Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

నేనే పూర్తిస్థాయి అధ్యక్షురాలిని… : సోనియాగాంధీ

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ తానే పూర్తిస్థాయి అధ్యక్షురాలినని సోనియాగాంధీ స్పష్టంచేశారు. శనివారం జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో మాట్లాడుతూ, పార్టీకి పూర్తి కాలపు అధ్యక్షురాలిని తానేనని, తాను చురుగ్గా పని చేస్తున్నానని చెప్పారు. పార్టీ అంతర్గత సమస్యలపై బహిరంగంగా విమర్శిస్తే సహించేది లేదని, గీత దాటితే చర్యలు తప్పవంటూ కాంగ్రెస్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలంటున్న నేతలకు ఘాటుగా సమాధానమిచ్చారు.పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక, లఖింపూర్‌ ఘటన, పలు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు తదితర అంశాలే అజెండాగా జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియాగాంధీ ప్రారంభోపన్యాసం చేశారు. కాంగ్రెస్‌కు పునర్వైభవం రావాలని పార్టీ నేతలంతా కోరుకుంటున్నారని, అయితే దీని కోసం ఐకమత్యం అవసరమని, పార్టీ ప్రయోజనాలకు పెద్ద పీట వేయడం ముఖ్యమని తెలిపారు. స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ మరీ ముఖ్యమని చెప్పారు. ఈ ఏడాది జూన్‌ 30 నాటికి రెగ్యులర్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ను ఎన్నుకునేందుకు రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వల్ల ఈ ప్రక్రియను నిరవధికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. సంస్థాగత ఎన్నికల గురించి పూర్తి స్పష్టత ఇచ్చే సందర్భం వచ్చిందని చెప్పారు. ‘నిజాయితీగా వ్యక్తంచేసే అభిప్రాయలను నేను ఎప్పుడూ ప్రసంసిస్తాను మీడియా ద్వారా నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను పార్టీకి తాత్కాలిక అధ్యక్షురాలిని కాదు. పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వర్తిస్తాను.’ అని సమావేశంలో పాల్గొన్న నేతలందరికీ ఆమె వెల్లడిరచారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ప్రస్తావిస్తూ సోనియా గాంధీ ఇలా అన్నారు. ‘‘మేము అనేక సవాళ్లను ఎదుర్కొంటాము. కానీ మనం ఐక్యంగా, క్రమశిక్షణతో ఉండి.. పార్టీ ప్రయోజనాలపై మాత్రమే దృష్టి పెడితే.. మేము తప్పకుండా రాణిస్తాం.’’ అని చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అశోక్‌ గెహ్లాట్‌ (రాజస్థాన్‌), భూపేష్‌ బాఘెల్‌ (ఛత్తీస్‌గఢ్‌), చరణ్‌జిత్‌ చన్ని (పంజాబ్‌) పాల్గొన్నారు. అలాగే గత ఏడాది సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్‌ నేతల్లో గులాం నబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్‌ పార్టీకి ఎన్నికల్లో వరుసగా పరాజయాలు ఎదురవుతుండటంతో ఆ పార్టీకి చెందిన 23 మంది నేతలు గత ఏడాది ఆగస్టులో సోనియా గాంధీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని వీరు డిమాండ్‌ చేశారు. అదేవిధంగా గత నెలలో పంజాబ్‌ ముఖ్యమంత్రి మార్పు నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ మాట్లాడుతూ, పార్టీకి పూర్తి కాలపు ప్రెసిడెంట్‌ లేరని, ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియదని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img