Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

తప్పుదారిపట్టించే మనస్తత్వాన్ని మార్చుకోవాలి

అమెరికాకు చైనా హెచ్చరిక
తియాన్‌జిన్‌ : తప్పుదారి పట్టించే ప్రమాదకరమైన మనస్తత్వాన్ని మార్చుకోవాలని అమెరికాకు చైనా గట్టిగా హెచ్చరించింది. తమను అమెరికా ఊహాత్మక శత్రువుగా చూస్తోందని, భూతంలా చూపించడం ఆపేయాలని స్పష్టం చేసింది. రెండు రోజుల పర్యటన సందర్బంగా అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ వెన్‌డి షెర్మాన్‌ చైనా ఓడరేవు నగరమైన తియాన్‌జిన్‌లో పర్యటిస్తున్న సందర్భంగా చైనా ఈ వ్యాఖ్యలు చేసింది. మానవ హక్కుల దగ్గర నుంచి సైబర్‌ సెక్యూరిటీ వరకు వివిధ సమస్యలపై రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో షెర్మన్‌ చైనా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా తన సంస్థాగత సమస్యలకు చైనాను నిందిస్తూ ప్రపంచం ముందు తమను భూతంలా చూపిస్తోందని, ఇది సరైన పద్ధతి కాదని షెర్మన్‌తో చైనా ఉప విదేశాంగ మంత్రి క్జీఫెంగ్‌ అన్నారు. రెండు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా తేడాలను తొలగించుకుంటూ ఉమ్మడి ప్రయోజనాల కోసం అమెరికాతో కలిసి పని చేయాలని చైనా కోరుకుంటోందని తెలిపారు. ప్రపంచ దేశాల మధ్య ప్రాథమికమైన సంఫీుభావం, సహకారం, మానవత్వం అవసరమని అన్నారు. చైనా ప్రజలు శాంతిని కోరుకుంటారని పరస్పర గౌరవం, సమానత్వం, న్యాయం, భాగస్వామ్య భవిష్యత్తుతో కూడిన సమాజంతో నూతన తరహా అంతర్జాతీయ సంబంధాలను చైనా ఆశిస్తోందన్నారు. చట్టబద్ధమైన ప్రతిఘటనలతో విదేశీ జోక్యానికి చైనా స్పందిస్తుందని, చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడటం, న్యాయాన్ని సమర్థించడం చైనా ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. తాజాగా రెండు దేశాల దౌత్యవేత్తలు ఆంటోనీ బ్లింకెన్‌, యాంగ్‌ జిచీల మధ్య జరిగిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ చైనాను అణచివేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఇక్కడ ప్రజల అభిప్రాయమని అన్నారు. ఈ పర్యటనలో షెర్మన్‌ చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హెనాన్‌ ప్రావిన్స్‌లో వరదల తాకిడికి మృతి చెందిన వారికి షెర్మాన్‌ సంతాపం తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img