Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఉపపోరులో బీజేపీకి ఎదురుదెబ్బ

బెంగాల్‌లో రెండు సీట్లు గెలుచుకున్న తృణమూల్‌
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఒక లోక్‌సభ, ఒక అసెంబ్లీకి జరిగిన ఉపఎన్నికలో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అసన్‌సోల్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తృణమూల్‌ తరపున పోటీ చేసిన రాజకీయ వేత్తగా మారిన నటుడు, కేంద్ర మాజీమంత్రి శత్రుఘ్నసిన్హా అద్భుత విజయం సాధించారు. ప్రతిష్ఠాత్మక బాలిగంజ్‌ నియోజకవర్గం నుంచి తృణమూల్‌ అభ్యర్థి బాబుల్‌ సుప్రియో గెలుపొందారు. 2019లో అసన్‌సోల్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బాబుల్‌ సుప్రియో తృణమూల్‌ అభ్యర్థి మూన్‌మూన్‌ సేన్‌పై విజయం సాధించారు. ఎంపీ పదవికి బాబుల్‌ సుప్రియో రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. బాలిగంజ్‌ నుంచి సీపీఎం అభ్యర్థి సైరా షా హలీమ్‌పై బాబుల్‌ సుప్రియో గెలిచారు. ఇక్కడ రెండోస్థానంలో సీపీఎం అభ్యర్థి నిలవడం గమనార్హం. విజయం సాధిస్తామని ప్రగల్భాలు పలికిన బీజేపీ కేవలం మూడోస్థానంలో నిలిచింది. బాబుల్‌ సుప్రియో సీపీఎం అభ్యర్థిపై 20,228 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సుప్రియోకు 51,199 ఓట్లు రాగా హలీమ్‌కు 30,971 ఓట్లు లభించాయి. మూడోస్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి కెయా ఘోష్‌కు కేవలం 13,220 ఓట్లు దక్కాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి కమ్రుజ్జమన్‌ చౌదరికి 5,218 ఓట్లు లభించాయి. రాష్ట్రంలో వామపక్ష సంఘటన తిరిగి పుంజుకుంటుందని సీపీఎం నేతలు చెప్పారు. అసన్‌సోల్‌, బాలిగంజ్‌ నియోజకవర్గ ఓటర్లకు సీఎం మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు. రెండుచోట్ల తమ పార్టీ అభ్యర్థులను గెలిపించినందుకు సంతోషం వెలిబుచ్చారు. రాష్ట్ర ప్రజలకు తమపై నమ్మకం ఉందని, అందుకే గెలిపించారని చెప్పారు. పెరుగుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదలపై ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారని తృణమూల్‌ నేత ఫర్హద్‌ హకీం వ్యాఖ్యానించారు. అందుకే బీజేపీని ప్రజలు ఆదరించలేదన్నారు. రోమ్‌ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించుకున్న చందంగా బీజేపీ కేంద్ర నాయకత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. తన విజయానికి తోడ్పడిన అసన్‌సోల్‌ ప్రజలకు, సీఎం మమతకు శత్రుఘ్నసిన్హా కృతజ్ఞతలు తెలిపారు.
బీజేపీ అహంపై దెబ్బ: సుప్రియో
బెంగాల్‌లో అసన్‌సోల్‌, బాలిగంజ్‌ స్థానాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ను గెలిపించి బీజేపీ అహంపై ప్రజలు దెబ్బకొట్టారని బాలిగంజ్‌ తృణమూల్‌ అభ్యర్థి బాబుల్‌ సుప్రియో పేర్కొన్నారు. అసన్‌సోల్‌లో తృణమూల్‌ గెలుపు న్యాయమైనదని, అసన్‌సోల్‌లో గతంలో తన సొంత ప్రతిష్ఠతోనే గెలిచానని, ఇప్పుడు బీజేపీ అహాన్ని ప్రజలు దెబ్బతీశారని సుప్రియో చెప్పారు. ఈ విజయం ముమ్మాటికీ మమత ఘనతేనని తెలిపారు.
చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ విజయం
రాజ్‌నందగావ్‌: చత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. జనతా కాంగ్రెస్‌ చత్తీస్‌గఢ్‌(జె) ఎమ్మెల్యే దేవవ్రత్‌సింగ్‌ గతేడాది నవంబరులో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీ అభ్యర్థి కోమల్‌ జంఘెల్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థి యశోదా వర్మ గెలుపొందారు. పదిమంది అభ్యర్థులు పోటీలో ఉన్నా కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ జరిగింది. జేసీసీ(జె) తన స్థానాన్ని నిలుపుకోలేకపోయింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img