Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

హెల్ప్‌… హెల్ప్‌!

మణిపూర్‌లో ఆంధ్రా విద్యార్థుల ఆర్తనాదాలు

. ఇంఫాల్‌లో చెలరేగిన హింసతో తిండీతిప్పల్లేక ఇబ్బందులు
. దయచేసి మమ్మల్ని తీసుకెళ్లండంటూ అభ్యర్థనలు
. వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన
. ఇప్పటికే ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాలు తరలింపు చర్యలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: మణిపూర్‌లో ఘర్షణలు, హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చదువుకుంటున్న ఆంధ్ర ప్రదేశ్‌ విద్యార్థులు, ఇక్కడ ఉంటున్న వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మణిపూర్‌ ఎన్‌ఐటీ సమీపంలో ఆదివారం కూడా పేలుళ్లు సంభవించడంతో విద్యార్థులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. తమను తక్షణమే స్వస్థలాలకు చేర్చేలా ఏర్పాట్లు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఫోన్‌లు, వాట్సప్‌ల ద్వారా స్థానికంగా ఉన్న వారి తల్లిదండ్రులకు, బంధువులకు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అధికారిక వెబ్‌సైట్లకు తాము పడుతున్న ఇబ్బందులను తెలియజేస్తున్నారు. మణిపూర్‌ ఎన్‌ఐటీ సహా వివిధ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులు మన రాష్ట్రానికి చెందిన వారు సుమారు 157 మంది ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఒక్క ఎన్‌ఐటీ క్యాంపస్‌లోనే సుమారు 150 మంది తెలుగు విద్యార్థులు ఉండగా, వారిలో 70 మంది వరకు ఆంధ్ర ప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. గత మూడు రోజులుగా పేలుళ్లు జరుగుతున్నాయని, ఆహార పానీయాలకు కూడా ఇబ్బందిపడుతున్నామని ఎన్‌ఐటీ విద్యార్థులు వాపోయారు. అల్లర్ల కారణంగా బయట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, దీంతో బయట నుంచి ఏమీ రాక తిండికి కూడా ఇబ్బంది పడుతున్నామని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. అక్కడ విద్యార్థులు పడుతున్న ఇక్కట్లను స్థానికంగా ఉన్న వారి తల్లిదండ్రులు రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు దృష్టికి తీసుకువెళ్లి, వారిని సాధ్యమైనంత త్వరగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రాథేయపడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ, ఒడిశా ప్రభుత్వాలు వారి విద్యార్థులను స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశాయని, కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రకటనలకే పరిమితమవుతోందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేక విమానంతో తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు
మణిపూర్‌లో అల్లర్ల కారణంగా చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను సురక్షితంగా వారి స్వస్థలాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటోంది. ఇప్పటి వరకు దాదాపు 157 మంది ఏపీ విద్యార్థులు మణిపూర్‌లో చదువుతున్నట్లు గుర్తించారు. మరోవైపు మణిపూర్‌లోని తెలుగు విద్యార్థులు ఉన్న కళాశాలల్లో ఒక్కో కళాశాల నుంచి ఒక్కో విద్యార్థిని నోడల్‌ పాయింట్‌గా అధికారులు గుర్తించారు. వారి ద్వారా ఆయా కళాశాలల్లోని ఏపీకి చెందిన మిగిలిన విద్యార్థుల వివరాలను సేకరిస్తున్నారు. వీరిని ప్రత్యేక విమానం ద్వారా సొంత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. విద్యార్థులను ప్రత్యేక విమానంలో తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీనికి సంబంధించి పౌర విమానయాన శాఖ అధికారులతో మాట్లాడుతున్నారు. ప్రత్యేక విమానం ద్వారా ఏపీ విద్యార్థులను తరలించడానికి పౌర విమానయాన శాఖ అంగీకరించింది. ప్రత్యేక విమానాన్ని ఎన్ని గంటలకు ఏర్పాటు చేస్తామన్న సమాచారంతో పాటు ఏ విమానంలో తరలిస్తామన్నది తెలియజేస్తామని పౌర విమానయాన శాఖ అధికారులు తెలిపారు. ఒకవైపు పౌర విమానయాన శాఖ అధికారులతో సంప్రదిస్తూనే ప్రైవేటు విమానయాన సంస్థలతోనూ అధికారులు మాట్లాడుతున్నారు. ప్రత్యేక విమానం ఏర్పాటుకు ఇండిగో విమానయాన సంస్థతో అధికారులు సంప్రదిస్తున్నారు.
