Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆగని కాంగ్రెస్‌ ఆందోళనలు

ర్యాలీకి ప్రయత్నం..అడ్డుకున్న పోలీసులు
న్యూదిల్లీ: ఎన్‌ఫోర్సుమెంటు డైరెక్టరేట్‌(ఈడీ)ని మోదీ సర్కారు దుర్వినియోగం చేస్తోందని, తమ పార్టీ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీని ఈడీ వేధిస్తోందని ఆరోపిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్‌ మంగళవారం సత్యాగ్రహం చేపట్టింది. ఆ తర్వాత జంతర్‌ మంతర్‌ వరకు ర్యాలీగా వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే అనుమతి లేదంటూ పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రులు అశోక్‌ గెహ్లాట్‌, భూపేశ్‌ బాఘెల్‌ సహా సీనియర్‌ నేతలు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనకు మాత్రమే అనుమతి ఉందని, ర్యాలీ నిర్వహిస్తామంటే అనుమతించేది లేదని పోలీసులు స్పష్టంచేశారు. పోలీసులు అడ్డుకోవడంతో బాఘెల్‌ తన మద్దతుదారులతో కలిసి రోడ్డుపైనే బైఠాయించారు. బీజేపీ నేతలను ఫాసిస్టులుగా అశోక్‌ గెహ్లాట్‌ నిందించారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో ఉన్న వారిని వేధిస్తున్నారని చెప్పారు. ‘బీజేపీ నాయకులు ఫాసిస్టులు. ప్రజాస్వామ్యం ముసుగు ధరించారు. ఒకవర్గంపై మరో వర్గాన్ని ఉసిగొల్పడం ద్వారా ప్రజల్లో అంతరాలు సృష్టించడానికి కుట్ర చేస్తున్నారు. సామాజిక పొందికను దెబ్బతీస్తున్నారు’ అని గెహ్లాట్‌ విమర్శించారు. ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా సత్యాగ్రహం కొనసాగిద్దామని కార్యకర్తలకు హితబోధ చేశారు. ఏఐసీసీ కార్యాలయం చుట్టూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే, ఆగ్రహోదగ్రులైన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు కొన్ని బారికేడ్లను బ్దదలు కొట్టారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగానూ కాంగ్రెస్‌ కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి అగ్నిపథ్‌ ఓ కుట్ర అని విమర్శించారు. ఈ పథకం యువతరాన్ని అంధకారంలోకి తీసుకెళుతుందని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img