Friday, April 26, 2024
Friday, April 26, 2024

విషజ్వరాల వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలి

అధికారులు సమన్వయంతో పనిచేయండి
రక్తనమునాల సేకరణ, పరీక్షల సంఖ్య పెంచాలి
కలెక్టర్‌ జె.నివాస్‌


వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని విషజ్వరాలు ప్రబలకుండా వైద్య, ఆరోగ్య శాఖ, మున్సిపల్‌ అధికారులు సమన్వయంతో పనిచేసి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ జె.నివాస్‌ ఆదేశించారు. మలేరియా, డెంగీ వంటి సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చేపట్టాల్సిన చర్యలపై శనివారం జిల్లా కలెక్టర్‌ తన క్యాంప్‌ కార్యాలయంలో శనివారం సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రానున్న రెండు నెలలపాటు వైద్య, ఆరోగ్య శాఖ, మున్సిపల్‌, పంచాయతీ అధికారులు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా విషజ్వరాలు వ్యాప్తికి కారణమయ్యే దోమల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టి యాంటి లార్వా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. మలేరియా, డెంగీ, చికెన్‌ గున్యా వంటి వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు రక్తనమునాల సేకరణను మరింత పెంచి పరీక్షలు నిర్వహించి ప్రతి రోజు నివేదికలను అందజేయాలని ఆదేశించారు. యాంటీలార్వా కార్యక్రమాలను చేపట్టడంతోపాటు ప్రతి రోజు దోమల నివారణకు స్ప్రెయింగ్‌, ఫాగింగ్‌ కార్యక్రమాలను ముమ్మరం చేయాలన్నారు. వారానికి ఒక రోజు డ్రై డేగా పాటించాలన్నారు. దోమల నియంత్రణకు అవసరమైన ఆయిల్‌బాల్స్‌, ఇతర మందులు, సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. పీపీటీ సర్వేను సమర్థంగా నిర్వహించాలన్నారు. జిల్లాలో మలేరియా, డెంగీ వంటి సీజనల్‌ వ్యాధులతో ఒక మరణం కూడా సంభవించకూడదన్నారు. దానికి అనుగుణంగా అధికారులు పటిష్టమైన కార్యచరణ చేపట్టాలన్నారు. జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్న వారిని గుర్తించి రక్తనమునాలను సేకరించి పరీక్షలను నిర్వహించాలన్నారు. మలేరియా, డెంగీ వంటి లక్షణాలు ఉన్న వారికి వైద్య సహాయం అందించాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) ఎల్‌.శివశంకర్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎం.సుహాసిని, జెడ్పీ సీఈవో సూర్యప్రకాష్‌, మెప్మా పీడీ ప్రకాశరావు, సీఎంహెచ్‌వో డాక్టర్‌ జి.గీతాబాయి, మున్సిపల్‌ అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
నిర్ధిష్ట కాల వ్యవధిలో సేవలు అందించాలి : కలెక్టర్‌
ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ ద్వారా సేవలందించే విషయంలో చురుకుగా వ్యవహరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ జె.నివాస్‌ ఆదేశించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌పై నోడల్‌ అధికారులకు సామర్థ్య పెంపుపై శనివారం స్థానిక కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో వర్క్‌షాప్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ మండలి, ఫ్యాక్టరీస్‌, మున్సిపాలిటీ, పర్యాటక, జీఎస్‌టీ, రిజిస్ట్రేషన్‌ శాఖ, కార్మిక శాఖ, బాయిలర్లు, పరిశ్రమలు తదితర శాఖల అధికారులు ఈ విషయంలో ప్రధానంగా భాగస్వామ్యులు కావాలన్నారు. కార్యాలయానికి రాకుండానే అన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయడం, సంబంధిత పత్రాలను పొందడంపై అవగాహన కల్పించాలని చెప్పారు. రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువ పరిశ్రమలు ఉన్నాయని, వినియోగదారులను సంతృప్తిపరిచే విధంగా సేవలందించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా) కె.మోహన్‌కుమార్‌, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ సుధాకర్‌, ఏపీఎస్‌ఐసీ జోనల్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు, కార్మిక శాఖ డెప్యూటీ కమిషనర్‌ సీహెచ్‌ ఆషారాణి, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ బాయిలర్స్‌ జె.శ్రీనివాస్‌రావు, డెప్యూటి కంట్రోలర్‌ ఎ.కృష్ణచైతన్య, సీఎంహెచ్‌వో డాక్టర్‌ జి.గీతాబాయి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img