Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఉపాధ్యాయులే జాతి నిర్మాతలు

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌
44 మందికి జాతీయ అవార్డుల ప్రదానం

న్యూదిల్లీ : ఉత్తమ ఉపాధ్యాయులే జాతి నిర్మాతలు.. వారి చేతుల్లో భావితరాల భవిష్యత్తు భద్రమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కొనియాడారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆదివారం రాష్ట్రపతి, ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేశారు. కోవిడ్‌-19 నిబంధనల మేరకు ఈ కార్యక్రమం వర్చువల్‌ విధానంలో జరిగింది. వినూత్న బోధనా పద్దతులను అభివృద్ధి చేసి, పిల్లల బంగారు భవిష్యత్తును నిర్మించినందుకుగాను ఈ ఏడాది 44 మంది ఉపాధ్యాయులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సత్కరించారు. .వీరిలో హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, జమ్మూకశ్మీరు, కార్గిల్‌లకు చెందిన ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ సందర్భంగా రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగిస్తూ.. ఉపాధ్యాయులందరినీ అభినందించారు. ‘ప్రతి పిల్లవాడు ఓ ప్రత్యేకప్రతిభను కలిగి ఉంటాడు. వివిధ రకాల మానసిక స్థితులు, సామాజిక నేపథ్యాలతో ఉంటారు. పిల్లల అవసరాలు, ఆసక్తులు, సామార్థ్యాలకు అనుగుణంగా అన్ని కోణాల్లో ఉపాధ్యాయులు తీర్చిదిద్దాల్సి ఉంటుంది. పిల్లల్లో చదువుపై ఆసక్తిని రేకెత్తేలా చేయడం ఉపాధ్యాయుల కర్తవ్యం. సరైన ఉపాధ్యాయుడు తమ పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా ఎదిగేలా తోడ్పడతాడు. రాజ్యాంగ విలువలపై గౌరవం పెంపొందేలా మన విద్యా వ్యవస్థ ఉండాలి’’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రతిభావంతులైన ఉపాధ్యాయుల గురించి తెలుసుకున్న తర్వాత, వారి చేతుల్లో భావి తరం భవిష్యత్తు భద్రంగా ఉందనే భరోసా తనకు కలిగిందన్నారు. మాజీ రాష్ట్రపతి, ఉపాధ్యాయుడు డైన డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ గుర్తుగా ఉపాధ్యాయ దినోత్సవాలను జరుపుకుంటున్నామన్నారు. ఆయన ప్రపంచంలో గొప్ప తత్త్వవేత్త, పండితుడు అని తెలిపారు. తాను ఉపాధ్యాయునిగానే అందరి మనసుల్లో గుర్తుండిపోవాలని ఆయన కోరుకునేవారన్నారు. గొప్ప ఉపాధ్యాయునిగా ఆయన చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 1888 సెప్టెంబరు 5న జన్మించారు. గొప్ప తత్త్వవేత్తగా ఆయనకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది.
భారత తొలి ఉప రాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా సేవలందించారు. ఆయనను ‘భారత రత్న’తో ప్రభుత్వం గౌరవించింది. డాక్టర్‌ రాధాకృష్ణన్‌ వద్ద చదువుకున్న కొందరు విద్యార్థులు ఒకసారి ఆయన వద్దకు వెళ్ళి, ఆయన జన్మదినోత్సవాలను జరుపుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. అందుకు ఆయన బదులిస్తూ, తన జన్మదినంనాడు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవాలను నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img