Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

సత్యసాయి జిల్లాలో విషాదం

ఐదుగురి సజీవదహనం

వ్యవసాయ కూలీల ఉసురు తీసిన కరెంటు తీగలు
ఆటోలో వెళుతూ మృత్యు ఒడిలోకి
మృతుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా

వారంతా దినసరి కూలీలు… రోజూలాగే పనికోసం బయల్దేరారు… ఆటోలో కూర్చొని కబుర్లలో మునిగిపోయారు. సరిగ్గా వారు ప్రయాణిస్తున్న ఆటో… హై టెన్షన్‌ విద్యుత్‌ స్తంభం వద్దకు చేరుకోగానే, మిన్ను విరిగి మీద పడ్డట్టుగా… వేల వోల్టుల విద్యుత్‌ ప్రసరిస్తున్న తీగలు ఒక్కసారిగా తెగి ఆటో మీద పడ్డాయి. ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే మంటలు చుట్టు ముట్టాయి. ఆటో మొత్తం దగ్ధమైపోతుండగా హాహాకారాలు…ఆర్తనాదాలు మిన్నంటాయి. చూస్తుండగానే ఐదు నిండు ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఇసుమంతైనా తమ పొరపాటే లేని ప్రమాదానికి ఐదుగురు బలైపోయారు. సత్యసాయి జిల్లాలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది.
ప్రమాద సమయంలో డ్రైవర్‌ తో కలిపి 13 మంది కూలీలు ఆటోలో ప్రయాణిస్తున్నారు. డ్రైవర్‌ పోతులయ్య, మరో ఏడుగురు కూలీలు మాత్రమే గాయాలతో బయటపడ్డారు. మృతులంతా మహిళలే. వీరిని కొంకా కాంతమ్మ (41), లక్ష్మీదేవి (43), రత్నమ్మ (46), కుమారి (44), రామలక్ష్మి (45)గా గుర్తించారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు… సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామానికి చెందిన గుండ్లమడుగు రాజా, కుమారిలకు చిల్లకొండాయపల్లి సమీపంలో వ్యవసాయ పొలం ఉంది. కలుపు తీయడానికని వీరు గుడ్డంపల్లి కి చెందిన కొంక కాంతమ్మ, కొంకా లక్ష్మీదేవి, కొంకా రత్నమ్మ, కొంకా రామలక్ష్మి, కొంకా నాగేశ్వరమ్మ, కొంకా రమాదేవి, రత్నమ్మ, కొంకా అరుణ, కొంకా
ఈశ్వరమ్మ, కొంకా గాయత్రి, శివ రత్నమ్మను తీసుకుని కునుకుంట్ల గ్రామానికి చెందిన డ్రైవర్‌ పోతులయ్య ఆటోలో వెళుతున్నారు. చిల్లకొండాయపల్లి సమీపంలో హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు కిందకు వేలాడుతూ ఉండటాన్ని గమనించిన ఆటోడ్రైవర్‌ పోతులయ్య (కునుకుంట్ల గ్రామ వాసి), వాహనాన్ని నిలిపి వెనక్కు తీసుకొస్తున్న సమయంలో ఆటోపై ఉన్న మంచానికి విద్యుత్‌ తీగలు తగలడంతో ఒక్కసారిగా విద్యుత్‌ సరఫరా అవడంతో మంటలు వ్యాపించాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న పోతలయ్య, మరో ఐదుగురు మహిళలు కిందకు దూకారు. కానీ అప్పటికే మంటలు అంటుకోవడంతో ఆటోలోనే ఉండిపోయిన ఐదుగురు మహిళలు సజీవదహనం అయ్యారు. మరికొంతమంది గాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ గాయత్రి అనే కూలీ అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై మిగిలిన కూలీలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకొని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. కళ్లెదుటే ఐదుగురు మహిళలు సజీవ దహనమైపోయారు. మృతిచెందిన కూలీలంతా ఒకే గ్రామం, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో పోలీసులు, స్థానికులు కలిసి ట్రాక్టర్‌ లో ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కొరకు తరలించారు.
గవర్నర్‌ దిగ్భ్రాంతి
మహిళా కూలీల సజీవ దహన దుర్ఘటనపై గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం నుండి పూర్తి సమాచారం తీసుకోవాలని రాజ్‌ భవన్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియాకు ఆదేశాలు జారీచేశారు.
మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం: సీఎం జగన్‌
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ప్యారిస్‌ పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. మహిళా కూలీల సజీవదహనం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎంవో ద్వారా వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని, బాధితుల కుటుంబాలకు అండగా నిలవాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి: రామకృష్ణ విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: సత్యసాయి జిల్లాలో ఐదుగురు మహిళా కూలీల దుర్మరణంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. విద్యుత్‌ శాఖాధికారుల అలసత్వం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఎనిమిది నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెగిన హైటెన్షన్‌ వైర్లకు సకాలంలో విద్యుత్‌ సిబ్బంది మరమ్మతులు చేసి ఉంటే ఈ దుర్ఘటన జరిగేది కాదన్నారు. మృతులకు ప్రగాఢ సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10లక్షలు ప్రకటించిందనీ, అయితే రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, క్షతగాత్రులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రామకృష్ణ కోరారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం అందచేయాలని డిమాండు చేశారు. మరణించినవారంతా రోజువారీ వ్యవసాయ కూలీలేనని, ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం ఏ మాత్రం సరిపోదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img