Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

జగన్‌ సర్కారుకు మళ్లీ షాక్‌

ఉద్యోగసంఘ నేతలకు ఊరట
షోకాజ్‌ నోటీసులపై హైకోర్టు స్టే
వేతనాలపై గవర్నరుకు ఫిర్యాదు ఉదంతం

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: రాష్ట్రంలో సీఎం జగన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలపై న్యాయస్థానాల నుంచి షాక్‌ల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలకు ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్‌ నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. ఈ పరిణామం జగన్‌ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై ఇటీవల గవర్నరును కలిసిన ఉద్యోగ సంఘాల నేతలకు రాష్ట్ర ప్రభుత్వం షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు హైకోర్టును ఆశ్రయించి పిటిషన్‌ వేయగా, కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి వేతనాలు, బకాయిలు అందేలా చట్టం చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అధ్వర్యంలో నేతలు గవర్నరుకు ఫిర్యాదు చేసిన సంఘటన చర్చానీయాం శంగా మారింది. గవర్నరుకు ఉద్యోగులు ఫిర్యాదు చేయడం రోసా నిబంధనలకు విరుద్ధమని, దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. దీనిపై ఉద్యోగుల సంఘం నేతలు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. ఈ ఒక్క ఉద్యోగ సంఘమే కాదు…మిగిలిన సంఘాలు సైతం ప్రతినెలా వేతనాలు సక్రమంగా రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే అంశంపై ఈనెల 13వ తేదీన ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్‌ పలిశెట్టి దామోదరరావు అధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విన్నవించారు. ఉద్యోగులకు సకాలంలో వేతనాలివ్వాలని, అపరిష్కృతంగా ఉన్న వారి సమస్యల పరిష్కారంపై దృష్టి కేంద్రీకరించాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 14వ తేదీన సీఎస్‌కు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్యవేదిక తరపున బండి శ్రీనివాసరావు అధ్వర్యంలో విన్నవించారు. ప్రతినెలా ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలు రానందున, వారి గృహ, వాహనాల రుణ బకాయిలకు ఆటంకం ఏర్పడుతోందని, అదనపు వడ్డీలు కట్టాల్సి వస్తోందని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల సక్రమంగా రాకపోవడంతో వారికి పెద్ద సమస్య ఏర్పడిరది.
ఒకటో తేదీనే ప్రజాప్రతినిధులకు వేతనం
ఉద్యోగులకేమో సక్రమంగా వేతనాలు ఇవ్వకుండా జాప్యం చేస్తూ…అటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రం ప్రతినెలా ఒకటో తేదీనే వారి ఖాతాల్లో జగన్‌ సర్కారు వేతనాలు జమ చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నెలకు రూ1.75లక్షల వేతనం చెల్లిస్తున్నారు. శాసనసభ, శాసన మండలిలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌లకు కేబినెట్‌ హోదా ప్రకారం దాదాపు రూ.3లక్షల చొప్పున ఒకటో తేదీనే వేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పింఛను కూడా ప్రతినెలా ఒకటి, రెండో తేదీల్లోనే జమ చేస్తున్నారు. ఒకసారి ఎమ్మెల్యేగా చేసిన వారికి నెలకు రూ.30వేలు, రెండు సార్లు చేసిన వారికి రూ.40వేలు, మూడు, ఆపైన ఎమ్మెల్యేలుగా చేసిన వారికి రూ.50వేలకుపైగా దాదాపు 300 మందికి పెన్షన్లు ఇస్తున్నారు. ప్రజాప్రతినిధుల వేతనాలకు ప్రత్యేక బడ్జెట్‌ ఉన్నందున వారికి సక్రమంగా వేతనాలిస్తూ… ఇటు ఉద్యోగులకు మాత్రం జాప్యం చేయడంపై తీవ్ర విమర్శలున్నాయి. ఏపీ సచివాలయ అధికారులు, ఉద్యోగులకూ సక్రమంగా వేతనాలను జమ చేస్తున్నారు. మిగిలిన విభాగాల ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా 12, 15వ తేదీ వరకూ వేతనాలిస్తున్నారు. పెన్షన్‌ దారులకూ సక్రమంగా ఇవ్వడం లేదు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉద్యమిస్తున్న వారిపై అక్రమంగా కేసులు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ వేతనాల కోసం ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు గవర్నరుకు ఫిర్యాదు చేయగా, దానిపై ప్రభుత్వం వారికి షోకాజ్‌ నోటీసులిచ్చింది. వాటిని సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన వారికి ఊరట లభించింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు ప్రతినెలా సక్రమంగా వేతనాలు జమయ్యేలా చూడాలని, లేకుంటే మరోపోరాటానికి సమాయాత్తమవుతున్నామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img