Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

స్విచ్చేస్తే షాక్‌..!

ట్రూ అప్‌ చార్జీల పేరుతో బాదుడు
వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగింపు
ఈనెల బిల్లునుంచే మొదలైన గుంజుడు
2014`19 కాలంలో నష్టాల పేరిట నాటకం
పాత బిల్లులు మేమెందుకు చెల్లిస్తామంటూ అద్దెదారుల గగ్గోలు

ఒకపక్క కరోనా సంక్షోభం, మరోపక్క పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో బతుకు భారమై ఉక్కిరిబిక్కిరవుతున్న సామాన్య, మధ్యతరగతి వర్గాలపై తాజాగా రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి ట్రూఅప్‌ చార్జీల పేరుతో మరింత భారం మోపింది. ఇది ఈనెల నుంచే ప్రారంభం కావడంతో ప్రస్తుతం విద్యుత్‌ బిల్లులు అందుకున్న వినియోగదారులంతా షాక్‌కు గురయ్యారు.

అమరావతి : తాజా కరెంటు బిల్లులు చూసి రాష్ట్ర ప్రజానీకం ఖంగు తిన్నారు. తమకు నెలవారీ వచ్చే కరెంటు బిల్లు కంటే 40 నుంచి 80శాతం వరకు అదనంగా రావడంతో వారంతా ఇదెక్కడి దారుణమంటూ గగ్గోలు పెడుతున్నారు. ట్రూ అప్‌ చార్జీల పేరుతో యూనిట్‌కి రూ.1.23 చొప్పున అదనంగా చెల్లించాలని బిల్లులో పేర్కొన్నారు. దాంతో చాలామందికి తక్కువ విద్యుత్‌ వినియోగించినా ఆగస్టు నెల బిల్లులు జులై కంటే 40 నుంచి 80 శాతం ఎక్కువగా వచ్చాయి. 2014-19 సంవత్సరాల్లో విద్యుత్‌ వినియోగానికి సంబంధించి ఈ ట్రూ అప్‌ చార్జీలు వసూలు చేయక తప్పదని ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి చెబుతోంది. ఏపీలో మూడు విద్యుత్‌ పంపిణీ సంస్థలున్నాయి. ఏపీఈపీడీసీఎల్‌ అధ్వర్యాన ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు విద్యుత్‌ పంపిణీ చేస్తున్నారు. ఏపీసీపీడీసీఎల్‌ ద్వారా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో విద్యుత్‌ సరఫరా జరుగుతోంది. రాయలసీమ 4 జిల్లాలతోపాటూ, నెల్లూరు జిల్లాలకు ఏపీఎస్పీడీసీఎల్‌ ద్వారా విద్యుత్‌ అందిస్తున్నారు.ఈ మూడు సంస్థలు గత ప్రభుత్వ హయంలో ఎదురైన నష్టాలు పూడ్చుకోడానికి ఈ ట్రూ అప్‌ చార్జీలు ప్రవేశ పెట్టాయి. విద్యుత్‌ కొనుగోళ్లు, సరఫరాలో వచ్చే వ్యత్యాసాల వల్ల తమకు వచ్చే నష్టాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేయడం కంపెనీలకు అలవాటుగా మారింది. దీనివల్ల ప్రస్తుతం ఎన్ని యూనిట్లు అదనంగా విద్యుత్‌ వినియోగిస్తే వాటిపై యూనిట్‌కు రూ.1.23 చొప్పున అదనపు భారం పడనుండడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.
ట్రూ అప్‌ భారమెంత?
మూడు డిస్కమ్‌ల వినతి మేరకు ట్రూ అప్‌ చార్జీల వసూళ్లకు ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతించింది.
వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు అనుమతించాలంటూ ఏప్రిల్‌లో ఆయా సంస్థలు