సీఎస్‌కు చంద్రబాబు లేఖ
ఇంఫాల్‌లో తెలుగు విద్యార్థులను సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఇంఫాల్‌లో చెలరేగిన హింస అక్కడ చదువుతున్న ఏపీ విద్యార్థులను ప్రమాదంలో పడేసింది. అక్కడి పరిస్థితుల కారణంగా తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై ఆందోళన చెందుతున్నారు. భారత ప్రభుత్వంతో, అక్కడి స్థానిక అధికారులతో మాట్లాడి విద్యార్థులను సురక్షిత మార్గంలో వారిని ఇంటికి చేర్చడానికి చర్యలు తీసుకోవాలి. ఇంఫాల్‌ నుంచి ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులను తరలించాలి. విద్యార్థులు ఇంటికి తిరిగి తీసుకువచ్చే వరకు వారి సంరక్షణ, సౌకర్యం కోసం చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు ఆహారం, నీరు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు.
విద్యార్థులతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పిన సీపీఐ నేత రామకృష్ణ
మణిపూర్‌లోని ఎన్‌ఐటీలో చదువుతున్న ఏపీ విద్యార్థులతో ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఫోన్‌లో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. ఎన్‌ఐటి కళాశాల వద్ద తెల్లవారుజామున పెద్ద పెద్ద శబ్దాలతో బాంబులు పేలాయని విద్యార్థులు తెలిపారు. బాంబు పేలుళ్ల వలన విపరీతంగా వచ్చిన పొగమంచుకు కొందరు విద్యార్థులు అపస్మారక స్థితికి వెళ్లారు. ఆహారం, మందులు, తాగు నీరు కూడా దొరక్క అక్కడ పడుతున్న ఇబ్బందులను తెలియజేయగా, తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మిమ్మల్ని స్వస్థలాలకు తరలించేందుకు కృషి చేస్తామని రామకృష్ణ వారికి ధైర్యం చెప్పారు. అనంతరం వెంటనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి మణిపూర్‌లో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను, మరోపక్క విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల పరిస్థితిపై ఆందోళన చెందుతున్న తీరును వివరిస్తూ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి మణిపూర్‌లో విద్యార్థులందరినీ తీసుకురావాలని కోరారు. తెలంగాణకు చెందిన విద్యార్థులను తీసుకువచ్చేందుకు ఆ ప్రభుత్వం ప్రత్యేక విమానం ఏర్పాటు చేయగా, ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం విచారకరమని, ఇకనైనా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరారు.
తక్షణమే తీసుకురండి : సీపీఎం నేత శ్రీనివాసరావు
మణిపూర్‌ రాష్ట్రంలో ఏర్పడిన ఘర్షణలతో, అత్యవసర పరిస్థితి కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులిచ్చారు. అక్కడ ఎన్‌ఐటీలో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉంది. చాలా ఆందోళనతో ఉన్నారు. తెలంగాణా ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక విమానాల ద్వారా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. మణిపూర్‌లో సమాచార వ్యవస్థ అంతా ధ్వంసమైన నేపథ్యంలో తల్లిదండ్రులు ఇక్కడ తల్లడిల్లుతున్నారు. సీఎం జగన్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మణిపూర్‌లో చదువుతున్న విద్యార్థులను తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img