Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

అరెస్టుకు బెదిరేది లేదు : మనీశ్‌ సిసోడియా

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మధ్య పోటీ జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా చెప్పారు. కేజ్రీవాల్‌ను అడ్డుకునేందుకే తనపై సీబీఐ కేసును నమోదు చేశారని ఆరోపించారు. దిల్లీ రాష్ట్ర ఎక్సయిజ్‌ విధానం అమలులో అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తూ సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) శుక్రవారం మనీశ్‌ సిసోడియా ఇంట్లో సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో సిసోడియా శనివారం తన నివాసంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా తీవ్రంగా విరుచుకుపడ్డారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలను అడ్డుకునేందుకే తనపై సీబీఐ కేసు పెట్టారని ఆరోపించారు. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ మోదీ, కేజ్రీవాల్‌ మధ్యనే ఉంటుందని చెప్పారు.
విద్య, ఆరోగ్య రంగాల్లో కేజ్రీవాల్‌ చేస్తున్న కృషి గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్నారని చెప్పారు. సీబీఐ అధికారులు శుక్రవారం తన నివాసంతోపాటు, విద్యా శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించారన్నారు. విద్య, ఆరోగ్య రంగాల్లో తాము చేస్తున్న కృషిని అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందని చెప్పారు. సత్యేందర్‌ జైన్‌ ఇప్పటికే జైలులో ఉన్నారని, రెండు, మూడు రోజుల్లో తనను కూడా అరెస్టు చేస్తారని, అరెస్టుకు తాను భయపడేది లేదన్నారు. తమను ఎవరూ దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. దిల్లీ ఎక్సయిజ్‌ పాలసీని పూర్తి పారదర్శకత, నిజాయితీలతో అమలు చేశామన్నారు. ఇది మన దేశంలో అత్యుత్తమ విధానమని తెలిపారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తన నిర్ణయాన్ని మార్చుకుని ఉంటే రాష్ట్రానికి ప్రతి సంవత్సరం కనీసం రూ.10,000 కోట్లు ఆదాయం వచ్చి ఉండేదన్నారు. వాళ్ళ సమస్య అరవింద్‌ కేజ్రీవాలేనని, ఆయనను ఆపేందుకే వారు తన నివాసం, కార్యాలయాల్లో సోదాలు చేశారన్నారు. ‘‘నేను ఎటువంటి అవనీతికి పాల్పడలేదు’’ అన్నారు. విద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖల్లో పని చేస్తున్న అధికారుల ఇళ్లలోనూ సోదాలు చేశారని, సోదాలు చేసిన అధికారులంతా చాలా గొప్పవారని తెలిపారు. వారు చాలా వినమ్రంగా ప్రవర్తించారని తెలిపారు. అయితే వారు తమ హైకమాండ్‌ ఆదేశాలను పాటించక తప్పదన్నారు. మంచిగా ప్రవర్తించినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నానని అన్నారు. తాను కేజ్రీవాల్‌ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారన్నారు. కేవలం రాజకీయాల కోసమేనని ఆరోపించారు. ఎక్సయిజ్‌ విధానంలో కుంభకోణం జరగలేదన్నారు.
దిల్లీ ఎక్సయిజ్‌ విధానం అమలులో అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తూ సీబీఐ శుక్రవారం 15 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఖాతాలను తప్పుగా రాశారని, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని, అవినీతి జరిగిందని ఆరోపించింది. సిసోడియా నివాసంతోపాటు దాదాపు 31 చోట్ల సోదాలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img