ఏపీఈఆర్సీని కోరగా మే 12న పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించిన ఏపీఈఆర్సీ తన ఆమోదం తెలిపింది. డిస్కమ్‌లు రూ.19,603 కోట్లకు క్లెయిమ్‌ చేయగా 2014-19 సంవత్సరాలకు సంబంధించి రూ.3,669 కోట్ల మేర వసూళ్లకు ఏపీఈఆర్సీ అంగీకరించింది.వాస్తవానికి రూ.4,939 కోట్లుగా నిర్ధరించినప్పటికీ.. అందులో ఇప్పటికే చెల్లించిన అదనపు వ్యవసాయ సబ్సిడీ, రెన్యువబుల్‌ ఎనర్జీ సర్టిఫికెట్‌ ద్వారా వచ్చిన రూ.1,926 కోట్ల ఆదాయం మినహాయించి రూ.3,669 కోట్లకు అనుమతి లభించింది.దానికి అనుగుణంగా ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలో రూ.1,167.75 కోట్లు, ఏపీఈపీడీసీఎల్‌ రూ.701.28 కోట్లు, ఏపీసీపీడీసీఎల్‌ ద్వారా రూ.673.83 కోట్లు సమీకరించాలని నిర్ణయించారు.అయితే 2014-19 మధ్య సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ కూడా సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌లో భాగంగా ఉండడంతో ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలోని 5 జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో యూనిట్‌కి రూ. 1.23 చొప్పున వసూలు చేస్తున్నారు. ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలో మాత్రం యూనిట్‌కి 45 పైసలు చొప్పున వసూలు చేస్తున్నారు. అప్పుడు చార్జీలు చెల్లించినా, ఇప్పుడు నష్టాలు భరించాలి.ఈ ట్రూ అప్‌ చార్జీలు 2014-19 వరకూ ఆయా విద్యుత్‌ వినియోగదారులు వాడిన యూనిట్లను బట్టి భరించాల్సి ఉంటుంది. ఐదేళ్లలో మొత్తం ఎన్ని యూనిట్లు వాడారనేది లెక్కగట్టి దానిని 8 నెలల బిల్లుల్లో సర్దుబాటు చేస్తారు. 8 వరుస బిల్లుల్లో సర్దుబాటు చేసి ట్రూ అప్‌ చార్జీలుగా వసూలు చేస్తున్నారు. ఆగస్టులో విద్యుత్‌ వినియోగానికి గాను ఇప్పుడున్న టారిఫ్‌ మేరకు రూ.600 బిల్లుగా వస్తే దానికి అదనంగా 50 శాతం వరకూ ఈ ట్రూ అప్‌ చార్జీల మొత్తం కలుపుకొని రూ.900కి పైగా బిల్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
అద్దెదారుల గగ్గోలు
ఎప్పుడో ఏడేళ్ల క్రితం నుంచి వాడిన కరెంటు కోసం ఇప్పుడు మేమెందుకు విద్యుత్‌ బిల్లు చెల్లించాలంటూ అద్దె ఇళ్లల్లో, అపార్ట్‌మెంట్లలో ఉండే వారు ప్రశ్నిస్తున్నారు. 2014`19 కాలంలో పిల్లల చదువుల కోసం పట్టణాలు, నగరాల్లో నివసించిన వారు ఇప్పుడు ఆ ఇళ్లల్లో ఉండడం లేదు. అలాగే ఆనాడు ప్రైవేటు ఉద్యోగం చేసేవారు ప్రస్తుతం వేరే నగరాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం ప్రమోషన్లపై, బదిలీలపై ఇతర ప్రాంతాలకు వెళ్లారు. అప్పట్లో వారు వినియోగించిన కరెంట్‌ భారం ప్రస్తుతం ఉండేవారిపై పడుతోంది. ఇంటి ఓనర్‌ని అడిగితే మాకు సంబంధం లేదని తప్పించుకుంటున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్న ఇళ్లకు యజమానులే భరించాల్సి వస్తోంది.
ఆందోళనకు సిద్ధమవుతున్న వామపక్షాలు
అసలే నిత్యావసర ధరలు, పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ట్రూ అప్‌ చార్జీల పేరుతో ప్రజలపై దాదాపు 4వేల కోట్లు అదనపు భారం మోపడం దుర్మార్గమని వామపక్షనేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో సర్దుబాటు చార్జీలను తప్పుబట్టిన జగన్‌, ఇప్పుడు ట్రూ అప్‌ చార్జీల పేరుతో అదనపు భారం మోపడం తగునా ? అని ప్రశ్నిస్తున్నారు. వీటిని తక్షణమే ఉపసంహరించు కోవాలని, ఆ భారాన్ని ప్రభుత్వమే భరించాలని, లేనిపక్షంలో ప్రజాగ్రహం చవిచూడాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ అప్రజాస్వామిక విధానాన్ని విద్యుత్‌ వినియోగదారులంతా ప్రతిఘటించాలని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img