Friday, September 30, 2022
Friday, September 30, 2022

ప్రజా సమస్యల గొంతుక ‘విశాలాంధ్ర’

70వ వార్షికోత్సవంలో వక్తల వెల్లడి


విశాలాంధ్ర`కడప బ్యూరో : పేద, బడుగు, బలహీన వర్గాలతో పాటు రైతు, కూలీ, కార్మిక, కర్షక, విద్యార్థుల, యువజన సమస్యలపై గత 70 సంవత్సరాల నుంచి ప్రజా గొంతుకగా విశాలాంధ్ర వర్ధిల్లుతోందని సీపీఐ జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య వెల్లడిరచారు. సోమవారం కడప జిల్లా ప్రెస్‌క్లబ్‌లో ‘విశాలాంధ్ర’ 70వ వార్షికోత్సవ సందర్బంగా సమావేశం జిల్లా బ్యూరో పి.రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. వార్షికోత్సవ కార్యక్రమంలో పలువురు వక్తలు పాల్గొని ప్రసంగించారు. ముందుగా ఈశ్వరయ్య మాట్లాడుతూ 70ఏళ్ల నుంచి ఇప్పటి జగన్‌ ప్రభుత్వం వరకు ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూ ప్రజల కష్టసుఖాల్లో ప్రజా సమస్యలలో విశాలాంధ్ర తనదైన ముద్ర వేస్తూ అచంచలమైన ప్రజా విశ్వాసాన్ని చూరగొందన్నారు. దేశవ్యాప్తంగా లక్ష పత్రికలు ప్రభుత్వం దగ్గర నమోదై ఉంటే ప్రస్తుతం 5వేల పత్రికలు వివిధ రూపాల్లో నడుస్తుండగా వాటిలో ‘విశాలాంధ్ర’ మాత్రం ప్రజా గొంతుకగా ముందంజలో ఉందన్నారు. విశాలాంధ్ర సిబ్బంది, విలేకరులు అహర్నిశలు కృషి చేసి పత్రిక ఎదుగుదలకు ఎంతో సహకరిస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత పాలకులు వారికి అనుకూలంగా రాసే పత్రికలకు మాత్రమే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని ప్రజా సమస్యలపై ఎలుగెత్తుతున్న విశాలాంధ్ర లాంటి పత్రికలకు మొండిచేయి చూపిస్తున్నారని ఆర్థికంగా బలహీన పరచడానికి కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు. ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజా అభిమానంతో వివిధ వర్గాల సహకారంతో పత్రిక ముందుకు వెళుతుందన్నారు. పత్రిక అభివృద్ది కోసం సీపీఐ కట్టుబడి ఉందని రాష్ట్రంలో పలుచోట్ల సొంత ఆస్తులు అమ్మి పార్టీ నడుస్తుందన్నారు. రాష్ట్రంలో ఎర్రచందనం, ఇసుక, భూ మాఫియాతో పాటు భూ అక్రమాలకు కొదవ లేకుండా ఉందని విమర్శించారు. విశాలాంధ్రలో ఉద్దండులైన వారంతా ఎంతో మంది ఉన్నారని ఇక్కడి నుంచి వెళ్లిన పీలికలనే వేరే పత్రికలు క్యాష్‌ చేసుకున్నాయే తప్ప విశాలాంధ్రను మించింది లేదన్నారు. పాత్రికేయులు గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు ప్రపంచానికి తెలియజేయాలన్నారు. పాత్రికేయులు క్షేత్రస్థాయిలో సమగ్ర సమాచారాన్ని అందించాలన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను రచించినపుడే పాత్రికేయులను, ప్రజలు గౌరవిస్తారని పత్రికను ఆదరిస్తారని అన్నారు. ప్రతిక్షణం ప్రజాహితంగా విశాలాంధ్ర పత్రిక పనిచేస్తుందని, జర్నలిజానికి మొదటి మార్గదర్శక పత్రిక అన్నారు. రాజకీయ, సామాజిక సాంస్కృతిక చైతన్యానికి, ప్రజా కథలను విశాలాంధ్ర ఆవిష్కరిస్తూ చేరువలోనే ఉంటుందని అన్నారు.
