Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

జగన్‌ సర్కార్‌కు మరో ఎదురుదెబ్బ

స్త్రీ, శిశు సంక్షేమశాఖలో ఏవో నియామకాలపై హైకోర్టు స్టే

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. స్త్రీ శిశు సంక్షేమశాఖలో విస్తరణ అధికారుల నియామకాలపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. మొత్తం 560 మంది విస్తరణ అధికారుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. అయితే ఏవో పోస్టుల భర్తీలో భారీస్థాయిలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని, తక్షణమే పరీక్షా ఫలితాలను నిలిపివేయాలని కోరుతూ బుధవారం హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటీషన్‌ దాఖలైంది. ఈనెల 18న పోస్టుల భర్తీకి రాత పరీక్షలు నిర్వహించగా, దాదాపు 38 వేల మంది అంగన్వాడీ కార్యకర్తలు హాజరయ్యారు. ఇంగ్లీష్‌ భాషలో కూడా పరీక్ష పెట్టాల్సి ఉండగా, అది పెట్టకుండానే అధికారులు పంపించివేశారు. ముందుగానే పోస్టుల భర్తీకి మాట్లాడుకొని డబ్బులు వసూలు చేశారు. ఒక్కో పోస్టుకు సుమారు రూ.10 లక్షలు వసూలు చేశారని ఆరోపించడంతో పాటు, ముందుగా ఎంపిక చేసుకున్న అభ్యర్థులకు ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ పెట్టి సెలెక్ట్‌ చేసుకున్నారని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు న్యాయవాది జడ శ్రవణ్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. ఫలితాలు గురువారం వెలువడనుండటంతో వాటిని నిలిపివేయాలని పిటీషనర్‌ విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులను, ప్రభుత్వ ఉన్నతాధికారులను పిటిషనర్‌ ప్రతివాదులుగా చేర్చారు. దీంతో ఉదయం ఈ పిటిషన్‌ను విచారించేందుకు ధర్మాసనం అనుమతించింది. ఆ మేరకు విచారణ చేపట్టిన హైకోర్టు ఇరుపక్షాల వాదనలు అనంతరం అన్ని జోన్‌లలో నియామక ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. ఆరు వారాల్లో స్టే వెకేషన్‌ అనంతరమే నియామక ప్రక్రియ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img