Friday, April 26, 2024
Friday, April 26, 2024

గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌కు అంతిమ వీడ్కోలు

భోపాల్‌ : తమిళనాడులో గతవారం హెలికాప్టర్‌ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించిన గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ భౌతికకాయానికి శుక్రవారం భోపాల్‌లో పూర్తి సైనిక, రాష్ట్ర గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. పూలమాలలు వేసిన ఆర్మీ ట్రక్‌లో త్రివర్ణ పతాకంతో చుట్టిన వరుణ్‌ సింగ్‌ భౌతికకాయాన్ని ఇక్కడి మిలటరీ హాస్పిటల్‌ నుండి బైరాగఢ్‌ ప్రాంతంలోని శ్మశాన వాటికకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ప్రజలు ‘భారత్‌ మాతాకీ జై’, ‘గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ అమర్‌ రహే’ అంటూ నినాదాలు చేశారు. భౌతికకాయం శ్మశాన వాటికకు చేరుకోగానే, రక్షణ దళాల సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత సీనియర్‌ సర్వీస్‌ అధికారులు గ్రూప్‌ కెప్టెన్‌ శవపేటికపై పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వరుణ్‌ సింగ్‌ తమ్ముడు, భారత నావికాదళంలో లెఫ్టినెంట్‌ కమాండర్‌, ఆయన కుమారుడు చితిని వెలిగించారు. సింగ్‌ భార్య, కుమార్తె, అతని తండ్రి కల్నల్‌ కె.పి.సింగ్‌ (రిటైర్డ్‌), తల్లి ఉమాతో పాటు ఇతర సన్నిహిత బంధువులు కూడా అక్కడ ఉన్నారు. వరుణ్‌ సింగ్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. డిసెంబర్‌ 8న తమిళనాడులో హెలికాప్టర్‌ కూలిపోయిన ఘటనలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, అతని భార్య, 11 మంది సాయుధ దళాల సిబ్బంది మరణించగా, తీవ్ర గాయాలతో బయటపడిన గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ చికిత్స పొందుతూ బుధవారం బెంగళూరులోని సైనిక ఆసుపత్రిలో మరణించారు. తన తేజస్‌ యుద్ధ విమానానికి సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు ఆదర్శవంతమైన ప్రశాంతతను, నైపుణ్యాన్ని ప్రదర్శించినందుకు ఈ వైమానిక దళ యోధుడికి ఈ ఏడాది ఆగస్టులో దేశ అత్యున్నత శాంతి శౌర్య పురస్కారం అయిన శౌర్య చక్రను ప్రదానం చేశారు. అద్భుతమైన టెస్ట్‌ పైలట్‌గా పేరుగాంచిన 39 ఏళ్ల అధికారికి భార్య, 11 ఏళ్ల కుమారుడు, ఎనిమిదేళ్ల కుమార్తె ఉన్నారు. ఆయన తమ్ముడు తనూజ్‌ సింగ్‌ భారత నావికాదళంలో లెఫ్టినెంట్‌ కమాండర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గ్రూప్‌ కెప్టెన్‌ కుటుంబం వాస్తవానికి ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌కు చెందినవారు. హెలికాప్టర్‌ కూలిన ఘటనలో తీవ్రంగా కాలిన గాయాలతో తమిళనాడులోని వెల్లింగ్టన్‌లోని ఒక ఆసుపత్రిలో చేరారు. ఒక రోజు తరువాత, ఆయనను బెంగళూరులోని కమాండ్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే దాదాపు వారం రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన వరుణ్‌ సింగ్‌ బుధవారం మరణించారు. కాగా గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ కుటుంబానికి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం కోటి రూపాయల ‘సమ్మాన్‌ నిధి’ అందజేస్తుందని మధ్య ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చౌహాన్‌ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తుందని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img