Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

అమలాపురం అగ్నిగుండం

‘కోనసీమ’ జిల్లా పేరు మార్పుపై పెచ్చరిల్లిన హింసాకాండ

రెచ్చిపోయిన నిరసనకారులు బ స్కూల్‌ బస్సు, రెండు ఆర్టీసీ బస్సులు ధ్వంసం
మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యే పొన్నాడ ఇళ్లకు నిప్పు
మంత్రికి చెందిన మూడు కార్లు దగ్ధం
సొమ్మసిల్లిన అమలాపురం డీఎస్పీ, ఎస్పీ గన్‌మెన్‌కి తీవ్ర గాయాలు

విశాలాంధ్ర`అమలాపురం: కోనసీమ జిల్లా పేరు కొనసాగించాలని ఇతర పేర్లు పెట్టవద్దని కోనసీమ సాధన సమితి మంగళవారం ఇచ్చిన పిలుపు అమలాపురంలో హింసాకాండకు దారితీసింది. స్థానిక గడియారస్తంభం సెంటర్‌ నుండి కలెక్టరేట్‌ వరకూ సమితి అధ్వర్యంలో పాదయాత్రకు పిలుపునిచ్చారు. అయితే పోలీసు బలగాలు వారిని చెదరగొట్టారు. దీంతో వివిధ సందుల నుంచి భారీగా చొచ్చుకువచ్చిన ఆందోళన కారులు కలెక్టరేట్‌ వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. అటుగా వస్తున్న ఒక స్కూల్‌ బస్‌కు ఆందోళన కారులు నిప్పు పెట్టారు. అక్కడ నుండి నల్లవంతెన మీదుగా ఎర్ర వంతెనకు చేరుకున్నారు. మెయిన్‌ రోడ్‌ పై వస్తున్న రెండు బస్సులపై మొదట రాళ్లు రువ్వి అనంతరం దగ్ధం చేశారు. అక్కడ నుండి రవాణా శాఖామంత్రి పినిపే విశ్వరూప్‌ ఇంటిని ముట్టడిరచి, కంప్యూటర్లు ధ్వంసం చేసి ఫర్నీచర్‌కి నిప్పు పెట్టారు. ఆ సమయంలో మంత్రి విశ్వరూప్‌ ఇంట్లోనే వున్నారు. ఆయనను ఆందోళన కారులు దూషించి ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఆ సమయంలో మంత్రి భార్య, కుటుంబసభ్యులు ప్రాణభయంతో కారులో వెళ్లి పోతుండగా ఆందోళన కారులు వారిని వెంబడిరచి ప్రయాణిస్తున్న కారుపై రాళ్ల వర్షం కురిపించారు. డ్రైవర్‌ తృటిలో చాకచక్యంగా కారుని వేగంగా పోనిచ్చి వారిని కాపాడారు. అనంతరం కిమ్స్‌ సమీపంలో మంత్రి విశ్వరూప్‌ నూతనంగా నిర్మిస్తున్న కొత్త ఇంటిని కూడా పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. స్థానిక హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీలో ఉన్న ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ కుమార్‌ ఇంటిని లూటీ చేసి అస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు. ఇంటిపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టారు. ఈ ఘటనల్లో అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి గన్‌ మెన్‌ గాయపడగా మరో 20 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆందోళన కారుల వ్యూహాన్ని అంచనా వేయడంలో ఇంటెలిజెన్స్‌ వర్గాలు పూర్తిగా విఫలమయ్యాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసు బందోబస్తు అధికంగా ఉన్నప్పటికీ ప్రేక్షక పాత్రగా మారిందని పాత రౌడీ షీటర్స్‌ రెచ్చిపోయి విధ్వంసానికి పాల్పడ్డారని వారు విమర్శిస్తున్నారు. పోలీసులు విధ్వంసానికి పాల్పడ్డ వారిని గుర్తించే పనిలో పడ్డారు.
అంతా సంయమనం పాటించాలి: సజ్జల
కోనసీమ ఉద్రిక్తతలపై అందరూ సంయమనం పాటించాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. జిల్లాల విభజన సందర్భంగా ఆ జిల్లాకు అంబేద్కరు పేరు పెట్టాలని వినతులు వచ్చాయన్నారు. గతంలో అన్ని పార్టీలు ఒప్పుకున్నాయని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. అన్ని వర్గాలతో చర్చలు జరుపుతామని, ఆ పేరు పెట్టడంపై అన్ని వర్గాల ఆమోదం ఉంది కాబట్టి పరిష్కరించలేని సమస్య కాదని పేర్కొన్నారు.
కోనసీమలో ఘర్షణలు దురదృష్టకరం: చంద్రబాబు
ప్రశాంతంగా ఉండే కోనసీమలో హింసాకాండ జరగడాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఖండిరచారు. కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. సున్నితమైన అంశంలో హోం మంత్రి టీడీపీపై నిరాధార ఆరోపణలు చేయడాన్ని తప్పుపట్టారు. ఇది ముమ్మాటికీ పోలీసుల, ప్రభుత్వ వైఫల్యమన్నారు. కోనసీమలో ప్రశాంతత నెలకొనేలా ప్రజలంతా సహకరించాలని కోరారు.
అంబేద్కర్‌ పేరు పెడితే రాద్దాంతమా?: శైలజానాథ్‌
కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరు పెట్టినందుకు ఇలాంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు సాకే శైలజనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క కోనసీమ జిల్లాకే కాదనీ, యావత్‌ దేశానికే మహాత్మా గాంధీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ భారతదేశం అని పేరు పెట్టాలని సూచించారు. ప్రజల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టేలా జగన్‌ ప్రభుత్వ ధోరణి ఉందని ఆరోపించారు. చాలా సంవత్సరాల నుంచి కోనసీమకు అంబేద్కర్‌, కర్నూలుకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని ప్రతిపాదించగా, కొత్త జిల్లాల ఏర్పాటులో ఆ పేర్లు పెట్టకుండా చేయటం జగన్‌ అహంకారానికి నిదర్శనమన్నారు.
కోనసీమ ఘర్షణల్లో జనసేన పేరు ప్రస్తావన తగదు: పవన్‌ కల్యాణ్‌
కోనసీమ ఘర్షణలకు సంబంధించి జనసేన పార్టీ పేరును హోంశాఖమంత్రి ప్రస్తావించడాన్ని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్రంగా ఖండిరచారు. వైసీపీ ప్రభుత్వ లోపాలను, శాంతి భద్రతల పరిరక్షణలో అసమర్థతను, వైఫల్యాలను జనసేనపై రుద్దవద్దని సూచించారు. అమలాపురంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని ప్రజాస్వామ్యవాదులు అందరూ ముక్త కంఠంతో ఖండిరచాలన్నారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని, శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

మంత్రి విశ్వరూప్‌ ఇంటిపై దాడిని ఖండిస్తున్నాం: రామకృష్ణ
అమలాపురంలో ఆందోళనకారులు రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్‌ ఇంటిపై దాడి చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్రంగా ఖండిరచారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న ఆందోళనకారులు… తమ అభ్యర్థనను శాంతియుతంగా తెలపాలేగాని, ఇటువంటి దాడులకు పాల్పడటం సరైంది కాదని, ఇది సామాజిక ప్రయోజనాలకు విఘాతం అని చెప్పారు. దాడులకు తెగబడ్డ వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వ, పోలీసు యంత్రాంగాన్ని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img