు
ప్రైవేటు వ్యక్తులతో పని చేయిస్తే అడ్డుకుంటాం
మున్సిపల్‌ కార్మికులపై సచివాలయాల పెత్తనం సహించం
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు హెచ్చరిక

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: మున్సిపల్‌ కార్మికుల సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది. ప్రభుత్వం హామీలతో మూడేళ్లుగా కాలక్షేపం చేస్తూ సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం వహిస్తుండడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈనెల 11 నుంచి పారిశుధ్య కార్మి కులు చేపట్టిన సమ్మె బుధవారం మూడో రోజుకి చేరుకుంది. ఒకపక్క ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నా లెక్కచేయని కార్మికులు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపల్‌ కార్యాలయాల ఎదుట వేలాది మందితో ధర్నాలు చేపట్టారు. మున్సిపల్‌ కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు విజయవాడలోని లెనిన్‌ సెంటర్‌ వద్ద కార్మికులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరిం చటానికి మంత్రుల కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు బొత్స సత్యనారాయణకు మద్యం అమ్మటం, ఆదిమూలపు సురేశ్‌కు జగన్‌కు భజన చేయటం తప్ప వేరేది తెలియదని విమర్శించారు. మరో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆర్థిక లెక్కలతో కార్మికులను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రైవేటు వ్యక్తులకు డబ్బులు ఇచ్చి పని చేయించే ప్రభుత్వం మున్సిపల్‌ కార్మికులకు వేతనాలు ఎందుకు పెంచదని ప్రశ్నించారు. కార్మికులకు అన్యాయం చేసే ఆప్‌కాస్‌ను వెంటనే రద్దు చేయాలని, గ్రామ సచివాలయాల్లో కార్మికులు మళ్లీ హాజరు వేయించుకోవాలనే నిబంధనలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల సమ్మె ద్వారా ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామన్నారు. దుర్గం ధం, చెత్తాచెదారం, మురికిని మున్సిపల్‌ కార్మికులు మాత్రమే తొలగించగలరని చెప్పారు. వాళ్ల న్యాయమైన డిమాండ్‌ పరిష్కరించే వరకు ప్రభుత్వంపై పోరాటం సాగుతుందన్నారు. కార్మికులకు కమ్యూనిస్టు పార్టీ, కార్మిక సంఘాలు అండగా ఉంటాయని స్పష్టం చేశారు. ఏఐటీయూసీ అనుబంధ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రంగనాయకులు మాట్లాడుతూ పోటీ కార్మికులకు రూ.300, రూ.500 ఖర్చు చేసి పని చేయించాలని చెప్పటం దుర్మార్గమైన చర్య అన్నారు. మంత్రుల కమిటీ కార్మికుల న్యాయమైన డిమాండ్‌లను ఒప్పుకోవటం లేదని, అందువల్లే సమ్మె కొనసాగిస్తామన్నారు. సీఐటీయూ రాష్ట్ర నాయకుడు సీహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ వేతనాలు పెంచుతామని చెప్పిన జగన్‌ ప్రభుత్వం విస్తరాకు వేసి భోజనం వెనక్కు లాక్కున్న చందంగా వ్యవహరిస్తోందన్నారు. ‘నేను విన్నాను. నేను ఉన్నాను’ అని చెప్పిన జగన్‌కు ఇప్పుడు కార్మికుల వెతలు కనిపించడం లేదా, వినబడటం లేదా? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు ఓర్సు పద్మావతి, జేమ్స్‌, ఎం.డేవిడ్‌ తదితరులు పాల్గొన్నారు.
సమ్మె నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి : సుబ్బరాయుడు డిమాండ్‌
ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మెను విరమింపజే యాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి సుబ్బరాయుడు డిమాండ్‌ చేశారు. కొండపల్లి మున్సిపల్‌ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్మికుల నిరసన ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్‌ వర్కర్లను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని, కార్మికుల పై పని భారం తగ్గించా లని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ, ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు, సీపీఐ ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యా లను కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుండా చర్చల పేరుతో మోసపూరిత వైఖరి అవలంబించడం దుర్మార్గ మన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మైలవరం నియోజకవర్గ కార్యదర్శి బుడ్డి రమేశ్‌, ఏఐటీయూసీ మండల నాయకుడు కన్నా వెంకటేశ్వరరావు, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి టి.నరసింహారావు, జనసేన మైలవరం నియోజకవర్గ ఇన్‌చార్జి అక్కల గాంధీ, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా ధర్నాలు
తాడిగడప మున్సిపల్‌ కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన దీక్ష కొనసాగించారు. ఈ దీక్షా శిబిరంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి టి.తాతయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చౌటుపల్లి రవి, మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి యు.ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జగ్గయ్య పేటలో మున్సిపల్‌ కార్యాలయం ఎదుట కార్మికులు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన దీక్ష చేశారు. ఏఐటీయూసీ నాయకులు జూనెబోయిన శ్రీనివాసరావు, పోతుపాక వెంకటేశ్వర్లు, సీఐటీయూ నాయకురాలు నాగమణి పాల్గొనగా, గుడివాడలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టిన కార్మికులకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు సంఫీుభావం తెలిపారు. మచిలీపట్నంలో మున్సిపల్‌ కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించి, నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేశారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సంఫీుభావం తెలియజేశారు. జేఏసీ నాయకుడు ఉమామహేశ్వరరావు, సీపీఐ సీనియర్‌ నాయకుడు మోదుమూడి రామారావు, కరపాటి సత్యనారాయణ, యర్రంశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
