Friday, April 26, 2024
Friday, April 26, 2024

పాఠకుల ఆర్తిని తీర్చే ‘రాతి గుండెలో నీళ్లు’

కథ అంటే ఏమిటి అనేదానికి సార్వత్రిక నిర్వచనాలున్నా, అది ఎలా పుడుతుందనే దానికి స్పష్టమైన కారణాలు చెప్పలేం. రచయిత తను విన్నవి, కన్నవి, చదివినవి, తన అనుభవంలోకొచ్చిన అనేక సంఘటనల్లో మనసుకు నచ్చిన వాటిని ఎంచుకుని వాటికి సంభాషణలు పేర్చి సృజనాత్మకతతో రూపుకడతాడు. అతను ఎదుగుతున్న కొద్దీ అతని చూపు విశాలమవుతుంది. దృక్పథం మారుతుంది. శైలి, శిల్పం కొత్త సొబగులు అద్దుకుంటాయి. రాయగా.. రాయగా.. ప్రతి రచయితకీ తన సొంత గొంతు ఏర్పడుతుంది.
30 ఏళ్లవయసు.. 50 కథల అనుభవం ఉన్న దొండపాటి కృష్ణ మూసలో కొట్టుకుపోకుండా తనదైన ప్రత్యేకత చూపటానికి గుంజాటన పడుతున్నారు. సమకాలీన పత్రికలన్నింటిలోనూ ఆయన కథలు వస్తూంటాయి. కొన్ని కథలకు దక్కిన బహుమతులు ఈ యువరచయిత ప్రతిభకు తార్కాణాలు. ఇటీవల ఆయన వెలువరించిన ‘రాతి గుండెలో నీళ్లు’ కథా సంకలనం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇందులో 16 కథలున్నాయి. ఇతివృత్తం పరంగా వాటిల్లో వైవిధ్యం కనిపిస్తుంది. రచయిత ‘చూపు’ మనకు అర్థమవుతుంది.
‘కారు ఆగింది. అది సూర్యం హోదాను మోసుకొచ్చింది’ ఇదీ ‘వెలుగు సూర్యుడు’ కథకు ప్రారంభ వాక్యం. ఓ అధికారి కారులో దిగగానే అందరు విస్తుపోయి చూడటం సాధారణమే. కానీ ఈ అధికారి అందరిలాంటివాడు కాడు. ఒకప్పుడు చెత్తకుప్పలో విసిరివేయబడ్డ పసిబిడ్డ. అతన్ని యాదయ్య అనే బిచ్చగాడు చేరదీస్తాడు. కొన్నాళ్ల తర్వాత ఆ పిల్లాడు అడితీలో పనికి చేరతాడు. చదువుకోవాలన్న అతని ఆకాంక్షకు నీరుపోసి పెంచి పోషిస్తాడు ఆ అడితీ యజమాని. దాంతో అతను బాగా చదువుకుని సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసరుగా ఎదుగుతాడు. అంతే కాదు, తనను ఇంత వాడిని చేసినందుకు అతను అదే ఊరిలో అనాధ వసతి గృహం నిర్మాణానికి సిద్ధమవుతూ కృతజ్ఞత చూపటానికి సిద్ధమవుతాడు. ఫ్లాష్‌బ్యాక్‌ పద్ధతిలో సాగిన ఈ కథలో మెరుపులాంటి వాక్యాలు కనిపిస్తాయి. ‘‘జ్ఞానానికి, దీపానికి ప్రత్యేక గుర్తింపు అవసరం లేదు. అవి పాతాళంలో ఉన్నా దశదిశలకూ తమ కాంతులను ప్రసరింపచేస్తూ ఉంటాయి. అందుకే ‘విద్య’ అనే దీపం వెలిగించుకోవాలి/గమ్యమెరుగని అతని నావకు దారి చూపిన దార్శనికుడు. గతి తప్పిన అతని జీవితాన్ని శృతి చేసిన మహానుభావుడు/గొంగళి పురుగులా అక్కడే పడి కొట్టుమిట్టాడుతున్న అతని జీవితం సీతాకోకచిలుకలా ఎలా రంగుల మయంగా మారిందో గుర్తుకొచ్చింది. ప్రధాన పాత్రకు ‘సూర్యం’ అన్న పేరు ఉంచటంలోనే రచయిత ఉద్దేశ్యం బోధపడుతుంది.
