Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పేదల ఆహార భద్రతకు ముప్పు

. బడ్టెట్‌లో సబ్సిడీలపై భారీ కోత
. ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రైవేటుకు…
. కేంద్రానికి నీతి ఆయోగ్‌ సిఫార్సు
. బయటపెట్టిన ‘రిపోర్టర్స్‌ కలెక్టివ్‌’

ఆకలి సూచీలో దేశం అట్టడుగున ఉన్న పరిస్థితుల్లో ఆహార సబ్సిడీకి ఎసరు పెట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పేదల ఆహార భద్రతను ప్రమాదంలోకి నెడుతున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు వ్యక్తులకు, కార్పొరేట్లకు అమ్మేస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు… పేదల ఆకలి తీర్చే ప్రజాపంపిణీ వ్యవస్థను కూడా వదిలించుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమౌతోంది. మార్కెట్‌ నుంచి ఆహార ధాన్యాలను సేకరించి, వాటిని పేదలకు పంచే పీడీఎస్‌ వ్యవస్థ మొత్తాన్ని కార్పొరేట్ల చేతుల్లో పెట్టడానికి వేగంగా అడుగులు వేస్తున్నట్టు కనబడుతోంది. అసలు ఆహార సబ్సిడీకే కేంద్రం మంగళం పాడనున్నదా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆప్త మిత్రుడు అదానీకి ఏడు విమానాశ్రయాలను కట్టబెట్టే విషయంలో నీతి ఆయోగ్‌తోపాటు, ఆర్థిక వ్యవహారాల విభాగం (డీఈఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా కేంద్రం పట్టించుకోలేదు. సన్నిహితుడి కోసం నిబంధనలు సైతం మార్చేసి అడ్డగోలుగా అప్పగించేసింది. ఆహార సబ్సిడీని ఎత్తేయాలని, ప్రజాపంపిణీ వ్యవస్థను ప్రైవేటుకు కట్టబెట్టాలన్న నీతి ఆయోగ్‌ సిఫారసులు పేదలకు పిడుగుపాటులా పరిణమిస్తాయన్నా సంకోచించకుండా… బడ్జెట్‌లో ఫుడ్‌ సబ్సిడీకి కేంద్రం నిలువునా కోత విధించింది. ఈ విషయాలన్నీ ‘రిపోర్టర్స్‌ కలెక్టివ్‌’ అనే సంస్థ ఇటీవల ఆధారాలతో సహా బయటపెట్టింది.

