Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

మానవ వికాస శోధనే ‘పురాతన సమాజం’

డార్విన్‌ జీవపరిణామ సిద్ధాంతం, మతం అమాయకంగా అల్లుకున్న కల్పిత గాధల మానవజన్మ రహస్యాల్ని, సాధికారికంగా త్రోసిరాజంది. అదే సమయంలో లూయీ హెన్రీ మోర్గన్‌ రాసిన ‘పురాతన సమాజం’ సమాజ సామాజిక నిర్మితి ఎలా జరిగిందో వివరించే ప్రయత్నం చేసింది. ఈ అమెరికన్‌ యాంత్రోపాలజిస్టు జీవిత సగ భాగం వెచ్చించి రాసిన ఈ గ్రంధం 1877లోకి అందుబాటులోకి వచ్చింది. 1891లో దీనికి ముందుమాట రాస్తూ ఎంగెల్స్‌, డార్విన్‌ ‘జీవ పరిణామ సిద్ధాంతమూ’, మార్క్స్‌ ‘అదనపు విలువ సిద్ధాంతమూ’ యెంత విలువైనవో పితృస్వామ్యవ్యవస్థకు ముందు, మాతృస్వామ్య గణాల ఉనికి విషయమై మోర్గన్‌ పరిశోధనలు అంత విలువైనవిగా పేర్కొన్నాడు. అంతేకాకుండా, మోర్గన్‌ పుస్తకంపై మార్క్స్‌ రాసుకొన్న రాత ప్రతుల్ని, మార్క్స్‌ మరణం తర్వాత, 1884లో ‘‘కుటుంబమూ, వ్యక్తిగత ఆస్తీ, రాజ్యమూ పుట్టుక’’ అనే గ్రంధంగా వెలుగులోకి తెచ్చే సందర్భంలో, మోర్గన్‌ పేర్కొన్న అనేకఅంశాలపై ఎంగెల్స్‌ చాలా విస్తృతంగా చర్చించాడు. లిఖిత చరిత్ర ముందరి దశలకు మోర్గన్‌ వేసిన బాటలవల్ల ఉత్తర అమెరికా తెగల్లో ఆయన కనుగొన్న కీలకమైన విషయాలు ఇప్పటివరకు ప్రాచీన గ్రీకు, రోమన్‌, జర్మన్‌ చరిత్రలకు సంబంధించిన అనేక పరిష్కారాలు దొరకని చిక్కుముళ్లకు సమాధానాలు చెప్పడంలో బాగా సహకరించాయ్‌ అంటాడు ఎంగెల్స్‌.
ఆటవిక యుగం ముందు దశ నుండి మొదలుకొని అనాగరిక యుగం ఎగువ దశ వరకూ మానవ వికాసం ఎలా జరిగిందన్నది శోధించడమే మోర్గన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. లక్షల సంవత్సరాల పరిణామం తర్వాత, మానవజాతి ఇతర ప్రాణికోటి నుంచి ఒక స్పష్టమైన అస్థిత్వాన్ని ప్రకటించుకున్నాక, నడిచిన అడుగుల జాడల అన్వేషణే మోర్గన్‌ చేసిన విశేష కృషి.
ఒక ప్రణాళికాబద్దంగా సేకరించిన విషయాల్ని గుదికూర్చారు మోర్గన్‌ ఈ మహా గ్రంధంలో. మొత్తం గ్రంధాన్ని నాలుగు భాగాలుగా విడగొట్టి, ఒక్కోభాగంలో కొన్ని ఉప ప్రకరణాలుగా చేర్చారు.
ఒకటో భాగంలో, మానవ మేధోవికాసం ఎలాజరిగిందో మూడు ప్రకరణాల్లో చెప్పారు. మానవ దశల్ని ఎంపిక చేసుకొని, వారి జీవన నైపుణ్యాల క్రమాన్ని వివరిస్తూ, పురోగతికి పునాదులెలా పడ్డాయో ఈ భాగంలో వివరించారు. మొదటి ప్రకరణంలో మోర్గన్‌, మానవ దశల్ని ఆటవిక యుగం, అనాగరిక యుగం, నాగరికదశలుగా విడగొట్టి, మళ్లీ ఆటవిక మరియు అనాగరిక యుగంలోని దిగువ, మధ్యస్థ, ఎగువ దశల్ని చర్చించారు. రెండో భాగంలో పదిహేను ప్రకరణాలున్నాయి. మోర్గన్‌ అసాధారణ పరిశోధనా కృషి అంతా ఈ ప్రకరణాల్లో చూస్తాం. అతి ప్రాచీన ఆదిమ దశల్లో స్త్రీ, పురుష భేదం ప్రాతిపదికన సామాజిక నిర్మితిని చూడటంకోసం మోర్గన్‌, ఇరాక్యూ, గనోవానియన్‌, అజిటెక్‌, గ్రీకు, రోమన్‌ తెగల మూలాల్ని గాఢంగా పరిశీలించారిందులో.
