Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం వైఎస్‌ జగన్‌

ఇళ్ళ పట్టాల పంపిణీలో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే గిరిధర్‌

విశాలాంధ్ర`గుంటూరు వైద్యం : సమాజంలో అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు చూడలేదని శాసనమండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ప్రభుత్వం పేద విద్యార్థులకు ఇంగ్లీషు విద్యను అందుబాటులోకి తెస్తే… దాన్ని కూడా ప్రతిపక్షం అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. జీఎంసీ పరిధిలోని 29వ డివిజన్‌లో స్థానిక కార్పొరేటర్‌ షేక్‌ రోషన్‌ ఆధ్వర్యంలో శనివారం మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు, ఏఎంసీ ఛైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నంతో కలిసి లేళ్ళ అప్పిరెడ్డి మహిళలకు జగనన్న ఇళ్ళ పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ పేదలకు మేలు జరుగకూడదని ప్రతిపక్షాలన్నీ కట్టగట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై మూకుమ్మడి దాడి చేస్తున్నాయని విమర్శించారు. పేదలకు నగదు పంపిణీ ద్వారా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేయడమే కాక కోర్టుల్లో కేసులు వేసి స్టేలతో అడుగడుగునా మోకాలడ్డుతున్నాయని ఆరోపించారు. మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు మాట్లాడుతూ గుంటూరు నగరంలో 70వేల పై చిలుకు కుటుంబాలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చిన ఘనత జగన్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇప్పటి వరకు గత పాలకులెవరూ కూడా ఇక్కడ ఒక్క పట్టా కూడా పంపిణీ చేసిన పాపాన పోలేదని విమర్శించారు. అసలు గతంలో ఏ పని కావాలన్నా ప్రజలు జన్మభూమి కమిటీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తేనే పనులు ముందుకు సాగేవని తెలిపారు. ఏఎంసీ ఛైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూర్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. పేదల సొంతింటి కల సాకారం చేసే దిశగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రికి అందరూ అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు, కార్పొరేటర్లు అచ్చాల వెంకటరెడ్డి, మోదుకూరి వెంకటరత్నం, డివిజన్‌ అధ్యక్షుడు సురసాని వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img