Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

సాహితీ సంస్థలు సంఘటితం కావాలి

. భావప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించుకుందాం!
. ఆంధ్ర రచయితల సంఘాల ఐక్యవేదికను నిర్మిద్దాం!
. అరసం మహాసభ తీర్మానం

విశాలాంధ్ర`గుంటూరు/తెనాలి: భారత రాజ్యాంగంపై ప్రమాణంచేసి అధికారంలోకి వచ్చిన వారు అనుసరిస్తున్న విధానాల వల్ల భావప్రకటన స్వేచ్ఛ ప్రమాదంలో పడిరదనీ, హిందూ మతరాజ్య స్థాపన కోసం లౌకిక రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంస్థలను, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారనీ వీటన్నింటిని అడ్డుకునేందుకు కవులు, రచయితలు, రచయితల సంఘాలు, ఉద్యమ రచయితల సంఘాలు తక్షణం సంఘటితం కావాల్సిన అవసరాన్ని రెండు రోజులపాటు గుంటూరుజిల్లా తెనాలిలో జరిగి ఆదివారం ముగిసిన అరసం రాష్ట్ర 19వ మహాసభలు వక్కాణించాయి. ఈ మేరకు మహాసభల ముగింపు రోజైన ఆదివారం ఒక తీర్మానాన్ని అరసం ఆమోదించింది. ఆ తీర్మానం ఇలావుంది. ఏ స్వేచ్ఛ కోసం మన తాతలు, తండ్రులు మహోన్నత పోరాటాలు, త్యాగాలు చేశారో ఆ స్వేచ్ఛను ఈ రోజు స్వదేశీ పాలకవర్గం క్రమంగా హరించివేస్తోంది. రాజ్యాంగం దేశ పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కులపై దాడి చేస్తున్నారు. ఫాసిస్టు పాలనకు తెరతీశారు. వారు మూక దాడులు, హత్యాకాండలకు ఉసిగొల్పుతున్నారు. ఆ ఉన్మాద భావజాలాన్ని వ్యతిరేకించి ప్రజల పక్షాన నిలిచే రచయితలను, మేధావులను, సామాజిక ఉద్యమకారు లను, కళాకారులను ఆ మూకలు లక్ష్యంగా చేసుకుం టున్నాయి. వీరి హత్యాకాండకు అనేక మంది బలయ్యారు. ఈ పాలకవర్గ పార్టీలు దేశసంపద సృష్టికర్తలైన కోట్లాది మంది రైతులు, కార్మికులను నిర్లక్ష్యం చేస్తూ పదుల సంఖ్యలోని కార్పొరేట్‌ శక్తులకు వేల, లక్షలాది కోట్ల రూపాయలను దోచిపెడుతు న్నాయి. ఈ విధానం మన ఆర్ధిక మూలాలను దెబ్బతీస్త్తోంది. తీవ్ర ఆర్ధిక సంక్షోభానికి మన దేశం మరెంతో దూరంలో లేదు. ఈ నేపథ్యంలో కవులు, రచయితలు, రచయితల సంఘాలు, ఉద్యమ రచయితల సంఘాలు సంఘటితం కావల్సిన తక్షణావసరాన్ని మనందరం గుర్తించాల్సి ఉందని ఆ తీర్మానం పేర్కొంది. రాష్ట్రంలో సాహిత్య సంఘాలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ఇందులో పరిమిత లక్ష్యాలతో పనిచేసేవి ఉన్నాయి. ఉద్యమ సంస్థలూ ఉన్నాయి. కానీ పాలకవర్గం నియంతృత్వ ధోరణులపై, నిరంకుశ చర్యలపై ఒంటరిగా, విడివిడిగా ఉద్యమించేస్థాయి, శక్తి ఎవరికీ లేదు. అయినా భావ ప్రకటనా స్వేచ్ఛపై జరిగే దాడికి గురికాకుండా తప్పించుకోవ డం ఏ ఒక్కరికీ సాధ్యం కాదు. ఆ దాడిని ఎదుర్కొనేందుకు అన్ని సంస్థలు సంఘటితం కావాలి. స్వాతంత్య్రోద్యమం, సామాజిక సమన్యాయం కోసం ఈ జాతి చేసిన పోరాట జ్వాలలలోంచి పుట్టిన అరసం నేటి ఈ కర్తవ్యాన్ని బాధ్యతగా స్వీకరిస్తోందని ఆ తీర్మానం తెలిపింది. భావప్రకటనా స్వేచ్ఛపై జరిగే దాడుల్ని ప్రతిఘటంచి, ఈ మతోన్మాద నిరంకుశ పాలనను వ్యతిరేకిద్దామనీ, జాతిని చైతన్యపరిచే మన కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం. ఇందుకోసం ‘‘భావప్రకటనా స్వేచ్ఛను పరిరక్షించుకుందాం! సాహిత్య సంస్థలన్నీ సంఘటితం కావడమే మనముందున్న ఏకైక మార్గం. ఆంధ్ర రచయితల సంఘాల ఐక్యవేదికను నిర్మిద్దాం అని ఆ తీర్మానం పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img