Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆత్మప్రబోధానుసారం ఓటేయండి

జేడీఎస్‌ ఎమ్మెల్యేలకు సిద్ధరామయ్య లేఖ
బెంగళూరు: రాజ్యసభ ఎన్నికల్లో ఆత్మప్రబోధానుసారం ఓటేయాల్సిందిగా జేడీఎస్‌ శాసనసభ్యులకు కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఎమ్మెల్యేలకు గురువారం బహిరంగ లేఖ రాశారు. తమ పార్టీకి చెందిన రెండో అభ్యర్థి మన్సూర్‌ అలీఖాన్‌కు అనుకూలంగా ఓటు వేయాలని సూచించారు. అలీఖాన్‌ విజయం రెండు పార్టీలు అనుసరించే లౌకిక సిద్ధాంతం విజయానికి దోహదపడుతుందని సిద్ధరామయ్య పేర్కొన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు సిద్ధరామయ్య లేఖ రాయడాన్ని జేడీఎస్‌ నేత కుమారస్వామి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంపై నామినేషన్లకు ముందే తమ పార్టీ నాయకులతో సంప్రదించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేదేకాదని కుమారస్వామి పేర్కొన్నారు. మైనారిటీ అభ్యర్థికి మద్దతివ్వాలని సిద్ధరామయ్య లేఖ రాశారని, అలాంటప్పుడు మన్సూర్‌ అలీఖాన్‌ను మొదటి అభ్యర్థిగా కాకుండా జైరామ్‌ రమేశ్‌ను ఎందుకు ప్రకటించారని ఆయన ప్రశ్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి జేడీఎస్‌ బీ టీమ్‌ అని పదేపదే ప్రచారం చేసిన సిద్ధరామయ్య…ఆశ్చర్యకరంగా ఇప్పుడు లౌకిక పార్టీ అంటూ లేఖలో తెలిపారు. జేడీఎస్‌ అభ్యర్థి కుపేంద్రరెడ్డికి మద్దతివ్వాలని కుమారస్వామి విజ్ఞప్తి చేసిన వెంటనే సిద్ధరామయ్య లేఖ రాశారు. ఈ రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుపు లౌకికవాదానికి జీవన్మరణ సమస్యగా ఉంది. సైద్ధాంతికంగా కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఒకవైపున ఉండగా మతోన్మాదమే ఊపిరిగా బీజేపీ బతుకుతోంది. తమ రెండో అభ్యర్థి మన్సూర్‌ అలీఖాన్‌ గెలుపు, ఓటమి కోసం మైనారిటీలే కాకుండా లౌకికవాదులంతా ఆతృతగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని సిద్ధరామయ్య తెలిపారు. అలీఖాన్‌ గెలుపు ఏ ఒక్క రాజకీయ పార్టీ విజయమో కాదని, లౌకికసిద్ధాంతం విజయమని స్పష్టంచేశారు. ప్రజాప్రతినిధిగా ఆత్మప్రబోధానుసారం ఓటేయడం తమ కర్తవ్యమని, అందువల్ల లౌకికవాదానికి నిబద్ధుడైన అలీఖాన్‌కు ఓటేయాలని సిద్ధరామయ్య కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img