Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

చర్చకు భయమెందుకు?

ధైర్యముంటే ప్రజాసమస్యలపై చర్చకు రండి
పార్లమెంటు నిర్వహణ ప్రభుత్వ బాధ్యత కాదా?
ప్రతిపక్షాలపై ఎదురుదాడెందుకు?
మోదీ సర్కారుపై రాహుల్‌ మండిపాటు

న్యూదిల్లీ : పార్లమెంటును సజావుగా, అర్ధవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ అన్నారు. ప్రభుత్వానికి ధైర్యముంటే…ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రజాప్రాముఖ్యత గల అంశాలపై చర్చకు అనుమతించాలని సవాల్‌ విసిరారు. ‘ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై దాడి చేస్తోంది. ప్రజాస్వామ్యంపై నిరంతర దాడి కొనసాగుతోంది. అందుకే మేము పోరాడుతున్నాం’ అని రాహుల్‌ చెప్పారు. ధరల పెరుగుదల, లఖింపూర్‌ ఖేరి, ఇతర సమస్యలపై చర్చకు ప్రభుత్వం అనుమతించడం లేదని విమర్శించారు. పార్లమెంటు సజావుగా జరగకుండా ప్రతిపక్షాలు అడ్డుతగులుతున్నాయని ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోందని మండిపడ్డారు. ప్రజాసమస్యలపై చర్చకు మోదీ సర్కారు ఎందుకు భయపడుతోందని నిలదీశారు. ‘పార్లమెంటును ఎలా నడపాలో ప్రభుత్వానికి తెలుసా? ధరల పెరుగుదల, లఖింపూర్‌ ఖేరి హింస, ఎంఎస్‌పీ, లడాఖ్‌, పెగాసస్‌, ఎంపీల సస్పెన్షన్‌ వంటి సమస్యలను ప్రస్తావించకుండా మమ్ములను ఆపలేరు. మీకు ధైర్యం ఉంటే ఈ సమస్యలపై చర్చకు అనుమతించండి’ అని రాహుల్‌గాంధీ సోమవారం ట్వీట్‌ చేశారు. పార్లమెంటు సజావుగా జరగాలంటే కేంద్రమంత్రి అజయ్‌మిశ్రాను ప్రభుత్వం తొలగించాలని, లఖింపూర్‌ ఖేరి హింసపై చర్చకు అనుమతించాలని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. సభను సజావుగా నడపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, ప్రతిపక్షాలది కాదని స్పష్టంచేశారు. పార్లమెంటు వెలుపల రాహుల్‌ విలేకరులతో మాట్లాడుతూ మోదీ సర్కారు నియంతృత్వ ధోరణిని ఎండగట్టారు. ‘మంత్రి అజయ్‌మిశ్రాను బర్తరఫ్‌ చేయాలని ప్రభుత్వాన్ని మేము స్పష్టంగా కోరుతున్నాం. అందుకు ప్రభుత్వం అంగీకరించడం లేదు’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. లడాఖ్‌కు రాష్ట్ర హోదా అంశాన్ని ప్రస్తావించాలని తాను కోరుతున్నానని, అందుకు ప్రభుత్వం అంగీకరించడం లేదని విమర్శించారు. ‘లడాఖ్‌ ప్రజలందరికీ నేను ఒకటి చెబుతున్నా. ఎవరూ భయపడవద్దు. మీ కోరిక నెరవేరుతుంది’ అని రాహుల్‌ అన్నారు. లడాఖ్‌ సమస్యపై తాను వాయిదా తీర్మానం ఇచ్చానని, ఆ ప్రజలకు తాను అండగా ఉంటానన్నారు. అందుకే ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తానన్నారు. ప్రభుత్వం మాత్రం అందుకు ముందుకు రావడం లేదని ఆరోపించారు. ‘12 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేశారు. దీనిపై చర్చించడానికీ ప్రభుత్వం అనుమతించడం లేదు. తిరిగి సభ జరగకుండా మేము అడ్డుతగులుతున్నామని ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోంది’ అని చెప్పారు. పెగాసస్‌ గూఢచర్యానికి సంబంధించి నాయకుల ఫోన్‌ ట్యాపింగ్‌పై ప్రశ్నించగా దీనిపైనా చర్చను కోరుతున్నామని, ప్రభుత్వం అనుమతించడం లేదని రాహుల్‌ చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img