Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఐదేళ్లలో బీసీ జడ్జీలు 15 శాతమే

. న్యాయమూర్తుల నియామకంలో సామాజిక సమతుల్యం లేదు
. పార్లమెంటరీ ప్యానల్‌కు న్యాయ శాఖ నివేదన

న్యూదిల్లీ: దేశ న్యాయ వ్యవస్థలో వెనుకబడిన వర్గాలతో పాటు మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సముచిత ప్రాతినిధ్యం ఉండటం లేదని న్యాయశాఖ వ్యాఖ్యానిం చింది. ఐదేళ్లలో జడ్జీలుగా నియమితులైన బీసీలు 15శాతమే అని పార్లమెంటు స్థాయి సంఘానికి ప్రజెంటేషన్‌ రూపేణ నివేదించింది. కొలీజియం వ్యవస్థ 30ఏళ్లుగా జడ్జీల నియామకాలను చేపడుతుండగా నేటికీ నియామకాల్లో సామాజిక వైవిధ్యత కానరాదని, తమ సభ్యుల్లో ఆయా వర్గీయులు ఉంటారన్న జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ (ఎన్‌జేఏసీ)ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మానసం చెల్లనిదిగా ప్రకటించిందని న్యాయశాఖ తెలిపింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాల కోసం ప్రతిపాదనలు చేసే బాధ్యత కొలీజియానిది కాబట్టి ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళలకు నియామకాల్లో ప్రాతినిధ్యం కల్పించాల్సినదీ అదే వ్యవస్థ అని నొక్కిచెప్పింది. కొలీజియం సిఫార్సు చేసిన వారిని మాత్రమే సుప్రీంకోర్టుహైకోర్టుల జడ్జీలుగా కేంద్రప్రభుత్వం నియమించగలదంటూ వివరణాత్మక ప్రెజెంటేషన్‌ను బీజేపీ సీనియర్‌ నేత సుశీల్‌మోదీ అధ్యక్షత వహించే సిబ్బంది, ప్రజా సమస్యలు, న్యాయంచట్టం స్థాయి సంఘానికి న్యాయశాఖ ఇచ్చింది. ‘రాజ్యాంగబద్ధ న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాల్లో ప్రధాన పాత్రను జ్యుడిషియరీ 30ఏళ్లుగా పోషిస్తోంది. నేటికీ నియామకాల్లో సామాజిక వైవిధ్యత లేదు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, మైనారిటీలు, మహిళలను పరిగణనలోకి తీసు కొని సామాజిక వైవిధ్యత దృష్ట్యా జడ్జీల నియామకాలకు ప్రతిపాదనలు పంపాలని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ప్రభుత్వం కోరింది. 2018`2022 డిసెంబరు 19 వరకు మొత్తం 537 జడ్జీలు హైకోర్టులో నియమితులయ్యారు. వారిలో 1.3శాతం ఎస్టీలు, 2.8శాతం ఎస్సీలు, 11శాతం ఓబీసీలు, 2.6శాతం మైనారిటీలు ఉన్నారు. 20 నియామకాలలో సామాజిక నేపథ్యం గురించి సమాచారం లేదు. ఎన్‌జేఏసీ తన సభ్యుల్లో ఇద్దరు ముఖ్యులుంటారని, వారిలో ఒకరు ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ లేక మైనారిటీ/మహిళ ఉంటారని ప్రతిపాదించింది. అది చెల్లదని, రాజ్యాంగ విరుద్ధమంటూ ఎన్‌జేఏసీని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రద్దు చేసింది’ అని పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img