ఇటీవల మగపిల్లలు పెళ్లి చేసుకోవటానికి వెనకాముందు ఆడుతున్నారు. ఉన్న సంపాదనతో ఇల్లు నెట్టుకురావటం కష్టమనే భయం వారిని వెనక్కిలాగుతోంది. ‘ఊహల రెక్కలతో ఎగరనీయ్‌’ కథలో ఇదే అంశంపై చర్చకు పెట్టారు. జీవితంలో సర్దుబాటు ఎంత అవసరమో చెప్పారు. నిరంతరం సోషల్‌ మీడియాలో మునిగిపోతున్న ఇల్లాళ్లకు భిన్నంగా, ఇంట్లో ఉన్నంతసేపు కుటుంబసభ్యులకు మాత్రమే వెచ్చించే ‘ఇందిర’ అన్న పాత్ర సృష్టించారు. ‘‘ఆఫీసు నుంచి ఇంటికొచ్చాక బంధువులతో కూడా ఫోన్‌ మాట్లాడదు. ఎంజాయ్‌ చేయటం అంటే మనుషులతో ప్రేమతో మెలగాలి. వస్తువులతో కాదు. వీలునుబట్టి వాళ్లను కలవచ్చు. మీరు, పాప నాకున్నారు. మీ సమయాల్ని నాకు కేటాయిస్తే చాలు’ అంటుంది. ఈ కథలో పెళ్లి విశిష్టత గురించి రచయిత చర్చించారు. ‘‘మనుషులకు స్థూల, సూక్ష్మ, కారణ అనే మూడు శరీరాలుంటాయి. పెళ్లి సమయంలో వేసే ఒక్కో ముడి ఒక్కో శరీరానికి వేసేది. ఒక్క బాహ్యశరీరంతోనే కాదు. మొత్తం మూడు శరీరాలతో మమేకం కావటం అనే అర్థంలో మూడుముళ్లు వేస్తారు. ఈ మూడుముళ్లకు ‘అనురాగపు ముడి’ని జత చేసి లైఫ్‌ జర్నీ చేయాలి. అది మనం చూపించే ప్రేమను బట్టి ఉంటుంది. క్వాలిఫికేషన్‌ బట్టి కాకుండా క్యారక్టర్‌ ను బట్టి వివాహాలు విజయవంతమవుతాయి’’అని చెప్పుకొచ్చారు.
మరో కథ ‘ఇది కదా సంతోషం’ లోనూ వివాహ ఔన్నత్యం గురించి చర్చ కనిపిస్తుంది. మనవడి వివాహవేడుకలను కళ్లారా చూసుకుని సంతసించిన తాతయ్య ఇందులో కనిపిస్తాడు. అణకువతో, నేర్పుతో సంసారాన్ని తీర్చిదిద్దిన తన భార్యను అలక్ష్యం చేశానన్న చింత ఆయనను వెంటాడుతూంటుంది. ‘‘నీరు ఎంత అమూల్యమైనదో, బావి ఎండిపోయే వరకూ మనకు తెలియదు. భార్య తోడుగా ఉన్నంతకాలం ఆమెను గ్రహించలేకపోయాను’’ అన్న ఆవేదనకు లోనవుతాడు. ‘‘భార్యలేని మగవాడి జీవితం అసంపూర్ణం. ఆమెతో గడిపిన క్షణాలే నీ జీవితం లో అమూల్యం’’ అని మనవడికి భార్య గొప్పతనాన్ని వివరించటంతో కథ ముగుస్తుంది.
‘యాచకురాలు’ కథలో బిచ్చగాళ్ల పట్ల సహానుభూతి కనిపిస్తుంది. ‘‘నీకు సాధ్యమైతే బిచ్చమెయ్యి. అంతే కానీ నోటికొచ్చినట్టు మాట్లాడి వాళ్లను చులకన చేయొద్దు’’ అన్న హితవు, ‘‘ఎదుటివారిని ఆదుకున్నప్పుడు, క్షమించినప్పుడు మన మొహంలో దైవత్వం కనిపిస్తుంది’’ అనే సందేశం ఇందులో మనం చూడొచ్చు.
