Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ప్రభుత్వ రంగాన్ని రక్షించుకుందాం

మోదీ ప్రైవేటీకరణవిధానాలను అడ్డుకుందాం
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకుందాం
27న భారత్‌బంద్‌కువైసీపీ, టీడీపీ మద్దతివ్వాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపు
విజయవాడలో భారీ పాదయాత్ర
అడుగడుగునా బ్రహ్మరథం

విజయవాడ : కార్మికులు, కర్షకులు తమ శ్రమతో అభివృద్ధి చేసిన ప్రభుత్వ రంగ సంస్థలను, జాతి సంపదను నరేంద్ర మోదీ సర్కారు అంబానీ, అదానీలకు కట్టబెడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాలకు నిరసనగా దేశచరిత్రలో ఎన్నడూలేని విధంగా 500 రైతుసంఘాలు, 450 కార్మిక సంఘాలు, 19 రాజకీయ పార్టీలు కలిసి ఈ నెల 27న భారత్‌బంద్‌కు పిలుపునిచ్చాయని ఆయన తెలిపారు. బంద్‌ను విజయవంతం చేయడం ద్వారా దేశ రాజకీయాల్లో పెనుమార్పులకు శ్రీకారం చుట్టాలని, తద్వారా ప్రభుత్వ రంగాన్ని కాపాడు కోవాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. సీపీఐ అధ్వర్యాన ఈ నెల 14వ తేదీన అనంతపురంలో ప్రారంభమైన ‘జన ఆందోళన్‌’ పాదయాత్ర సోమవారం విజయవాడ చేరుకుంది. సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌ నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు పాదయాత్రకు అపూర్వస్వాగతం పలికారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు, మేధావుల ఫోరం కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, సీపీఎం నాయకుడు డీవీ కృష్ణ సంఫీుభావం తెలియజేసి, పాలకులు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై కమ్యూనిస్టు పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమానికి తాము మద్దతిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా నగరంలో భారీ పాదయాత్ర జరిగింది. వన్‌టౌన్‌ వస్త్రలత వద్ద ప్రారంభమైన పాదయాత్ర లోబ్రిడ్జి, పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌, ఏలూరు రోడ్డు మీదుగా చల్లపల్లి బంగ్లా, అప్సర థియేటర్‌ సెంటర్‌, విజయ టాకీస్‌ సెంటర్‌ వరకు వెళ్లి, అక్కడి నుంచి విజయ టాకీస్‌ వంతెన, సాంబమూర్తి రోడ్డు, అలంకార్‌ సెంటర్‌, న్యూ ఇండియా హోటల్‌ సెంటర్‌ మీదుగా ఏలూరు లాకులు వద్ద ఉన్న నీలం సంజీవరెడ్డి విగ్రహం వద్దకు చేరుకుంది. మార్గమధ్యంలో కంట్రోల్‌ రూమ్‌ వద్ద ఉన్న సీపీఐ అగ్రనాయకులు చండ్ర రాజేశ్వరరావు విగ్రహానికి రామ కృష్ణ పూలమాల వేసి నివాళి అర్పించారు. నీలం సంజీవ రెడ్డి విగ్రహం వద్ద దోనేపూడి శంకర్‌ అధ్యక్షతన జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ రైల్వేలు, ఎయిర్‌పోర్టులు, ఓడరేవుల నుంచి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రభుత్వం విక్రయిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రులు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారంతోపాటు దేశాన్ని కూడా మోదీ అమ్మేస్తున్నారని విమర్శించారు. ఈ తరుణంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా తమ విభేదాలు పక్కనపెట్టి భారత్‌బంద్‌కు మద్దతిచ్చి రాష్ట్రంలో సంపూర్ణంగా జయప్రదం చేయడం ద్వారా కేంద్రం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలను అడ్డుకునేందుకు సహకరిం చాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ మాట్లాడుతూ మోదీ ఏడేళ్లుగా దేశాన్ని కులాలు, మతాలవారీగా విభజించి పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటేనే రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు, ఉద్యోగ అవకాశాలు, సామాజిక న్యాయం సాధ్యమని చెప్పారు. రాష్ట్రానికి న్యాయం చేయడం లేదనే ఆవేదనతో నాడు కేంద్ర ఉక్కు శాఖమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి విగ్రహాన్ని ఆందోళనకారులు కూల్చివేశారని, ఆ పోరా టంలో తాను కూడా పాల్గొన్నానని గుర్తుచేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రచించిన లౌకిక రాజ్యాంగాన్ని, దాని లక్ష్యాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం 27న భారత్‌బంద్‌ జయప్రదం చేయాలని కోరారు. అఖిల భారత కిసాన్‌ సభ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతన్న మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పది నెలలుగా దిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నా కేంద్ర ప్రభుత్వం మొండివైఖరి వీడటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలపై సీపీఐ సమరశంఖం పూరించిందని చెప్పారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ దేశానికి వెన్నెముక అయిన రైతులు, సంపద సృష్టిస్తున్న కార్మికులకు మోదీ సర్కారు తీవ్ర ద్రోహం చేస్తోందన్నారు. మోదీ విధానాలపై రైతులు, కార్మికులు, ప్రజలు ఆందోళనబాట పట్టారని, రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు. మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవానీ మాట్లాడుతూ ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకునేందుకు భారత్‌ బంద్‌ను జయ ప్రదం చేయాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ దేశ సంపదను మోదీ ఇద్దరు గుజరాతీ వ్యాపారులకు దోచిపెడుతున్నారని, మితవాద, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ సాగించే పోరాటానికి ప్రజానీకం మద్దతు ఇవ్వాలని కోరారు. దోనేపూడి శంకర్‌ మాట్లాడుతూ విశాఖ ఉక్కు`ఆంధ్రుల హక్కు నినాదంతో అమరజీవి కొల్లి నాగేశ్వరరావు నేతృత్వంలో జిల్లాలో పెద్ద ఎత్తున పోరాటం సాగిందని గుర్తుచేశారు. ఈ పోరాటంలో భాగంగా నాడు నీలం సంజీవరెడ్డి విగ్రహాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారని, ఆ సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు అమరులయ్యారని తెలిపారు. అంతటి త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడం దుర్మార్గమన్నారు. సీపీఐ నగర సహాయ కార్యదర్శి జి.కోటేశ్వరరావు, విజయవాడ నగరంతోపాటు జిల్లా నుంచి సీపీఐ, ఏఐటీయూసీ, రైతుసంఘం, వ్యవ సాయ కార్మిక సంఘం, మహిళా సమాఖ్య, ముఠా కార్మిక సంఘం, వస్త్రలత క్లాత్‌ ముఠా, హాకర్స్‌ యూనియన్‌, ఆటో కార్మిక సంఘం తదితర ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు వందలాది మంది పాల్గొన్నారు. ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.చంద్రానాయక్‌, సీనియర్‌ నాయకుడు ఆర్‌.పిచ్చయ్య, విజయవాడ నగర బాధ్యులు లంక దుర్గారావు, కేవీ భాస్కరరావు, ఎస్‌కే నజీర్‌ తదితరులు విప్లవ గేయాలు ఆలపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img