Friday, May 3, 2024
Friday, May 3, 2024

స్ఫూర్తి నింపిన సీపీఐ రాష్ట్ర మహాసభలు

ఆసక్తికరంగా చర్చలు
52 తీర్మానాలు ఆమోదం

విశాలాంధ్ర బ్యూరో`విశాఖపట్నం: సీపీఐ రాష్ట్ర 27వ మహాసభలు విజయవంతంగా ముగిశాయి. విశాఖపట్నంలో దాదాపు 48 సంవత్సరాల తర్వాత జరిగిన మహాసభలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. తొలిరోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి గురజాడ కళాక్షేత్రం వరకు వేలాదిమంది పార్టీ శ్రేణులతో భారీ ప్రదర్శన జరిగింది. అనంతరం గురజాడ కళాక్షేత్రంలో బహిరంగసభ నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీవీ సత్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథులుగా సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ, కార్యవర్గ సభ్యులు డి.అనీరాజా, సినీ, సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ బహిరంగ సభలో నేతలు చేసిన ఉపన్యాసాలు పార్టీ శ్రేణులను ఉత్తేజపర్చాయి. వీఎంఆర్‌డీఏ చిల్ట్రన్స్‌ ఎరీనా (కొల్లి నాగేశ్వరరావు సభా ప్రాంగణం)లో 27, 28 తేదీల్లో ప్రతినిధుల సభలు జరిగాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన సీపీఐ, ప్రజా సంఘాలకు చెందిన సుమారు 650 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ప్రతినిధుల సభను డి.రాజా ప్రారంభించి, జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలను సమగ్రంగా వివరించారు. పార్టీ నిర్మాణంపై సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రామకృష్ణ కార్యదర్శి నివేదిక సమర్పించగా, దానిపై ప్రతినిధులు పెద్దసంఖ్యలో చర్చలో పాల్గొన్నారు. మూడు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఐ చేస్తున్న ఆందోళనా కార్యక్రమాలను అందరూ కొనియాడారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా, విభజన అంశాల అమలుపై సుదీర్ఘ పోరాటం, అమరావతి రాజధాని రైతుల పోరాటానికి మద్దతుగా ఆందోళనలు, పోలవరం నిర్వాసితులకు అండగా ఉద్యమాలు, సీపీఎస్‌, ఇతర అంశాలపై సాగించిన పోరాటాలను ప్రస్తావించారు. చర్చలు అత్యంత ఆసక్తికరంగా సాగాయి. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దాదాపు 52 కీలక అంశాలపై మహాసభ తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించింది. అర్హతల కమిటీ నివేదికను రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య ప్రవేశపెట్టగా, ఆడిట్‌ నివేదికను రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై.చెంచయ్య ప్రవేశపెట్టారు.
ఉద్యమాలే శరణ్యం:
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విస్తృత ఉద్యమాలు నిర్వహించడమే తప్ప వేరే మార్గం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పష్టం చేశారు. సీపీఐ రాష్ట్ర 27వ మహాసభల్లో ప్రవేశపెట్టిన రాజకీయ, నిర్మాణ కార్యదర్శి నివేదికలపై రెండు రోజుల విస్తృత చర్చ అనంతరం ఆయన సమాధానమిచ్చారు. కనీవినీ ఎరుగని రీతిలో ఓ వైపు మోదీ ప్రభుత్వం మతోన్మాద విచ్ఛిన్నకర చర్యలకు పాల్పడుతుండగా, మరోవైపు జగన్‌ సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించుతూ, అరాచక చర్యలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో 26 జిల్లాల్లోని పార్టీ శ్రేణులు సరికొత్త వ్యూహాత్మక విధానాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దుశ్చర్యలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అక్టోబరు 14`18 తేదీల్లో విజయవాడలో జరిగే సీపీఐ 24వ జాతీయ మహాసభలను జయప్రదం చేయడానికి శాయశక్తులా కృషి చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img