విశాఖలో ప్రత్యామ్నాయ చర్యలను అడ్డుకున్న కార్మికులు… అరెస్ట్‌లపై రమణ ఆగ్రహం
ఈనెల 15న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి విశాఖ నగరంలో వాహన మిత్ర సభకు హాజరుకానున్న నేపథ్యంలో నగరంలో రోజుకు 1200 మెట్రిక్‌ టన్నుల చెత్త పేరుకుపోవడంతో రోజు వారి కూలీలతో వాటిని తరలించాలని జీవీఎంసీ అధికారులు ప్రత్నామ్నాయ చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సమ్మెలో ఉన్న పారిశుధ్య కార్మికులు వారి చర్యలను అడుగడుగునా అడ్డుకున్నారు. దీంతో అనేక ప్రాంతాల్లో అరెస్టులు చోటుచేసుకున్నాయి. మహిళా పారిశుద్ధ్య కార్మికులను పోలీసులు విచక్షణారహితంగా ఈడ్చుకుంటూ వెళ్లి వాహనాల్లో పడేశారు. సమస్యలు పరిష్కరించకుండా మున్సిపల్‌ కార్మికులను అరెస్ట్‌ చేయడం జగన్‌ ప్రభుత్వం దివాలాకోరుతనానికి నిదర్శనమని మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షులు పడాల రమణ మండిపడ్డారు. అరెస్టుల ద్వారా మున్సిపల్‌ కార్మికులను అణిచివేయాలనుకోవడం వైసీపీ ప్రభుత్వానికి క్షేమం కాదన్నారు. ఇలా రెచ్చగొడితే మరింత ఉత్సాహంతో మున్సిపల్‌ కార్మికులు పోరాడతారని ఆయన హెచ్చరించారు. అరెస్ట్‌ చేసిన 31 మందిని తక్షణమే విడుదల చేయాలని రమణ డిమాండ్‌ చేశారు.
గుంటూరులో మోకాళ్లపై నిల్చొని నిరసన
కార్మికులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేస్తూ గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట వందలాది మంది కార్మికులు మోకాళ్లపై నిల్చొని నిరసన తెలియజేశారు. అనంతరం ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు కోట మాల్యాద్రి, ఈదులమూడి మధుబాబు, బందెల రవికుమార్‌, ముత్యాలరావు, సోమి శంకర్‌రావు తదితరులు మాట్లాడుతూ ప్రజలు అనారోగ్యం బారిన పడితే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. టీఎన్‌టీయూసీ రాష్ట్ర నాయకులు శేషగిరిరావు, తెలుగు యువత నాయకులు రావిపాటి సాయికృష్ణ, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు తదితరులు సమ్మెలో పాల్గొన్న వారికి మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోటి వీరాంజనేయులు, కోటేశ్వరరావు, దాసు, సద్గుణరావు, శ్రీను, డేవిడ్‌ రాజు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి మున్సిపల్‌ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.సుబ్బారాయుడు, స్థానిక నేతలు అన్నవరపు ప్రభాకర్‌, గండికోట దుర్గారావు, బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరంలో
విజయనగరంలో కార్మికులు కన్యకాపరమేశ్వరి ఆలయం కూడలిలో రాస్తారోకో చేసి అక్కడ నుంచి భారీ ఎత్తున అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి గంట స్థంభం దగ్గర కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు. మున్సిపల్‌ నగర కార్యాలయం దగ్గర ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్‌.రంగరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.కామేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, ప్రభుత్వం ఇచ్చిన జీఓల ప్రకారం స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌ కార్మికులకు అమలు చేయల్సిన వేతనాలు అమలు కానందున కార్మికులు తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెలోకి రావాల్సిన పరిస్థితిని ప్రభుత్వమే తీసుకువచ్చిందని గుర్తు చేశారు.
ఏలూరు జిల్లాలో
ఏలూరు జిల్లా ప్రధాన కేంద్రంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు భజంత్రీ శ్రీనివాసరావు, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చాట్ల పుల్లారావు, నాయకులు ఇందుపల్లి సత్య ప్రకాష్‌, జంగారెడ్డిగూడెంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మన్నవ కృష్ణ చైతన్య, చింతలపూడిలో సీపీఐ మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి తుర్లపాటి బాబు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చెల్లబోయిన రంగారావు, రాష్ట్ర కోశాధికారి కె.మల్లేశ్వరరావు, నరసాపురంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు నెక్కంటి సుబ్బారావు, తణుకులో సీపీఐ పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, తాడేపల్లిగూడెంలో ఓసూరి వీర్రాజు, తాడికొండ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో
కాకినాడ భానుగుడి సెంటర్‌ వద్ద నుంచి ప్రదర్శనతో సమ్మె మూడవరోజు ప్రారంభమైంది. మిలటరీ రోడ్డు, కొండయ్య పాలెం, శారదా దేవి గుడి మీదుగా నగరపాలక సంస్థ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. సమ్మెను ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌ మాట్లాడారు. సామర్లకోట మున్సిపల్‌ కార్యాలయం వద్ద సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప సమ్మె శిబిరాన్ని సందర్శించి డిమాండ్లకు సంఫీుభావం తెలిపారు. సమ్మె శిబిరంలో ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఏఐటీయూసీ నాయకులు ఉప్పలపాటి చంద్రదాస్‌ తదితరులు పాల్గొన్నారు.
కర్నూలులో
కర్నూలు, నంద్యాల జిల్లాలోని అనేక మునిసిపాలిటీలకు చెందిన కార్మికులు అర్థనగ్న ప్రదర్శనలు, రాస్తారోకో, మోకాళ్లపై నిల్చొని నిరసన తెలియచేశారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img