Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అమెరికా గజగజ

వణికిస్తున్న భీకర మంచు తుపాను
1500కుపైగా విమానాలు రద్దు
విద్యుత్‌ లేక అంధకారంలో లక్షల ఇళ్లు

లాస్‌ఏంజిల్స్‌ : అమెరికాను మంచుతుపాను గజగజ వణికిస్తోంది. పశ్చిమ తీరం నుంచి గ్రేట్‌ లేక్స్‌ వరకు భారీగా మంచు కురుస్తోంది. రెండు అడుగుల మందంగల మంచు దుప్పటి ఆయా ప్రాంతాలను కప్పేసింది. లక్షలాది ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోగా వేలాది విమానాలు రద్దయ్యాయి. లాస్‌ఏంజిల్స్‌ సమీపంలో సాధారణంగా వెచ్చగా ఉండే ప్రాంతాలకు మంచు తుపాను హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉత్తరం ప్రాంతాల్లోనూ మంచు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. మిన్నెసోటాలో రెండు దఫాలుగా మంచు కురవచ్చునని జాతీయ వాతావరణ విభాగం అధికారులు హెచ్చరికలు జారీచేశారు. ఎన్నడూ లేని విధంగా అతిశీతల వాతావరణ పరిస్థితులు, హిమపాతం, చలిగాలులతో ఉండే ప్రతికూల వాతావరణంలో ప్రయాణం అసాధ్యమన్నారు. మిన్నెసోటాలో గంటకు 55 నుంచి 70 కిలోమీటర్లతో వీచే గాలులతో కలిపి మంచు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రయాణించాల్సి వస్తే వింటర్‌ సర్వైవల్‌ కిట్‌ను దగ్గర పెట్టుకోవాలని సూచించారు. అదనంగా ఫ్లాష్‌లైట్‌, ఆహారం, నీళ్లు వెంట తీసుకెళ్లాలని, అనివార్యమైతే తప్ప ప్రయాణించవద్దన్నారు. ఎక్కడైనా చిక్కుకుపోతే వాహనంలో నుంచి బయటకు రావద్దని సూచనలు చేశారు. గురువారం 1,550 విమాన సేవలను రద్దు చేసినట్లు ఫ్లైట్‌ అవేర్‌ డాట్‌ కామ్‌ పేర్కొంది. ‘మిజరీ మ్యాప్‌’ ద్వారా డెన్వర్‌, సాల్ట్‌ లేక్‌ సిటీ, మినియాపొలిస్‌, సెయింట్‌ పాల్‌, వ్యోమింగ్‌లలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండటం తెలుస్తోంది. ప్రధాన రహదారులు మంచుతో కప్పబడి ప్రయాణం అసాధ్యంగా మారింది. దాదాపు 2.80 లక్షల ఇళ్లు అంధకారంలో చిక్కుకుపోయాయి. విద్యుత్తు సరఫరా నిలిచిన ఇళ్లలో దాదాపు సగం మిచిగాన్‌లోనే ఉన్నాయి. మరింత ప్రమాదకరమైన అతిశీతల తుపానుకు సిద్ధం కావాలని లాస్‌ఏంజిల్స్‌లోని ఎన్‌డబ్ల్యూఎస్‌ (వాతావరణ శాఖ) హెచ్చరికలు జారీచేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img