మూడో భాగంలో ఆరు ప్రకరణాలున్నాయి. మానవ జీవితంలో అతి ప్రాథమిక సాంఘికభావన పునాదికుటుంబం గురించి మోర్గన్‌ ఇందులో చర్చించారు. నాలుగో భాగంలో రెండే ప్రకరణాలున్నాయి. అయినప్పటికీ సమస్త మానవ విషాదాలకు మూలమైన అతికీలకమైన ఆస్థి భావన మూలాల్ని లాగి వారసత్వ నియమాలు ఎలా పుట్టుకొచ్చాయో గ్రీకు, రోమన్‌ హీబ్రూ తెగల అధ్యయనం ద్వారా వివరించే ప్రయత్నం చేశారు మోర్గన్‌.
పురాతన సమాజం లక్ష ఏళ్ళనాటి మానవజాతి మూలాల్ని స్పృశించినా, అరవైవేల యేళ్ళు ఆటవికయుగానికి పోగా, ఇరవై వేల యేళ్ళు అనాగరిక దిగువదశకూ, పదిహేనువేల యేళ్ళు అనాగరిక మధ్య, ఎగువ దశల పరిశీలనకు పోగా, ఇంక మిగిలిన ఐదువేల సంవత్సరాలు నాగరిక దశని స్థాలీ పులాకంగా చూస్తుంది.
తర్వాత మోర్గన్‌, అతిప్రాథమిక గణ నిర్మితిలో, ఆచార వ్యవహారాల పరిశీలన ద్వారా, నాయకత్వ విధానం, వివాహాలూ, లైంగిక సంబంధాలూ, సోదరీసోదరుల సంబంధాలు, రక్త సంబంధాలు, దత్తత, కుటుంబ యాజమాన్యం, రక్షణ, ప్రతీకారం, వలసపోవడం, ప్రాంతాల పేర్లు, భాష, గణాలకూ గణాలకూ మధ్య సంబంధాల విశ్లేషణా, తెగలూ, సమాఖ్యలూ, వాటి నిర్మాణాల్లో వైరుధ్యాలనూ, సాపత్యాలను ఎత్తిచూపడానికి మోర్గన్‌, విడిగా అస్థిత్వంలో ఉన్న ఆస్ట్రేలియన్‌ మరియు అమెరికన్‌ ఖండాల ఆదివాసీల గణ సమాజాలతో పాటూ, కలగాపులగపు ఆఫ్రికన్‌, గ్రీకు, రోమన్‌, మెక్సికన్‌, స్పానిష్‌ ఇంకా ఇతర తెగల్ని కూడా గణనలోకి తీసుకుంటారు.
మరో అతిముఖ్యమైన కుటుంబ రూపాల భావన మూలాల్ని వెలికితీయడానికి ఆయన విస్తృతంగా శ్రమించారు. అయిదు రకాల కుటుంబ వ్యవస్థల్ని స్థూలంగా విశ్లేషించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఆయా గ్రీకు, ఆర్యన్‌, సెమిటిక్‌, రోమన్‌, అరబిక్‌, రష్యన్‌ తెగల్లో, గణాల్లో వుండే అనేక విధి విధానాలనూ, అలవాట్లనూ, ఆచారాలనూ, వైవాహిక, బంధుత్వసంబంధాల్ని లోతుల్లోకివెళ్లి శోధించారు మోర్గన్‌.
చివరిగా మోర్గన్‌, వివిధ మానవజాతి దశల్లో ఆస్థి భావన ఎలా అభివృద్ధి పొందుతూ వచ్చిందో, యాజమాన్య హక్కులూ, వారసత్వం గురించీ ఎలాంటి నిబంధనలు మనుష్యులు ఏర్పరచుకున్నారో, ఆటవిక దశలో దీని మూలాలు ఎక్కడ వున్నాయో, వేర్వేరు అనాగరిక దశల్లో ఇవెలా పరిణామం చెందుతూ వచ్చాయోనన్నది లోతుగా పరిశోధించారు.
పురాతన సమాజం మన తాత ముత్తాతల ఆనవాళ్లు వెతుక్కునే ఒక అసాధారణ అన్వేషణ. మానవజాతి చరిత్ర ఒక అజరామర కావ్యం! తప్పొప్పుల తప్పటడుగులు ఎన్నున్నా, యావత్‌ ప్రాణికోటికి శిరోధార్యంగా, నిబ్బరంగా అనుగమించిన బృహత్కథ మనది! ఒక జాతిని వేరొక జాతీ, ఒక మనిషిని వేరొక మనిషీ పీడిరచని సమ సమాజం ఇంకా రానేలేదు! అప్పుడు కదా మనం నాగరీకులం! అది కదా మన తుది మజిలీ! అప్పుడు కదా ఈ గమనానికి పరమార్థం! ఈ వైనాన్నంతా కళ్ళకు కట్టిన మహనీయుడు మోర్గన్‌కు కృతజ్ఞతలు చెప్పుకుందాం వినమ్రంగా.
`వి.విజయకుమార్‌, 8555802596

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img