Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

భారత్‌-రష్యా సాంస్కృతిక సేతువు
కామ్రేడ్‌ కేశవగోపాల్‌

అతని పేరులోనే ఓ విచిత్రముంది. అసలు పేరు చెన్నకేశవ. అతని మిత్రుని పేరు గోపాల్‌. కలిపి తన పేరు కేశవగోపాల్‌గా మార్చుకున్నాడు. కానీ రష్యాలో అతనిని అందరూ ‘చెన్నా’ అని పిలిచేవారు ముద్దుగా. రష్యాలో దాదాపు ఏడు సంవత్సరాల పాటు దుబాసీగా పనిచేసిన కేశవగోపాల్‌ని గురించి ఆసక్తికరమైన అంశాలు చాలానే ఉన్నాయి. సోవియట్‌ యూనియన్‌ కమ్యూనిస్టు పార్టీ 20 వ మహాసభలో బ్రేరెa్నవ్‌ చేసిన ప్రసంగాన్ని తెలుగులోకి అనువాదం చేసిన ఘనత కేశవగోపాల్‌ది.
మాస్కోలో ఉండగా అక్కడి సమాజ విజ్ఞానశాస్త్ర సంస్థలో విద్యార్థిగా చేరి లెనిన్‌ భాషా శైలిపై ఓ సిద్ధాంత వ్యాసం రష్యన్‌ భాషలో సమర్పించాడు కేశవగోపాల్‌. రష్యన్‌ భాషలో ఆయన స్నాతకోత్తర డిప్లొమా పొందాడు. అంతేకాదు, అతనికి బాంగ్లా, జర్మన్‌, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషలు తెలుసు. బాంగ్లా, కన్నడ సినిమాల పట్ల ఆయనకు అమితమైన ఆసక్తి. మరి అతని అభిరుచులు కూడా అమితమే. డ్రాయింగ్‌, పెయింటింగ్‌, నాటకరచన, దర్శకత్వం, కవితలు, కథలు రాయడం, సినీ విమర్శ ఫోటోగ్రఫీ, అనువాదం, చదరంగం, సంగీతం, సినిమాలకు మాటలు రాయడం, వీడియోగ్రఫి, మేకప్‌, జర్నలిజం, ప్రెస్‌లో పనిచేయడం లాంటి అనేక అభిరుచులు అతనివి. అతని కథ ‘తూలిక’ రష్యను భాషలో అచ్చయింది. రష్యాలో అధ్యాపకులు, విద్యార్థుల మధ్య సంబంధాల్ని గురించి తెలియజేస్తూ, అక్కడ తాను విద్యార్థిగా ఉన్న ఓ క్లాసులో ఓ రష్యన్‌ ప్రొఫెసర్‌ ఓ విషయమై నాకు క్షమాపణ చెప్పింది అని అక్కడి విద్యా వ్యవస్థను ప్రశంసిస్తాడు కేశవగోపాల్‌. లెనిన్‌గ్రాద్‌ (గ్రాద్‌ అంటే రష్యనులో నగరం అని అర్థం) (గ్రాడ్‌ అనడం తప్పు. రష్యను భాషలో ట, డలు లేవు.) కు చెందిన తెలుగు ప్రొఫెసర్‌ మూరి గూరొన్‌తో కేశవగోపాల్‌కి పరిచయం ఉండేది. ఇక కేశవగోపాల్‌ వ్యక్తిగత విషయానికి వస్తే, అతను అప్పటి కడపజిల్లా రాయచోటిలో 1941 లో జన్మించాడు. నాన్న రామయ్య, అమ్మ పేరు సుబ్బమ్మ. వ్యవసాయం చేసి బతికేవారు. సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలో నెగ్గి 1959`75 మధ్య ట్రెజరీ ఆఫీసులో అకౌంట్స్‌ చూసే ఉద్యోగిగా పని చేశాడు కేశవగోపాల్‌.
రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ముక్కవాసన వచ్చే రేషన్‌ బియ్యం తినలేక కష్టపడేవారు కేశవగోపాల్‌ కుటుంబీకులు. అమ్మ పొలం కాడికి పోయి ‘నిమ్మటాయ’ దుంప గడ్డలు తెచ్చి కొడుక్కి తినిపించేది. కేశవగోపాల్‌ వివాహం చేసుకోలేదు. భారత కమ్యూనిస్టు పార్టీలో అతను కార్డు కలిగిన సభ్యునిగా కొన్నేళ్లపాటు ఉన్నాడు. 1975 లో రష్యా వెళ్లిన అతను 1982 లో తిరిగి వచ్చాడు. తిరిగివచ్చిన తరువాత చెన్నై నుంచి వెలువడే ‘సోవియట్‌ భూమి’ తెలుగు పత్రిక కోసం ఆ పత్రిక నిలిచిపోయేంతవరకు రచయితగా, అనువాదకునిగా పనిచేశాడు. 1982 లో కేశవగోపాల్‌కు ఓ ప్రమాదం జరిగింది. ఓ స్కూటర్‌లో వెనుక కూర్చున్న ఇతని కాలు ఒక మలుపు వద్ద చక్రంలోకి దిగడంతో కుడికాలికి పెద్ద దెబ్బ తగిలింది. ప్రస్తుతం తెలుగు ద్వారా రష్యన్‌ భాష నేర్చుకునేందుకు వీలుగా ఓ పుస్తకం రాస్తున్నాడు కేశవగోపాల్‌. ఐక్యరాజ్యసమితిలో ఒక అధికార భాష అయిన రష్యన్‌ భాష బాగా తెలిసిన కేశవగోపాల్‌ లాంటి వాళ్లను మనం ప్రోత్సహించాలి. ఇంగ్లీషు ఆధిక్యాన్ని తగ్గించే దిశగా దేశంలో చర్యలుండాలి. దాన్ని ఐచ్ఛికం చేయాలి. వలసవాదుల భాష అయిన ఆంగ్ల పెత్తనం మనం సహించరాదు. ఇతర ప్రపంచ భాషల్ని మన విద్యాలయాల్లో ఐచ్ఛికంగా బోధించాలి. ఇదే కేశవగోపాల్‌ ఆశయం. విఎత్‌నామ్‌లో వలసవాదులైన ఫ్రెంచ్‌ వాళ్ల భాష బోధనా భాష కాదు.
ప్రస్తుతం సహచరుడు కేశవగోపాల్‌ రాయచోటిలోని తన సోదరుని కూతురు ఇంట్లో ఉంటున్నాడు. మాస్కోలో ‘చెన్నా’ గా గడిపిన జీవితాన్ని నెమరువేసుకుంటూ రెండు దేశాల మధ్య సాంస్కృతిక సేతువై నిలుస్తూ…
డా॥ తక్కోలు మాచిరెడ్డి, సెల్‌: 9666626546

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img