Friday, April 26, 2024
Friday, April 26, 2024

పెను ప్రమాదమే.. కాపాడుకుంటాం

భద్రతాదళాల బలోపేతమే లక్ష్యం
అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ
కాబూల్‌ ఆక్రమణ దిశగా తాలిబన్లు

కాబూల్‌: దేశ భద్రతా దళాలను పునరుత్తేజం చేయడమే తన ప్రధాన లక్ష్యమని అఫ్గాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ స్పష్టంచేశారు. శనివారం ఆయన వీడియో ద్వారా దేశ ప్రజలకు సందేశమిచ్చారు. అఫ్గాన్‌ రాజధాని కాబూల్‌లో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్న తరుణంలో..రక్షణ దళాలను బలోపేతం చేయాలని, ఆ దిశగా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఘనీ వెల్లడిరచారు. ప్రజాప్రతినిధులు, నాయకులతో అంతర్జాతీయ భాగస్వాములతో విస్త్రతంగా సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. కాబూల్‌ నాయకత్వంలో మార్పు ఉందనే ఊహాగానాల మధ్య అష్రఫ్‌ ఘనీ దేశంలో 20సంవత్సరాలుగా నెలకొన్న అస్థిరతను నిలువరిస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. అధ్యక్షుడిగా దేశంలో హింస, దౌర్జన్యాన్ని నివారిస్తానని హామీ ఇచ్చారు. అమెరికా సేనల ఉపసంహరణ అనంతరం అఫ్గాన్‌లో మళ్లీ తాలిబన్లు రెచ్చిపోయారు. దేశంలోని ఒక్కో రాష్ట్రాన్ని హస్తగతం చేసుకుంటున్నారు. దేశంలో అతిపెద్ద నగరం కాందహార్‌..తాలిబన్ల వశమైనట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం తాలిబన్లు కాబూల్‌ సరిహద్దుల్లో పాగావేశారు. ఈ పరిస్థితుల్లో కాబూల్‌లోని విదేశీ కార్యాలయాలను మూసివేస్తున్నారు. వాటిల్లో పనిచేసే సిబ్బందిని ఆయా దేశాలకు తరలిస్తున్నారు. శనివారం కాందహార్‌లోని ప్రధాన రేడియో స్టేషన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి వాయిస్‌ ఆఫ్‌ షరియా అని పేరు పెట్టారు. దీనిలో సంగీతం ఇకపై ప్లే చేయరు. వార్తలు, ఖురాన్‌ పఠనానికి మాత్రమే వినియోగిస్తారు. గురువారం జరగబోయే స్వాతంత్య్ర దినోత్సవంపై కాబూల్‌లో వివిధ రకాలుగా చర్చిస్తున్నారు. ఉత్తర అఫ్గాన్‌లోని ప్రధాన నగరం మాజార్‌షరీఫ్‌పై తాలిబన్ల బహుముఖ దాడి ప్రారంభమైంది. దేశంలో మూడిరట రెండు వంతుల భూభాగం తాలిబన్ల వశమైంది. రాజధానిలోని అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా వేలాదిమంది దేశాన్ని విడిచి పారిపోతున్నారు.
పౌరులను తరలిస్తున్న అమెరికా
అఫ్గాన్‌లో పరిస్థితులు విషమంగా మారుతున్న పరిస్థితుల్లో…వివిధ దేశాలు ఆచితూచి అడుగేస్తున్నాయి. శాంతిపరిరక్షణకు ఒకవైపు చర్చలు ప్రారంభంకాగా..