సమాజం చిన్న చూపు చూసే యాచకులను ప్రయోజకులుగా, బాధ్యతగల కాంట్రాక్టు ఉద్యోగులుగా మలచిన మున్సిపల్‌ ఉద్యోగి ఉదంతం ‘‘మళ్లీ చిగురించారు’’ కథలో కనిపిస్తుంది.
మనిషికి పరిసరాలతోనూ, ప్రకృతితోనూ ఉండే అనుబంధం గాఢమైనది, బలీయమైనది. ‘‘స్వర్గసీమ’’, ‘‘ రాముడు -భీముడు’’ కథలు ఈ విషయాన్ని బలంగా చాటుతాయి. తన ఇల్లు, పెరడులో పెంచుకున్న మొక్కలతో అవ్యక్తమైన అనుబంధాన్ని పెంచుకున్న అర్చన భర్త ఇల్లు అమ్మి సొంత ఊరికి వెళ్లిపోదామని చెప్పినప్పుడు తల్లడిల్లుతుంది. ‘‘స్వర్గమంటే అదెక్కడో ఉండదు. నిర్మలమైన మనస్సుతో, మనకున్న సౌకర్యాలతో సంతృప్తిగా బతికే జీవితమే స్వర్గం. ఇల్లే స్వర్గసీమ’’ అన్న స్పృహతో చివరికి భర్త తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. ఇక ‘రాముడు-భీముడు కథలో, పదిమంది పిల్లలున్నా నిరాదరణకు గురైన రాముడు, భీముడు (వేపచెట్టు)నీడలో సేదతీరుతూంటాడు. అతను కన్నుమూసినప్పుడు ఆ కట్టలే అతనికి ఆధారమవుతాయి.
ఒక సామాజిక సమస్యపైన సామాజిక మాధ్యమాల్లో మద్దతు కూడగట్టటానికి సిద్ధమైన యువకుని ఉదంతం ‘మైత్రీవనం’లోనూ, ప్రేమ ఉచ్చులో పడిపోకుండా, బాగా చదువుకుని బాధ్యతగా మెలగాలన్న సూచన ‘చైతన్యకిరణం’లోనూ కనిపిస్తుంది. ఆగంతకుల దాడి నుంచి నేర్పుగా బయటపడిన యువతి కథ ‘గుంట నక్కలు’’.
ఈ సంకలనంలో రెండు కథలను ప్రస్తావించకపోతే, ఈ సమీక్ష అసంపూర్ణమవుతుంది. ‘రాతిగుండెలో నీళ్లు, ‘ఉరేసుకున్న మౌనం’ అన్న ఈ రెండు కథలు రచయితకు బహుమతులు తెచ్చిపెట్టాయి. డ్వాక్రా సభ్యులు అకస్మాత్తుగా చనిపోతే, వారికి ఆర్థిక సాయం అందించే బాధ్యతలో ఉన్న రంజని అనే ఉద్యోగినికి చిత్రమైన అనుభవం. అది ఆమెలో మార్పుకు ఎలా కారణమయ్యిందో తెలియచెప్పే కథ ‘‘రాతి గుండెలో నీళ్లు’’. ఇందులో హిజ్రాల జీవితంలో సాధకబాధకాలను, కుటుంబ సభ్యుల నిరాదరణను హృదయవిదారకంగా చెప్పుకొచ్చారు రచయిత.
ఇక ఉరేసుకున్న మౌనం కథలో భర్త చేసే అవమానాలను భరించలేక జ్యోతి ఆత్మహత్యకు సిద్ధపడుతుంది. ఆఖరునిముషంలో అంతరాత్మ ప్రబోధంతో వెనక్కి మళ్లుతుంది. భర్త పశ్చాత్తాపానికి లోనవుతాడు. ఇలా ప్రతి కథలోనూ దొండపాటి తనదైన విశిష్టతను చూపారు. కథల పట్ల ఆసక్తిగల వారు తప్పనిసరిగా చదవవలసిన సంకలనమిది.
డాక్టర్‌ పార్థసారథి చిరువోలు, 99088 92065

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img