Monday, May 6, 2024
Monday, May 6, 2024

పుట్టెడు దు:ఖంలో అరటి రైతు

ఈదురు గాలులకు తోటల బీభత్సం
పట్టించుకోని అధికారులు

విశాలాంధ్ర-వేపాడ: ఈదురుగాలులు, భారీ వర్షానికి విజయనగరం జిల్లా వేపాడ మండలంలో అరటి తోటలు బాగా దెబ్బతిన్నాయి. గాలులకు అరటి తోటలు నేలకూలాయి. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు. వేపాడు మండలం వావిలపాడు, కేజీ పూడి, బొద్దాం తదితర గ్రామాల్లో అరటి రైతులు భారీగా నష్టపోయారు. వాగులపాడు గ్రామానికి చెందిన రైతు చలుమూరి ఈశ్వరమ్మ 4.70 ఎకరాల అరటితోట నేలమట్టమైంది. రెండు లక్షల రూపాయలకు పైగా పెట్టుబడిపెట్టింది. ఏడాదికాలం కష్టపడినా ఈదురుగాలులు నిలువునా ముంచాయి. అదే గ్రామానికి చెందిన బైలపూడి అబద్ధం, సత్తిబాబు, రంధి భారతి, గోలగాన సన్నీబాబు, వారాది శ్రీనివాసరావు తదితర రైతులకు చెందిన 10 ఎకరాలకు పైగా అరటి తోటలు గాలుల బీభత్సానికి విరిగి నేలమట్టం కావడంతో రైతులు తమ కష్టంతో పాటు పెట్టుబడి కూడా నష్టపోయారు. కొండ గంగుపూడి, బొద్దాం తదితర గ్రామాల్లోనూ అరటి తోటలు సర్వనాశనమయ్యాయి. పంటనష్టం జరిగి రెండు రోజులు గడుస్తున్నా ఉన్నతాధికారులు ఇక్కడ దృష్టి సారించకపోవడంతో రైతులు మనోవేదనకు గురవుతున్నాయి. మండల వ్యవసాయాధికారులు గానీ, ఉద్యానవనశాఖ అధికారులు గానీ కన్నెత్తి చూడకపోవడం దారుణమని రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతుల ప్రభుత్వమని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై మండల ఉద్యానవనశాఖ అధికారి ఉమా భరణిని అడుగగా ఇలాంటి గాలులకు జరిగిన పంట నష్టాలకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వదని, రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల మేరకు కొన్ని పరిస్థితులలో జరిగిన పంటలకు మాత్రమే నష్టపరిహారం అందిస్తుందని, ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img