మరోవైపు ఆ దేశం నుంచి తమ పౌరులను తరలించే ఏర్పాట్లలో ఆయా దేశాలు ఉన్నాయి. భారత్‌ ఇప్పటికే 50 మందిని ప్రత్యేక విమానంలో తరలించింది. ఇదేబాటలో అమెరికా కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది తమ పౌరులకు, దౌత్య సిబ్బందికి ఎటువంటి హానీ తలపెట్టవద్దని తాలిబన్లకు అమెరికా విజ్ఞప్తి చేసింది. కువైట్‌లోని అమెరికా బేస్‌ వద్ద 3500 మంది సైనికులు మోహరించారు. ఖతార్‌లోనూ వేయిమంది సైనికులున్నారు. ప్రత్యేక వీసాలపై అమెరికాలో స్థిరపడాలనుకునే అఫ్గాన్‌లకు వీరు సహాయమందిస్తున్నారని సమాచారం. అయితే ఇది తాత్కాలిక మిషన్‌గా పెంటగాన్‌ ప్రతినిధి జాన్‌ కిర్బీ తెలిపారు. అఫ్గాన్‌ పరిస్థితిపై చర్చించేందుకు బైడెన్‌ జాతీయ భద్రతా సలహాదారులతో సమావేశమయ్యారు. అమెరికన్లు వెంటనే బయలుదేరాలని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరిక జారీ చేసింది.
కాబూల్‌ను చుట్టుముట్టిన తాలిబన్లు
అఫ్గాన్‌ భద్రతాదళాలపై దాడులు చేస్తూ ఒక్కోప్రాంతాన్ని తాలిబన్లు ఆక్రమిస్తున్నారు. తాజాగా అఫ్గాన్‌ రాజధాని కాబూల్‌ను ఆక్రమించే దిశగా పయనిస్తున్నారు. 18 ప్రావిన్షియల్‌ రాజధానులను తమ అధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు…కొన్ని గంటల్లో కాబూల్‌ను హస్తగతం చేసుకోనున్నట్లు సమాచారం. అధికారాన్ని పంచుకుందామని తాలిబన్లు చేసిన ప్రతిపాదనను తాలిబన్లు కొట్టిపారేశారు. అఫ్గాన్‌లో మూడిరట రెండొంతుల కంటే ఎక్కువ భాగం తాలిబన్ల వశమైంది. కాబూల్‌కి 50కిలోమీటర్ల దూరంలోని లొగర్‌ ప్రావిన్స్‌ రాజధానిని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా, అఫ్గాన్‌్‌లో బలప్రయోగంతో అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వాన్ని గుర్తించబోమని భారత్‌తో పాటు జర్మనీ, ఖతార్‌, టర్కీ తదితర దేశాలు స్పష్టం చేశాయి. అఫ్గాన్‌లో హింస, దాడులను వెంటనే ఆపాలని సూచించాయి. అఫ్గాన్‌లో శాంతి ప్రక్రియ వేగవంతం కావాల్సి ఉందని దోహాలో జరిగిన చర్చలో పాల్గొన్న దేశాలు స్పష్టంచేశాయి.
అఫ్గాన్‌ మహిళలు, బాలికలపై దాడులు బాధాకరం
తాలిబన్ల దురాక్రమణతో అఫ్గాన్‌ పట్టుకోల్పోతోందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గాన్‌ మహిళలు, బాలికలపై తాలిబన్లు విధిస్తున్న కఠిన ఆంక్షలు తనను కలవరానికి గురిచేస్తున్నాయన్నారు. ముఖ్యంగా మహిళలు, జర్నలిస్టులే ప్రధాన లక్ష్యంగా తాలిబన్లు తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లోని మానవహక్కులపై తీవ్ర ఆంక్షలు విధిస్తున్నారు. అఫ్గాన్‌ బాలికలు, మహిళలు కష్టపడి సాధించుకున్న హక్కులను తిరిగి కోల్పోవడం హృదయ విదారకంగా, బాధాకరంగా ఉందన్నారు. అఫ్గాన్‌పై తక్షణమే దాడులు నిలిపివేయాలని తాలిబన్లకు గుటెర్రస్‌ విజ్ఞప్తి చేశారు. బలప్రయోగం అంతర్వ్యుద్ధానికి దారితీస్తుందని, దేశాన్ని ఒంటరి చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. స్థానిక పౌరులపై దాడులు చేయడం అంతర్జాతయ మానవతా చట్టాల్ని తీవ్రంగా ఉల్లంఘించడం యుద్ధనేరంతో సమానమని గుటెరస్‌ హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img