Friday, April 26, 2024
Friday, April 26, 2024

భారత్‌ సహా ఐదు దేశాల రాయబారుల తొలగింపు

జెలెన్‌స్కీ సంచలన నిర్ణయం

కీవ్‌: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్‌ జెలెన్‌స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌ సహా ఐదు దేశాల్లోని తన రాయబారులను ఆయన తొలగించారు. ఈ మేరకు అధ్యక్షుడి వెబ్‌సైట్‌ ద్వారా అధికారిక ప్రకటన జారీ అయింది. జర్మనీ, భారత్‌, చెక్‌ రిపబ్లిక్‌, నార్వే, హంగేరీలలో ఉక్రెయిన్‌ రాయబారులను జెలెన్‌స్కీ తొలగించారు. వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తారా లేదా అనే విషయమై స్పష్టత లేదు. అలాగే ఈ చర్యకు ఎటువంటి కారణాన్ని కూడా పేర్కొనలేదు. జర్మనీ, హంగేరీ, చెక్‌ రిపబ్లిక్‌, నార్వే, భారత దేశానికి చెందిన ఉక్రెయిన్‌ రాయబారులను తొలగించినట్టు జులై 9న జారీ అయిన ఉత్తర్వుల్లో జెలెన్‌స్కీ పేర్కొన్నారు. అదే సమయంలో ఇందులో ఉక్రెయిన్‌కు అంతర్జాతీయ మద్దతు, సైనిక సహాయాన్ని సమీకరించాలని జెలెన్‌స్కీ తన దౌత్యవేత్తలను కోరారు. ఫిబ్రవరి 24 నుంచి రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ఉక్రెయిన్‌ ప్రయత్నిస్తోందని తెలిపారు.
జర్మనీ-ఉక్రెయిన్‌ మధ్య టర్బైన్లపై ప్రతిష్ఠంభన
జర్మనీ-ఉక్రెయిన్‌ మధ్య చాలా సున్నిత సంబంధాలున్నాయి. జర్మనీ… రష్యా ఇంధన సరఫరాలపై ఎక్కువగా ఆధారపడు తోంది. కెనడాలో మెయింటెనెన్స్‌లో ఉన్న జర్మనీ తయారీ టర్బైన్‌పై ప్రస్తుతం రెండు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రష్యా సహజ వాయువు దిగ్గజం గాజ్‌ప్రోమ్‌కు కెనడా టర్బైన్‌లను సరఫరా చేయాలని జర్మనీ కోరుతోంది. అదే సమయంలో, టర్బైన్‌లను సరఫరా చేయవద్దని ఉక్రెయిన్‌ కెనడాను కోరింది. రష్యాకు ఇస్తే… దానిపై విధించిన ఆంక్షలను ఉల్లంఘించినట్లేనని పేర్కొంది. ఈ పరిస్థితిలో జర్మనీలోని ఉక్రెయిన్‌ రాయబారి ఆండ్రీ మెల్నిక్‌ను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు తొలగించడం కీలక పరిణా మంగా పరిగణిస్తున్నారు. ఆండ్రీ మెల్నిక్‌, జర్మనీ రాయబారిగా 2014 చివరలో నియమితులయ్యారు. ఆయన అప్పటి నుంచి జర్మనీలోని రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలతో సత్సంబంధాలు నెరుపుతున్నారు. జెలెన్‌స్కీ రష్యా ఆక్రమిత ఖేర్సన్‌ ఒబ్లాస్ట్‌ గవర్నర్‌ హెన్నాడీ లహూటాను కూడా తొలగించారు. సర్వెంట్‌ ఆఫ్‌ పీపుల్‌ పార్టీ నుంచి ఖేర్సన్‌ ఒబ్లాస్ట్‌ శాసనసభ సభ్యుడు డిమిత్రి బుట్రీని జెలెన్‌స్కీ తాత్కాలిక గవర్నర్‌గా నియమించారు.
మారియుపోల్‌లో పేలుళ్లు… ముగ్గురి మృతి
అజోవ్‌స్టాల్‌ స్టీల్‌ ప్లాంట్‌ సమీపంలో శనివారం రెండు పేలుళ్లు సంభవించినట్లు మారియుపోల్‌ మేయర్‌ సహాయకుడు పెట్రో ఆండ్రిష్చెంకో తెలిపారు. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా, అనేకమంది గాయపడ్డారని తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత తమ విధులను నిర్వర్తించకుండా డిప్యూటీలు దేశం విడిచిపెట్టిన అంశంపై దర్యాప్తు చేయడానికి తాత్కాలిక దర్యాప్తు కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని పార్లమెంట్‌ స్పీకర్‌ రుస్లాన్‌ స్టెఫాన్‌చుక్‌ చెప్పారు.
రష్యా నుండి మైకోలైవ్‌పై క్షిపణుల దాడి
రష్యా సైన్యం శనివారం ఉదయం మైకోలైవ్‌పై ఆరు క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ మేరకు మైకోలైవ్‌ మేయర్‌ అలెగ్జాండర్‌ సెంకెవిచ్‌ వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img