Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

బీజేపీ పాలనలో రాష్ట్రం నేరాలమయం

అఖిలేశ్‌ ట్వీట్‌
ప్రయాగ్‌రాజ్‌ : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ జిల్లాలో ముగ్గురు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో స్పందించిన ప్రతిపక్ష నేత బీజేపీ 2.0 పాలన నేరాల మయంగా మారిందంటూ ట్వీట్‌ చేయడం సంచలనంగా మారింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే జిల్లాలోని నవాబ్‌గంజ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఖగల్‌పూర్‌ గ్రామంలో నివాసం ఉంటున్న రాహుల్‌ అతని భార్య ప్రీతి సహా ముగ్గురు పిల్లలు వారి ఇంటిలోనే మృతి చెందారు. వీరిది ఆత్మహ్యత్య అనుకునేలా రాహుల్‌ ఉరి వేసుకుని మృతి చెందినట్టు చిత్రించే ప్రయత్నం చేసినట్టు స్పష్టంగా ఉండడంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ రాహుల్‌ కుటుంబం శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడినట్టు తమకు సమాచారం అందడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నట్టు తెలిపారు. రాహుల్‌ మృతదేహం ఇంటి సీలింగ్‌కు చీరతో ఉరి వేసుకున్న స్థితిలో ఉందని ఆయన శరీరంపై ఎటువంటి గాయాలు లేవని తెలిపారు. అయితే భార్య ప్రీతి, పిల్లలు మహి, పిహు, కుహుల మృతదేహాలపై పదునైన ఆయుధాలతో దాడి చేసిన గాయాల గుర్తులు ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. తొలుత ఆత్మహత్య అని భావించామని, శరీరాలపై గాయాలు ఉండడంతో హత్య కోణం దాగి ఉంటుందనే అనుమానంతో రెండు వైపుల దర్యాప్తు చేస్తోన్నట్టు తెలిపారు. ఈ కేసు విచారణ కోసం ఏడు దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ఘటనా స్థలంలో ఫొరెన్సిక్‌ బృందం ఆధారాలు సేకరించిందని తెలిపారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో బీజేపీ పాలనలో శాంతి భద్రతలు లేవంటూ అఖిలేశ్‌ చేసిన ట్వీట్‌ రాజకీయ రంగుపులుముకోవడంతో ప్రయాగ్‌రాజ్‌ జోన్‌ అదనపు డీజీపీ ప్రేమ్‌ ప్రకాశ్‌ స్పందించారు. అఖిలేశ్‌ యాదవ్‌ ట్వీట్‌కు సమాధానంగా రాహుల్‌ కుటుంబం వారి కుటుంబ అంత:కలహాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్టు ట్వీట్‌ చేశారు. రాహుల్‌ ముందు భార్య పిల్లల్ని హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img