Saturday, October 1, 2022
Saturday, October 1, 2022

సమాజ పోకడలకు అద్దం పట్టిన నాటకాలు

‘కాదేదీ అమ్మకానికి అనర్హం.. కాదేదీ వినిమయానికి అనర్హం’ అన్న నినాదాన్ని బడా కార్పొరేట్‌ సంస్థలు విచ్చలవిడిగా ప్రవేశ పెడుతూ అదే నాగరికతగా జనాన్ని నమ్మిస్తున్నాయి. ప్రభుత్వాలు వాటికి కొమ్ముకాస్తూ మానవత్వాన్ని నిలువులోతు గోతిలో పాతిపెడుతున్నాయి. అచ్చంగా ఈ ఇతివృత్తంతోనే సింహప్రసాద్‌ గారు ‘దాడి’ నాటకం రాశారు. గతంలో తానే రాసిన ఒక కథను ఇలా ప్రదర్శనకు వీలుగా మలిచారు రచయిత.
ఎటు చూసినా హింస, చిత్రహింస, దౌర్జన్యం, హత్యలూ, ప్రతీకారాలతో సతమతమవుతున్న సమాజంలో ఈ క్రీడలు కార్యక్రమాలు కూడా వాటికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. నేడు పిల్లలు పెద్దలూ అతిగా ఇష్టపడే వీడియో గేములు, ఆన్‌ లైన్‌ గేములు మనకు ప్రబోధించేది ఏమిటి .. హింస కాదూ? ఆసాంతం దొంగలవేటలతో, తుపాకీ కాల్పులతో, దద్దరిల్లడంరక్తపు మడుగులతో తెరంతా ఎర్రబడి పోవడం మనకు ఏమి నేర్పుతున్నాయి? వెబ్‌ సిరీసులు బూతులు, అసభ్య సన్నివేశాలతో పాటూ భయంకరమైన హింసాత్మక దృశ్యాలతో సాగడం ఎలాంటి సమాజంవైపు మనల్ని, ముఖ్యంగా నవయువతను నడిపిస్తున్నాయి?
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తీవ్రమైన ఆవేదనతో రచయిత ‘దాడి’ నాటకాన్ని రాశారని చెప్పవచ్చు. ఒక యువకుడు మన కళ్ళ ఎదుటే ఉరి తీసుకుంటాడు.. దాన్ని మీరు లైవ్‌లో చూడవచ్చు.. ప్రాణాలు పోయేముందు అతని దైహిక స్థితి, మానసిక స్థితి ఎలా ఉంటుందో మనం చూసి ఎంజాయ్‌ చేయవచ్చు. ముఖకవళికలు ఎలా మారిపోతుంటాయో క్లోజ్‌ అప్‌లో చూడ వచ్చు.. ఇలాంటి అపురూపమైన, అరుదైన అనుభూతిని మనకు అందివ్వడానికి ‘ది గ్రేట్‌ సాంప్సన్‌ అండ్‌ సాంప్సన్‌’ కంపెనీ ముందుకు వచ్చింది. ఫలానా ఫలానా కంపెనీలు దీన్ని సమర్పిస్తున్నాయి అని ఊదరకొట్టి ప్రచారాలు చేసి ఒక్కో టిక్కెట్‌ పదివేలకు అమ్ముతారు. జనం వేలం వెర్రిగా ఎగబడతారు. ఆ బలిపశువుఎవరంటే ఆనంద్‌ అనే నిరుద్యోగ పేద యువకుడు. అతను చని పోయాక అతని కుటుంబానికి యాభై లక్షల క్యాష్‌ ప్రైజ్‌ ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుంది కార్పొరేట్‌ కంపెనీ. తను పోయినా కుటుంబానికి యాభై లక్షలు లభిస్తుందని అందుకు అంగీకరిస్తాడు ఆనంద్‌ అదీఇంట్లో వారికి తెలియకుండా.
ఒకటి రెండు గొంతులు తప్ప ఇది అన్యాయమనీ, మనిషికి డబ్బు ఆశ చూపి బహిరంగంగా ఉరి తీసుకునేందుకు వీలు కల్పించరాదనీ ఎవ్వరూ అనరు. ఉరి తీసేటప్పుడు అతని కళ్ళు ఎలా వెలికి వస్తాయో? అతని దేహం ఉరికొయ్యకు వేలాడుతూ ఎలా గిలగిలా కొట్టుకుంటుందో చూడాలని తహతహ లాడుతుంటారు. మధ్యలో కమర్షియల్‌ బ్రేకులు.. పిడికెడంత మనిషి గుండెలో ఎంతటి హింసా ప్రియత్వం దాగుందో వారి చేష్టలు తెలియ చేస్తుంటాయి. ఈ గొప్ప కార్యక్రమాన్ని లైవ్లో లక్షలాదిమంది ప్రజలు టీవీల ముందు కూర్చుని చూస్తుంటారు. కార్యక్రమం ఆలస్యం అవుతుంటే అసహనం ప్రదర్శిస్తుంటారు.. ఆనంద్‌ తను ఆవేశంలో