Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఊకదంపుడు ప్రసంగం

. 9 ఏళ్లలో దేశం సర్వనాశనం
. విపక్షాలపై నిందలు, దాడులు
. ప్రధాని మోదీ తీరుపై రామకృష్ణ ఆగ్రహం

విశాలాంధ్ర – గుంటూరు: బీజేపీ ఆవిర్భావ దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో డొల్లతనం స్పష్టంగా కనిపించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఊకదంపుడు ప్రసంగాలు తప్ప ప్రజలకు చేసిందేమిటని ప్రశ్నించారు. 9 ఏళ్లలో ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయలేదని మండిపడ్డారు. దీనికిబదులు ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ గుంటూరు జిల్లా సమితి, నియోజకవర్గాల సమితి సభ్యులు, ప్రజాసంఘాల ముఖ్యకార్యకర్తల జిల్లాస్థాయి సర్వసభ్య సమావేశం ఇక్కడి మల్లయ్యలింగం భవన్‌లోని వీఎస్‌కే హాలులో గురువారం జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ దేశాభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయంటే మోదీ మాటలను తీవ్రంగా ఖండిరచారు. మోదీ హయాంలో దేశంలో పేదరికం తగ్గిందా? పెరిగిందా అని ప్రశ్నించారు. దేశంలో దారిద్య్రం, నిరుద్యోగం విలయతాండవం చేస్తున్నాయని చెప్పారు. రూపాయి విలువ దారుణంగా పడిపోయిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు తగ్గితే భారత్‌లో పెట్రోలు, డీజిల్‌, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని రామకృష్ణ విమర్శించారు. రైతు ఆదాయం రెట్టింపు కావడం పక్కనపెట్టి…అసలు వ్యవసాయానికే రైతు దూరమయ్యారని పేర్కొన్నారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని ఎందుకు తీసుకురాలేదని నిలదీశారు. వేలకోట్లు దోచుకొని…విదేశాలకు పారిపోయిన పారిశ్రామికవేత్తలకు మోదీ సర్కారు అండగా నిలిచిందని ఆరోపించారు. పారిపోయినోళ్లలో విజయ్‌ మాల్యా మినహా ఇతరులంతా గుజరాతీయులు కారా అని ప్రశ్నించారు. డొల్ల కంపెనీలతో ప్రపంచాన్ని మోసగించిన అదానీని వెంట పెట్టుకుని మోదీ తిరుగుతున్నారని మండిపడ్డారు. అదానీ ఆర్థిక వ్యవహారాలపై జేపీసీ వేయడానికి భయమెందుకని అడిగారు. మోదీ విధానాలు కొద్దిమందికి సంపద పోగుబడటానికి దోహదాపడ్డాయన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏపీకి పదేపదే అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 80 వేలమంది నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా తప్పించుకోవడానికి పోలవరం ఎత్తు తగ్గించే కుట్ర జరుగుతోందని విమర్శించారు. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు కేంద్రాన్ని ప్రశ్నించకపోవడం శోచనీయమన్నారు. మోదీ సహకారంతోనే వైసీపీ ప్రభుత్వం నడుస్తున్నదన్నారు. అందుకు ప్రతిఫలంగా రాష్ట్ర ఎంపీలు బీజేపీకి మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు.
సీపీఐ ప్రతిష్ఠ దెబ్బతీస్తే సహించం: ముప్పాళ్ల
సీపీఐ ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తే ఊరుకునేది లేదని పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు హెచ్చరించారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పదేపదే సీపీఐ నాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతయుతమైన పార్టీగా ప్రజల పక్షాన సీపీఐ పోరాటం చేస్తున్నదని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి ధ్వంసానికి ప్రయత్నం జరుగుతుంటే సజ్జల నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. లక్షల కోట్లు తెచ్చి అమరావతి గుంటల్లో పోయాలా అని మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారని, అలాంటప్పుడు 50 వేల మందికి ఆ గుంటలలో ఇళ్ల స్థలాలు ఎలా కేటాయిస్తారని నిలదీశారు. జంగాల అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఈ నెల 14వ తేదీ నుంచి సీపీఐ`సీపీఎం ఉమ్మడిగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని, ఆ కార్యక్రమాలలో పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్ని తిరుపతయ్య, వెలుగూరి రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img