Friday, April 26, 2024
Friday, April 26, 2024

తెలుగువారి మదిలో నిత్యం కదిలే కరుణశ్రీ

నేడు జంధ్యాల జయంతి
పొన్నూరు : సమకాలిన భావాలకు అద్దంపట్టేలా అద్భుతమైన ఖండ కావ్యాలు రచించి తెలుగువారి మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి. సులభమైన శైలి, సమకాలిన ధోరణి పాపయ్యశాస్త్రి ప్రతి రచనలో కనిపిస్తాయి. ఈ నెల 4న పాపయ్య శాస్త్రి జయంతి సందర్భంగా అందిస్తున్న ప్రత్యేకం.
తెలుగు వారు గర్వించదగిన ఒక ఆణిముత్యం జంధ్యాల పాపయ్య శాస్త్రి. చక్కటి భావాలను ఆవిష్కరించడంలో జంధ్యాల పాపయ్య శాస్త్రికి మించిన వారు మరెవ్వరూ లేరంటే అతిశయోక్తి కాదు. 1912 ఆగస్టు 4వ తేదీన కాకుమాను మండలం కొమ్మూరు గ్రామంలో జంధ్యాల పాపయ్యశాస్త్రి జన్మించారు. సంస్కృత భాషపై మక్కువ ఎక్కువగా ఉన్న పాపయ్య శాస్త్రి చిన్నతనంలోనే భమిడిపాటి సుబ్రహ్మణ్యశర్మ, కుప్పా ఆంజనేయశాస్త్రి వద్ద సంస్కృత కావ్యాలు నేర్చుకున్నారు. రాష్ట్ర భాషా విశారద, ఉభయ భాషా ప్రవీణ, హిందీ భాషా ప్రవీణ, పరీక్షల్లో ఉత్తీర్ణులై పలు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. కరుణశ్రీ, ఉదయశ్రీ, విజయశ్రీ పాపయ్య శాస్త్రి కలం పేర్లుగా తెలుగు వారికి సుపరిచితం. అనేక కవితా ఖండికలు 20వ శతాబ్దంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆ సమయంలో జంధ్యాల పాపయ్య శాస్త్రి ప్రతి తెలుగు వారి గుండెను తట్టిలేపారు. అద్భుతమైన ఖండకావ్యాలు పాపయ్యశాస్త్రి ప్రత్యేకత. కరుణరసాత్మక అద్భుతమైన కవితలు రాసి కరుణశ్రీగా వినుతికెక్కారు. కరుణశ్రీ పుష్పవిలాపం, కుంతీకుమారి సమాజంలో ఉత్తమమైన మార్పుకి నైతికవిలువలు పెంపొందించడానికి ఎంతగానో దోహదపడ్డాయి. దీన్నిబట్టి పాపయ్య శాస్త్రి ఆలోచనా విధానం ఏవిధంగా ఉండేదో చెప్పక చెబుతుంది. ఎన్నో పురస్కారాలు అందుకున్న కరుణశ్రీ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ తెలుగువారి మనసు పులకించి పోతుంది. జంధ్యాల పాపయ్య శాస్త్రిని స్మరించుకుంటుంది. తెలుగువారి మదిలో నిత్యం కదిలే కరుణశ్రీ తెలుగు సాహితీ రంగాన చెరగని సంతకంగా మిగిలిపోయారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img