దీనికి ఒప్పుకున్నాననీ వదిలేస్తే వెళ్లిపోతానని కావాలంటే ఆ యాభై లక్షల సొమ్ము తనే కంపెనీకి చెల్లిస్తాననీ మొత్తుకున్నా సదరు కార్పొరేట్‌ కంపెనీ ఒప్పుకోదు. అర్ధాంతరంగా కార్యక్రమం ఆపేస్తే మా రెప్యుటేషన్‌ దెబ్బ తింటుంది.. నువ్వు చచ్చి తీరాల్సిందే అని అంటుంది. ప్రేక్షకులూ అదే మాట.. ఈ తీరున సెటైరికల్‌గా ఓ రియాలిటీ షోని మన ముందు ప్రదర్శించి మనలో ఆలోచన కలిగిస్తారు రచయిత సింహప్రసాద్‌. ఎన్నో వందల కథలు, అరవై దాకా నవలలు రాసిన ఆయనకు ఇదే తొలి నాటకం అంటే నమ్మబుద్ధి కాదు. నాటక రచనలో, సంభాషణల్లో ఎంతో పరిణతి కనబడుతుంది.
దేవయాని : కేవలం సాంఘిక నాటక రచనలోనే కాక మలి ప్రయత్నం లోనే ‘దేవయాని’ పౌరాణిక నాటకాన్ని కూడా అంతే దక్షతతో రాసి పఠితలను, ప్రేక్షకులనూ మెప్పించారు సింహ ప్రసాద్‌. పౌరాణికం అంటే వెంటనే మార్చా ల్సింది భాష. అదీ పాత్రోచిత భాష కావాలి. అన్ని పాత్రలకు ఒకే రకం భాష శోభ నివ్వదు. గంభీరంగా ఉండాలి. అవసరమైన చోట సంభాషణలు సంస్కృత సమాస పద భూయిష్టమై ఉంటేనే మెప్పు పొందుతుంది. ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నారు రచయిత. దేవయాని కథ పాతది, అందరికీ తెలిసిందే అయినా కొత్తపద్ధతిలో చెప్పి దేవయాని, శర్మిష్ఠల పాత్రల్ని అంత ఎత్తున నిలబెట్టారు సింహ ప్రసాద్‌. స్త్రీ ప్రేమమూర్తి, అమృతమయి అని నిరూపించారు. అందరూ అనుకునేలా వృషపర్వుడి కూతురు శర్మిష్ఠ – శుక్రాచార్యుల తనయ దేవయాని పొగరుబోతులు కాదనీ, కీచులాడుకునే బాపతు అంతకన్నా కాదనీ వారు మంచి స్నేహితురాళ్ళని తెలియచెప్పారు. ‘’విద్య అర్థిస్తూ వచ్చిన వాడి కులం, గోత్రం, జాతి, మతం, ఆర్థిక స్థితిగతులు గురువుకు అవసరం లేదు అతడి అభిమతం, జ్ఞానతృష్ణ విద్యాదాహం మాత్రమే గీటురాళ్ళు’’ అని శుక్రా చార్యుడితో అనిపిస్తారు. కచుడు దేవయానిని ప్రేమలో పడేసి, గురువులను మాయచేసి మృతసంజీవనీ విద్య నేర్చుకుని వెళ్ళబోయే ముందు అతడు ఎవరో ఎంతటి కపటో తెలుస్తుంది. అప్పుడు కూడా దేవయాని హుందాగా ప్రవర్తిస్తుంది. కచుడి దుర్మార్గం అందరికీ తెలియచెప్పి అతనికి మంత్రం ఫలించదని శపిస్తుంది. ఏమైనా గురువుల పాత్రల్ని ఉన్నతంగా, స్త్రీ పాత్రల్ని సమున్నతంగా చిత్రించి సింహ ప్రసాద్‌ సమకాలీన సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చారు. స్త్రీ ద్రోహం, గురుద్రోహం ఎప్పటికీ క్షంతవ్యం కానివని బలమైన సందేశం ఇచ్చారు. పౌరాణిక కథలోనూ ఆధునిక స్త్రీ భావజాలాన్ని, పోకడలను చూపారే తప్ప ఎక్కడా ఆ పాత్రలను బేలలుగా, అసహాయులుగా చిత్రీకరించలేదు. నాటికలు రెండూ ఆసాంతం కుతూహలంగా చదివిస్తాయి.
(దాడి, దేవయాని (నాటకాలు) – సింహ ప్రసాద్‌, పేజీలు 156,
వెల : రూ. 80/- ప్రతులకు: శ్రీశ్రీ ప్రచురణలు, కేపీహెచ్‌బీ, హైదరాబాద్‌, ఫోన్‌ : 98490 61668, మరియు అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలలో)

చంద్ర ప్రతాప్‌, 80081 43507

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img