మరో ముఖ్య అతిథి ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ అజయ్‌బాబు మాట్లాడుతూ 1952లో చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, ముత్తుకూరి చంద్ర వంటి ముగ్గురు ఉద్దండులు ప్రజా సమస్యల వేదికగా పత్రికలు ప్రారంభించారని 70ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు. ప్రస్తుత పాలకులు ప్రింటింగ్‌కు సంబందించిన ధరలను విపరీతంగా పెంచాయని వ్యతిరేక వార్తలు రాసే పత్రికలను అంతమొందించాలనుకుంటున్నారు కానీ విశాలాంధ్రను మాత్రం ఏమీ చేయలేరన్నారు. కరోనా కాలంలో 5వేల పత్రికల వరకు ఉనికిని చాటుకుంటున్నాయని దాంట్లో విశాలాంధ్ర ముందంజలో ఉందన్నారు. విశాలాంధ్ర అభివృద్ది కోసం సంవత్సరానికి 1.20 కోట్ల నుంచి ఆర్థిక భారం తగ్గించుకునే దాంట్లో సంవత్సరానికి 50లక్షల వరకు ఖర్చవుతుందన్నారు. విశాలాంధ్ర పత్రికతో పాటు యూట్యూబ్‌ ఛానెల్‌, డిజిటలైజేషన్‌ చేసి పత్రికకు జవసత్వాలు సమకూర్చుతున్నామన్నారు. గతంలో అంజయ్య ప్రభుత్వాన్ని గడగడలాడిరచిన పత్రికకు ఎంతో ప్రశంసలు పొందడం జరిగిందని ఇప్పటికీ ఆ పరంపర కొనసాగుతుందన్నారు. పత్రిక అభివృద్దికి సింహభాగం ఆదాయం కడప జిల్లా నుంచి వస్తుందని కడప బ్యూరోను, పాత్రికేయులను ఈ సందర్బంగా ఆయన అభినందించారు.పేద బడుగు బలహీనవర్గాలు, రైతు, కార్మికుల సమస్యలు వంటి అనేక సమస్యలను నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు వెలికితీసి పత్రిక ముందుకు వెళుతుందని ఎంతోమంది విశాలాంధ్ర కోసం ఎదురుచూసే పరిస్థితి ఈనాటికీ ఉందంటే విశాలాంధ్ర గొప్పతనం ఏపాటిదో అర్థమవుతుందన్నారు.
విశాలాంధ్ర జిల్లా ఇన్‌ఛార్జి కృష్ణమూర్తి మాట్లాడుతూ జిల్లాలో 1939 నుంచి మోకా వెంకటసుబ్బయ్య, సంగమేశ్వరరావు లాంటి నాయకులు ప్రజా సమస్యల పైన అవిరళ కృషి చేశారని పోరాటంలో కీలక పాత్ర పోషించిన వారు అనేకమంది ఉన్నారన్నారు. ప్రజలకు సంబందించిన అనేక సమస్యలపై ప్రశ్నలకు జవాబులు వెతికే పనిలోనే ఉండాల్సిన అవసరం జర్నలిస్టులకు ఉందన్నారు. ప్రజలను సమస్యలపై పోరాటం చేసే విధంగా జర్నలిస్టులు తమ విధులు నిర్వహించాలన్నారు. జిల్లాలో పారిశ్రామిక రంగంపైన విద్య, ఉపాధి, రంగాలపైన ప్రజలను ఆలోచింపచేసేలా పత్రికను ముందుకు తీసుకెళ్లాలన్నారు.
ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో తిరుపతి బ్రాంచి మేనేజర్‌ సుబ్బరాయుడు, సీపీఐ నగర కార్యదర్శి ఎన్‌.వెంకటశివ, జిల్లా కార్యవర్గ సభ్యులు నాగసుబ్బారెడ్డి, సుబ్రమణ్యం, చంద్రశేఖర్‌, ఏఐటీయూసీ నాయకులు బాదుల్లా, మద్దిలేటి, సీపీఐ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, పాల్గొని విజయవంతం చేశారు. అనంతరం ముఖ్యులకు సత్కార కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img