న్యూదిల్లీ: ఆకలి సూచీలో పొరుగుదేశాల కంటే మన దేశం అట్టడుగున నిలిచిన ప్రస్తుత పరిస్థితుల్లో… పేదలకు అంతో ఇంతో అక్కరకొస్తున్న ఆహార సబ్సిడీని ఎత్తివేసే దిశగా కేంద్రంలోని ఎన్డీయే సర్కారు అడుగులు వేస్తోంది. ఆహార సబ్సిడీని ఎత్తివేయాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రైవేట్‌కు అప్పగించాలని ప్రభుత్వ మేధో సంస్థ నీతి ఆయోగ్‌ కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్టు ‘రిపోర్టర్స్‌ కలెక్టివ్‌’ అనే సంస్థ గత వారంలో ఆధారాలు బయటపెట్టింది. ఈ సిఫారసులకు అనుగుణంగా తాజా బడ్జెట్‌లో ఆహార సబ్సిడీకి కేంద్రం భారీగా కోత విధించింది. పీడీఎస్‌ వ్యవస్థను వేగంగా ప్రైవేటుపరం చేయాలని నీతి ఆయోగ్‌లోని ప్రాజెక్ట్‌ అప్రైజల్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ డివిజన్‌, 2019 నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వానికి రాసిన ఓ లేఖను రిపోర్టర్స్‌ కలెక్టివ్‌ బయటపెట్టింది. ‘జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద ప్రస్తుతం పేదలకు ఆహార ధాన్యాలను అందించేందుకు కొనసాగుతున్న వ్యవస్థను మరింత బలోపేతం చేయాలంటే దానిలో ప్రభుత్వ , ప్రైవేటు భాగస్వామ్యానికి (పీపీపీ) అవకాశం కల్పించండి’ అని ఆ లేఖలో నీతి ఆయోగ్‌ సూచించింది.
సరఫరా ప్రైవేటు చేతుల్లో పెట్టండి
జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 75 శాతం, పట్టణ ప్రాంతాల్లో 50 శాతం జనాభాకు సబ్సిడీ ఆహార ధాన్యాలను అందించేందుకు అవకాశం ఉంది. అయితే అన్ని రాష్ట్రాలు పేదలకు ఈ సబ్సిడీ ఆహారధాన్యాలను అందించేందుకు 2011 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొంటున్నాయి. అయితే ఆ జనాభా లెక్కలకు ప్రస్తుతం కాలం చెల్లింది. గత 12 ఏళ్ల కాలంలో కొన్ని కోట్ల జనాభా దేశంలో పెరిగింది. కానీ, అందులోని పేదలను ప్రభుత్వాలు పీడీఎస్‌ పరిధిలోకి తీసుకురాలేదు. దీనిపై 2021లో సుప్రీంకోర్టులో పలువురు కేసులు దాఖలు చేయగా, కొత్తగా జనాభా లెక్కలు నిర్వహించిన తర్వాతనే పీడీఎస్‌ వ్యవస్థలోని మరింత మంది పేదలను తీసుకొస్తామని కేంద్రం తెగేసి చెప్పింది. ఇదే సమయంలో ఇప్పటికే పీడీఎస్‌ కింద ఆహార ధాన్యాలు పొందుతున్నవారిని కూడా ఏటా తొలగిస్తూ వస్తున్నది. దీనికి నీతి ఆయోగ్‌ సిఫారసులే కారణమని తాజాగా వెలుగులోకి వచ్చింది.
‘జాతీయ, రాష్ట్రాల స్థాయిలో ఎంపికచేసిన ప్రాంతాల్లో ఆహార ధాన్యాల సేకరణ, తరలింపు, నిల్వతోపాటు బఫర్‌ స్టాక్‌ (భవిష్యత్తు అవసరాల కోసం నిల్వ ఉంచేవి) నిల్వకు ప్రైవేటు వ్యక్తులకు అవకాశం కల్పించాలి… పీడీఎస్‌ వ్యవస్థను ప్రైవేటీకరించటం వల్ల ఆహార మార్కెట్‌లో ఇతర కంపెనీలకు అవకాశం లభిస్తుంది… ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి’ అని కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్‌ సూచించినట్టు డాక్యుమెంట్లలో ఉంది. ‘పీడీఎస్‌ కోసం ప్రస్తుతం ఎఫ్‌సీఐ, ఇతర రాష్ట్రాల ఏజెన్సీలు నిర్వహిస్తున్న ఆహార ధాన్యాల సేకరణ, తరలింపు, నిల్వ, పంపిణీ వ్యవస్థలో జాప్యం జరుగుతోంది. అవినీతి అధికంగా ఉంది. ఖర్చు కూడా భారీగా అవుతున్నది’ అని పేర్కొంది.
సబ్సిడీలకు బడ్జెట్‌లో భారీ కోత
నీతి ఆయోగ్‌ సూచనలు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటుకు సమర్పించిన 2023-24 బడ్జెట్‌లో స్పష్టంగా కనిపించాయి. ఈ బడ్జెట్‌లో మోదీ సర్కారు అన్ని సబ్సిడీలకు భారీగా కోత పెట్టింది. సబ్సిడీల బడ్జెట్‌ను ఏకంగా దాదాపు రూ.1.5 లక్షల కోట్లు తగ్గించింది. దేశవ్యాప్తంగా పీడీఎస్‌ కోసం ఎఫ్‌సీఐ మార్కెట్‌ నుంచి ఆహార ధాన్యాలను సేకరిస్తుంది. చాలాచోట్ల రాష్ట్ర ప్రభుత్వాలే రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి ఎఫ్‌సీఐకి అందిస్తున్నాయి. ఈ ఏడాది సేకరించిన ఆహార ధాన్యాలకు సంబంధించి కేంద్రం ఎఫ్‌సీఐకి రూ.90,000 కోట్లు బకాయిలు ఇవ్వాల్సి ఉంది. కానీ, పైసా కూడా ఇవ్వకుండా మార్కెట్‌ నుంచి రుణాలు తెచ్చుకోవాలని ఎఫ్‌సీఐకి మోదీ సర్కారు సలహా ఇచ్చింది. అంత భారీగా రుణాలు తెచ్చుకొంటే వడ్డీలు కూడా భారీగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇది ఎఫ్‌సీఐకి మోయలేని భారంగా మారి, అంతిమంగా ఆ సంస్థ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కేంద్రం కూడా ఎఫ్‌సీఐ బలహీనపడాలనే కోరుకొంటున్నదని, ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని పీడీఎస్‌ను కార్పొరేట్‌ శక్తుల చేతుల్లో పెట్టేందుకు పావులు కదుపుతున్నదని అంటున్నారు. ప్రస్తుతం ఆకలి సూచీలో దేశం అట్టడుగున ఉన్న పరిస్థితుల్లో ఆహార సబ్సిడీకి ఎసరు పెట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పేదల ఆహార భద్రతను ప్రమాదంలోకి నెడుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, కొంతమంది ప్రముఖ జర్నలిస్టులు కలిసి ఏర్పాటుచేసిన వేదికే రిపోర్టర్స్‌ కలెక్టివ్‌.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img