Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

భ్రష్టుపట్టిన జుమ్లా పార్టీ

కాంగ్రెస్‌ విమర్శ: మోదీ ప్రభుత్వంపై ఛార్జిషీటు విడుదల
26 నుంచి హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర`లోగో ఆవిష్కరణ

న్యూదిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరించే ప్రజావ్యతిరేక విధానాల కారణంగా దేశపౌరుల వెతలు వర్ణనాతీతమయ్యాయని కాంగ్రెస్‌ విమర్శించింది. బీజేపీని ‘భ్రష్టుపట్టిన జుమ్లా పార్టీ’గా వర్ణించింది. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛార్జిషీటును విడుదల చేసింది. ‘కొందరి కోసం.. కొందరి వికాసం కోసం… అందరితో నమ్మకద్రోహం’ నినాదంతో బీజేపీ పనిచేస్తోందని దుయ్యబట్టింది. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నట్లు తమ ఛార్జిషీటులో కాంగ్రెస్‌ పేర్కొంది. ‘మేం జాతీయ స్థాయిలో ఛార్జిషీటును విడుదల చేశాం. రాష్ట్రాలవారీగా ఛార్జిషీట్లను ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీలు రూపొందిస్తాయి’ అని శనివారం ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, జైరాం రమేశ్‌ తెలిపారు. ‘హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌’ లోగోను ఆవిష్కరించారు. ఈనెల 26వ తేదీ నుంచి హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర ప్రారంభమవుతుందన్నారు. ఈ క్రమంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి, ప్రజలకు కాంగ్రెస్‌ చార్జిషీటు, రాహుల్‌ గాంధీ సందేశాన్ని ప్రజలకు తెలియజేస్తాం’ అని అన్నారు. చరిత్రాత్మక భారత్‌ జోడో యాత్ర 130 రోజులు దిగ్విజయమైందని, యాత్రకు అమితాదరణ పొందిందన్నారు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా లక్షలాది మంది తమ బాధలను రాహుల్‌తో పంచుకున్నారని, మోదీ ప్రభుత్వ దుష్టవిధానాలతో ప్రజలు ఎంతలా ఇబ్బంది పడుతున్నారో తెలిసిందన్నారు. హాత్‌ సే హాత్‌ జోడోలో భాగంగా పది లక్షల ఎన్నికల పోలింగ్‌ బూత్‌లను చేరుకుంటామని, 2.5 లక్షల పంచాయతీలు, ఆరు లక్షల గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపడతామని వేణుగోపాల్‌ చెప్పారు. జైరాం రమేశ్‌ మాట్లాడుతూ ‘హాత్‌సే హాత్‌ జోడో అభియాన్‌ నూటికి నూరుశాతం రాజకీయ యాత్రని చెప్పలేం. ఇది భారత్‌ జోడో యాత్ర తరువాయి భాగం’ అని అన్నారు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా రాహుల్‌ శ్రీనగర్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని వేణుగోపాల్‌ చెప్పగా లాల్‌ చౌక్‌లో ఎందుకు ఎగురవేయడం లేదని ఓ విలేకరి ప్రశ్నించారు. ఇందుకు జైరాం రమేశ్‌ స్పందిస్తూ పార్టీ కార్యాలయంలోనే జాతీయ పతాకావిష్కరణ జరుగుతుందన్నారు. భావితరాలు గుర్తించేలా శాశ్వత కట్టడం ఉండాలనే భావనతో సొంత ఆస్తిని కాంగ్రెస్‌ గుర్తించినట్లు వేణుగోపాల్‌ తెలిపారు. భారత్‌ జోడో తుదిదశకు చేరుకున్నదని, కశ్మీర్‌ లోయలో ఈనెల 27, 28, 29 తేదీల్లో సాగుతుందని చెప్పారు. 29న యాత్ర ముగుస్తుందని, 30వ తేదీ ఉదయం 10గంటలకు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని రాహుల్‌ ఆవిష్కరిస్తారని, 11 గంటలకు శ్రీనగర్‌లోని షేరే కశ్మీర్‌ మైదానంలో బహిరంగ సభ జరుగుతుందని, ఇందుకు ప్రతిపక్ష నేతలను ఆహ్వానించామని వేణుగోపాల్‌ తెలిపారు. జాతీయ పతాకాన్ని రాహుల్‌ ఆవిష్కరించే సమయంలో అన్ని జిల్లాలలో పార్టీ అధ్యక్షులు తమ కార్యాలయాల్లో త్రివర్ణ జెండాలు ఎగురవేస్తారన్నారు. హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ రెండు నెలలకుపైగా సాగేందుకు వీలు ఉన్నట్లు వేణుగోపాల్‌ వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img